Wednesday, 13 September 2017

3901 to 4000

3901. వసంతమిప్పుడే తడిమిందిలా_అతిశయించిన శిశిరాన్నింక సాగనింపమంటూ..
3902. శిశిరానికి మాటలు రావనుకున్నా_తానుగా కన్నీరై కదిలిపోతుంటే..
3903. అనంతమైన భావ సందడి_మది మదిలో తారలు వెలుగుతుండగా..
3904. తారల ఆనందమిప్పుడు తెలుస్తోంది_పగలు తమ ఉనికి స్పష్టమైనందుకు..
3905. కోయిలతో దాగుడు మూతలెందుకో_అనుకరిస్తుంది తన సంగీతాన్నైనప్పుడు..
3906. గాలెందుకు ఈలలు వేస్తుందో_కోయిలతో నేను ముచ్చట్లాడుతుంటే..
3907. కోయిలందుకే అలిగినట్లుంది_సమీరానికీ నాకూ నేస్తం కుదిరిందని..
3908. బుజ్జగించాలిప్పుడా కోయిలను_నా మాటలకు గంధాన్ని పులిమైనా సరే..
3909. కృష్ణస్వామెప్పుడూ మదిలోనేగా_తలిచే అవసరమే లేదుగా పదేపదే..
3910. అక్షరాలకెన్ని గారడీలు తెలుసో_మనసు మాటల్లోకి అనువదించువేళ..
3911. అక్షరాలే కదిపి లేపాలనుకుంటా_నిద్దురలో సమయాన్ని వృధచేస్తుంటే..
3912. నయనానందం ఊహించగలుగుతున్నా_ఈ రాగమలా చెవిని సోకుతుంటే..
3913. సమయానికి తెలియని విద్యే లేదుగా_కీలుబొమ్మలమందుకేగా మనం..
3914. దీపం ఒక్కటైనా చాలుగా_నిరాశను పంపేందుకు దీపావళెందుకు.. 
3915. రాగాలన్నీ నా సొంతమేగా_నువ్వెక్కడ మీటినా వగలొలికిస్తూ.. 
3916. అనునయమైపోతున్నా_నా అలుక వీడి నీ అనురాగంలోనే..
3917. ఆశలకెప్పుడూ విజయాలే_చివురించిన కోరిక నీవల్ల తీరిందంటే..
3918. సంగీతం ప్రాణమైంది_స్వర సమ్మేళనాలన్నిటా నువ్వుంటుంటే..
3919. వలపు నాకో వ్యసనమవుతుంది_నీ మాటల్లో మునకలేసినప్పుడల్లా..
3920. వలపు నిద్దురలేచిందిప్పుడే మరి_వేకువొచ్చి నిలదీస్తే ఏంచేస్తాం..
3921. నా మనసు తడుస్తూనే ఉంది_నీ భావాలు కురిసినప్పుడల్లా..
3922. నా మనసు తడుస్తూనే ఉంది_నీ భావాలు కురిసినప్పుడల్లా..
3923. ఈ ఉదయం రసోదయమే_నీ వలపు ఊయలూపి లేపినందుకు..
3924. నేనెప్పుడూ అల్లరినే_నీ చూపు గిచ్చుళ్ళకు స్పందించాలనుకుంటే..
3925. మనసెందుకో తుళ్ళిపడుతుంది_అధికారమంటూ నువ్వు ప్రశ్నిస్తుంటే..
3926. నా ఉదయం నీదంటున్నా_నాకై ఎదురుచూపుల కేకలు మిన్నంటుతుంటే..
3927. చిలిపి చకోరమై నేను_ప్రణయానికి నువ్వు రమ్మన్నప్పుడల్లా..
3928. నాలో పాటలన్నీ ప్రియమైనవే_పాడుతున్నది నీ కొరకైనందుకు..
3929. నేనో వసంతమని గుర్తించినట్లున్నావుగా_అందుకే స్వరాలాపన..
3930. నన్ను కలగన్నది నిజమన్నావనే_ఉగాదినై నేనొచ్చేసా..
3931. ఆగని తలపులన్నీ నావేగా_నీలో తాపమిలా రేగినందుకు..
3932. మనసెప్పుడో నీ పరం చేసా_అందనంత దూరంలో మనముంటున్న..
3933. నేనైతే శుక్లపక్షాన్ని అనుసరిస్తున్నా_కృష్ణపక్షం నిన్న కదిలిపోయిందనే..
3934. ముగ్ధురాల్ని కాక తప్పలేదు_గీతనంత ప్రేరణాత్మకంగా వర్ణిస్తుంటే
3935. భావాలెన్నుంటేనేమి_ఒక్కటీ అనుభూతికి అందనంటుంటే..
3936. నా భావాలు తామరతంపరలు_వెన్నెల దీపాలై తారల్లోకెల్లా..
3937. అక్షరాలంతే_పెదవినంటకున్నా కలాన్నంటి పరిమళిస్తాయి..
3938. వెన్నెలతో పనేముందనుకున్నా_తారవై వెలుగునిస్తూ నువ్వున్నందుకు
3939. ఒంటరయ్యిందట గాలి_నువ్వూ నేను ఏకమై దాన్ని తరిమేసినందుకే
3940. రేయికెన్ని కలలు కానుకిస్తేనేమి_నిజమయ్యే ప్రయత్నమేదీ చేయలేదుగా..
