Tuesday, 17 November 2015

ఏక్ తారలు : 00001 నుండి 00100 వరకు

1. నీ చెలిమి చేతికందింది_సెలయేరై నన్ను చేరినందుకే..
2. మాటలైన భావాలెన్న_పెదవిని దాటి ముత్యాలై ప్రవహిస్తూ
3. జీవితం జారిపోయింది_కుండతో పోల్చి మోయాలనుకొని పొరబడ్డందుకేమో..
4. రవళిస్తున్నా రాగాలను_నీ అనురాగం పల్లవిని జోడించిందనే..
5. ఆనందమై వచ్చేసా_నీ పిలుపు తరంగమై వినబడగానే
6. ఆనందాన్ని రాల్చేసా_భాష్పాల భాష్యం నిన్ను చేరుతుందనే.
7. జలపాతమై ఉరకలెత్తేసా_మదిలో నువ్వు తుళ్ళింతలాడుతుంటే
8. నేటి సంతోషం ఆవిరయ్యింది_నిన్నటి వియోగం గుర్తుకొచ్చి.
9. ఈ క్షణమే పుట్టినట్లుంది_నీ మాటలు మైమరపిస్తుంటే..
10. నవ్వులతో కవ్విస్తావెందుకో_చూపులకే నే చిత్తరువునై నిలుచుంటే.
11. కన్నులతో గాలాలెందుకో_చూపులకి చిక్కుకున్నానని తెలిసినందుకా..
12. పులకరింతకే పరిమళిస్తున్నా_నీ ఊసులను పూసుకున్నందుకు..
13. ఆనందం చీకటిపాలు_విశృంఖల నాగరికతలో..
14. పదిమందిలో సజీవమేగా_మరణించినా గుర్తున్నామంటే..
15. వశమయ్యింది మనసప్పుడే_నీ మీద ప్రేమైనప్పుడే..
16. మంచిపన్లు చేయడం నేర్పానందుకే_నువ్వెప్పుడూ సజీవమై ఉండాలనే
17. కురుస్తూనే ఉంది గతం_ఆనందాన్ని లెక్కిస్తున్నప్పటి నుండీ
18. పలుకులు గారాలు కురవాలనే_ఊసులకు ఉరకలు నేర్పాను..
19. నిన్నలు వెంటాడుతున్నవి_రేపటికని నేను ఉరకలేసినప్పుడల్లా
20. ఒయారాన్ని ఊసులకు ఒప్పజెప్పా_నీ మనసును ఊయలూపమనే
21. కాలానికి గాయమయ్యింది_మనసు కోతలకు గురవ్వుతుంటే..
22. కాలామెంత పరుగులో_వెంట పడేకొద్దీ వేగిరపడుతూ..
23. ఆసన్నమైన మృత్యువడుగుతోంది_బ్రతికి సాధించిందేమిటని..
24. కన్నుల్లో విరులను పూయించా_నీ ఆహ్వానం అందిందనే
25. నిన్ను గెలిస్తే చాలనుకున్నా_నా గెలుపు నువ్వేనని..
26. నిద్దురకీ లోకువైపోయా_రాతిరంతా నిన్ను జపించాననే..
27. కలలకెప్పుడూ కరువేగా_నిద్దురే నన్ను దరిచేరనంటుంటే..
28. ఓటమెందుకో బెదిరిపోతోంది_నా గెలుపు నువ్వని కనిపెట్టినందుకేమో..
29. ఏకాంతమెక్కడ మిగిలింది_ఇందరు కాంతలు కాంతిలా చుట్టుముట్టాక
30. నీరంలో మెరవమన్నా_చూపుల వెలుగు చప్పుడైనా వినబడాలనే
31. కనికట్టు చేసి లాగేస్తున్నావుగా_నిద్దురకు నీళ్ళివ్వమంటూ
32. విరులకందుకే పరిమళమిచ్చా_నిన్ను వెంటనే ఆకట్టుకోమనే
33. పలుకుల పదునుకి కందిపోతున్నా_సుతారంగా మీటావని గ్రహించుకున్నాక
34. పున్నాగుపువ్వునైనా కాకపోతిననుకున్నా_ఒక్కమారైనా నిన్నల్లి మెప్పించేందుకు..
35. శృతి కానందుకే మిగిలున్నా_నీలో లయమై లీనమయ్యేందుకే
36. మృదుపాణివని గ్రహించా_కొత్తరాగాలను నాలో నువ్వు కనిపెట్టినందుకే
37. దీపావళిని గమనించా_నీ మోము వెలుతురులోనే
38. నీ అడుగులెంత వేగిరమో_నా పిలుపులకే స్పందిస్తూ..
39. కార్తీక పున్నమి వెన్నెలవ్వాలనుకున్నా_నీ మనసులో..
40. నీ పదములెంత లాలిత్యమో_నన్ను ఓలలాడిస్తూ..
41. నా కన్నులకెంత కలవరమో_నీ మనసు నొచ్చుకుంటుంటే..
42. గిరగిరా తిరిగినట్లుంది ఆనందం_నువ్వలా వెన్నెల్లో ముంచుతుంటే..
43. చూపు తత్తరపడుతోంది_కన్నుల్లో నువ్వు కలదిరిగినందుకేమో
44. మలయమారుతంలో కలిసానందుకే_నిన్నోమారు గాలిలో విహరింపజేయాలని..
45. నీ మనసెంత నవనీతమో_నా పలకరింపులో
46. ముభావమూ ముగ్ధమైపోదా_నువ్వలా మోజులు కురిపిస్తుంటే
47. జాజులను పరచి ఉంచా_నీ పాదాలకు తివాచీ కావాలనే
48. కాలపు గిచ్చుళ్ళు_కార్తీకపు చల్లదనానికి నీ వియోగం తోడై..
49. వెన్నెలకెంత వేడో_నీ సరాగాన్ని జత చేసి నే పాడుతుంటే..
50. ఒయారం వలసొచ్చినట్లుంది_కిన్నెరసాని ఒంపులన్నీ నీలో కనబడుతుంటే..
51. శూన్యమూ శబ్దిస్తోంది_నువ్వు ఆస్వాదించే గీతం తానైనందుకే
52. కొన్ని ప్రణయాలు విషాదమవుతాయి_విరహంగా మిగిలి వేదనవుతూ..
53. పరిమళిస్తున్న భావకవనం_మదిని మీటేకొద్దీ ఆనందం గుభాళిస్తూ
54. విధిని వెక్కిరించలేకున్నా_రాతల్లోనైన మనసుని సజీవం చేస్తోందని..
55. అనురాగం అంబరమయ్యింది_ఆనందం కెరటమై హృదిని ముంచేస్తుంటే..
56. సైకతంలో గవ్వనై పడి ఉన్నా_కెరటాలు సైతం పట్టించుకోలేదని..
57. ఊసుల సందడి మొదలైంది_అలవై నీవు వలలేస్తుంటే..
58. అద్భుతం నేలకు జారింది_కెరటమై నువ్వు చేయి చాచి పిలిచావనే..
59. నింగిని వీడిన జాబిల్లి_నీ పిలుపు తరంగాలకు..
60. బంధం మురిసిపోయింది_అందాన్ని అలవై అలవోకగా చుట్టావని..
61. తారలకెన్ని తొందరలో_జాబిల్లిని అలల నీడలో చూసేందుకు..
62. తీరముతో సంబంధమే అలలకు_ఎదురెళ్ళి దోబూచులాడుతూ...
63. సినీతారను కాదుగా_నీ కలలో అలనై వచ్చేందుకు..
64. చూపులతో నిర్దేశనం చేసాను_తరంగమై నువ్వు తారాడుతున్నావని..
65. కలలో జారిన జ్ఞాపకాలు_అలలై నిన్ను చేరే వీలుందక్కడేనని..
66. కలవరపెడుతున్న నీ భావాలు_కెరటాలై నన్ను నిలువెల్లా ముంచేస్తూ..
67. రేయి గడిచింది నీ ధ్యానములో_కన్నీరు అలలై పొంగుతు ఉంటే..
68. పగటికలలను పొలిమేరకంపాను_రాతిరి కలలో కెరటమై నువ్వొస్తావనే..
69. కన్నులు తెరిచిన మనసు_కెరటమై నిన్ను చేరాలనే..
70. పగలు వగలై కురిసాయి_రాతిరి దాచుకున్న అలల చెమరింపుతో..  
71. నిద్దుర మరచిన కన్నులు_నీ జ్ఞాపకాల అలలకు కొట్టుకుపోతూ..
72. ఆరుకాలాలూ ఏకమైన భావన_సంతోషం అలలై ఎదను మీటుతుంటే..
73. అరవిరిసిన నవ్వుల తరంగాలు_మధుమాసమైన నిన్నూహిస్తుంటే..
74. చెమరింపు స్పృశించా నా నయనాలతో_నీ మది కెరటాన్ని చేరలేననే..
75. నీలిమబ్బు సోయగం_అలను తనవైపు ఆకర్షించుకుంటూ..
76. తరంగాలైన సప్తస్వరాలు_నవరాగాలతో మదిని అలరిస్తూ..
77. మౌనాన్నెప్పుడో సాగనంపేసా_నీ ఊసుల కెరటంలో తేలిపోతూ..
78. మేఘాన్ని తాకాలనుకుందొక అల_సముద్రంతో కలిసినట్లు కనిపించిందనే..
79. తాపంలో తీర్చేసా తగువు_వలపు అలలో నువ్వు ఊగుతూ ఉంటే..
80. ఆనందం పరుగు తీస్తోంది_నీలిమబ్బుల అలలకు ముచ్చట పడినందుకే..
81. అలలన్నీ అలుకలైపోయే_దరహాసాల నా దోబూచులాటలకి..
82. జలతారు మెరుపులేవో నా కన్నుల్లో_మధురభావాలు అలలై పెనవేసుకుంటే..
83. దిక్కులు చూస్తున్నావెందుకో_కెరటమై ముందుకు సాగమనంటుంటే..
84. జాబిలి కోసం ఎదురు చూస్తున్నా_తారనై తరంగమాడాలనే..
85. నువ్వు గుర్తొస్తే చాలుగా_వెల్లువవును భావతరంగాలు నాలో..
86. మదిలో గోదరి అలై పొంగింది_భావావేశానికి సమయమయ్యిందనుకుంటా..
87. తరంగమైంది దుఃఖం_ఎంతసేపూ లోపాలనే గుర్తిస్తుంటే లోకం..
88. కడలి హృదయపు అలలోనుండి పిలుపు_మేఘాన్ని వేంచేయమంటూ..
89. తరంగమవుతూ నీ తలపులు_మనసును మధురం చేసేస్తూ..
90. కెరటమై ఒక్కమారొచ్చినా చాలనుకున్నా_ఆనందానికి సాగిల పడదామని..
91. కలవరించింది నన్నేననుకున్నా_చిలిపి అలనై కలలోకి రమ్మన్నావని..
92. నవపల్లవాలకు మౌనమెందుకో_తరంగమై చిరుగాలి ఊసులాడుతుంటే..
93. కెరటానికెప్పుడూ కంగారే_నా ఆనందమంతా తనలో ఇముడ్చుకోవాలని..
94. చెలిని అనుకరించింది అల_అలుకల్లో తనని మించి చూపుతానంటూ..
95. నీలో విరహాగ్ని కెరటమయ్యిందేమో_తన పరిమళాన్ని నాకు పూసేస్తూ..
96. చెలియలకట్ట దాటిన అలలు_భావతీరాన్ని ముంచెత్తాలని..
97. నా చూపు నిన్ను వరించింది_తరంగమై నువ్వు అల్లుకున్నావనే..
98. జలతరంగాల లయలు_నాకిష్టమైన పాటలను పాడుతుంటే తాను ఆస్వాదిస్తూ..
99. ఉత్తుంగమైంది మానసం_అలలు ఉవ్వెత్తున పలకరించి పిలిచినందుకే...
100. అలసిపోయిన తరంగమనుకుంటా_మంద్రంగా వీస్తూనే మత్తెక్కిస్తూ..

No comments:

Post a Comment