3941. మనసయ్యిందప్పుడే_నువ్వూ నేనంటూ మనల్ని విడదీయనప్పుడే..
3942. ఎన్ని చూపులు చెమ్మగిల్లాయో_మనమంటూ నువ్వు కలుపుకోగానే
3943. పట్నంలో పచ్చకోక వెతుకుతావెందుకో_పచ్చదనమెప్పుడో కురచయ్యిందంటే..
3944. కలలోకందుకే రానన్నా_నీ రెప్పలెప్పటికీ నిద్దురను దరిచేరనివ్వవనే..
3945.  నీ గీతల్లో నేను_లావణ్యాలు దిద్దుకున్న సౌందర్యాన్నేగా
3946. అందుకున్నా నీ మనోకామన_ఉగాదివై నన్ను రమ్మనగానే
3947. నేనో జాబిల్లినే_కలలో తప్ప ఇలలో ఎదురుపడేదుండదుగా..
3948. స్వయంవరం అందుకే వద్దనుకున్నా_ప్రేమవై నువ్వెన్నడో వరించేసావని..
3949. నీ కధలన్నీ సుస్పష్టమే_నాలో కవితని పాడుకున్నావంటే.
3950. నా ప్రతిపదంలో నువ్వు_నానార్ధం వెతికినా నువ్వే కనిపిస్తూ..
3951. నీతోడుగా పయనించాలనుంది_తారెలెన్నున్నా చీకటికి భయమవుతుంటే..
3952. కవ్వింతలు నిజమని నమ్మేవు_నేనో కలలకు నాయికని..
3953. వెన్నెలతో పనేముందిక_చీకటిలో చిరుదీపమై నీకు నేనున్నాక..
3954. నువ్వో భక్తుడివనుకున్నా_కోవెలంటూ నా వెంటబడుతుంటే..
3955. ప్రేయసినై పులకిస్తున్నా_ఆకులతో నువ్వు పచ్చని తివాచీని పరుస్తుంటే
3956. కలవరమిస్తావెందుకో మదికి_పదేపదే కలలో వరించానంటూ
3957. ఆరాధనలో నన్ను మించలేవుగా_నేను రాధనైనా మీరాగా మారిపోయాక.
3958. మౌనమెక్కడ మిగిలిందిలే_ఆరున్నొక్కరాగంతో నువ్వు చెదరగొడుతుంటే
3959. మధువొలికినప్పుడే అనుకున్నా_కలలోని కవ్వింతలు నిన్నాకట్టుకుంటాయని..
3960. తారనైనా కాకపోతిననుకున్నా_నీలో రాతగా మిగిలేందుకైనా..
3961. నా మాటలు ప్రోదిచేసుకున్నావనుకోలా_నీ చెవిలో అమృతాలవుతాయని..
3962. గతంలోనే నేనుండిపోయా_అనురాగం సుడిగుండమై నన్ను లాగేస్తుంటే..
3963. మన స్నేహమెప్పటికీ సశేషమేగా_పదుగురూ మెచ్చుకున్నందుకు..
3964. చూపుల జల్లుకే తడిచిపోతున్నా_నేనెంత సున్నితమో తెలుస్తోంది..
3965. అక్షరాలకు నేస్తమయ్యా_రమ్మని  అణకువగా పిలిచానని..
3966. ఎన్ని భావాలకని పులకించాలో_మనసంతా పచ్చని మొలకలవుతుంటే..
3967. మనసు మువ్వ చెల్లాచదురైంది_నీ రాకతోని నా నిశ్శబ్దంలా..
3968. కవనం గుండెను చీల్చింది_నీ మౌనాన్ని అనువదించుకొని..
3969. ఆశల కొస అంచున నిలబడున్నా_కెరటమై ఒక్కసారన్నా తడుముతావని..
3970. పిల్లగాలికెందుకంత పరవశమో_వేసవితో వేగలేక నే ఛస్తుంటే..
3971. తోరణాలు చేసా చూపులను_ఇన్నాళ్ళ రణాన్ని ముగిద్దామని..
3972. కన్నులతో కోలాటం నేర్వాలిప్పుడు_ప్రతి ఆటలో అపరాజితనవ్వాలంటే..
3973. వేసవి భగ్గుమంది_నీ మేని మంటలు తోడై తాపం రాజుకోగానే..
3974. వింతాలాపనలలో నేనున్నా_వసంతమంటూ నువ్వు కోయిలను వెతుకుతుంటే..
3975. తారలు గుది గుచ్చుతున్న వలపులు_భావాలకు కొత్తర్ధమిస్తుంటే..
3976. వేపపూతలో దాగిన జ్ఞాపకాలు కొన్ని_వసంతాన్ని దూరం చేస్తూ..
3977. గ్రీష్మానికి తొందరేముంది_మనసులు వసంతమాడకుండానే..
3978. వేపంటే నాకిష్టమే_చేదైనా నాకైతే తీపిని పంచిందనే..
3979. హరివిల్లుకై ఎదురుచూపులేంటో_వేసవిలో వానొస్తుందని అంత నమ్మకమేంటో
3980. మావిచివుళ్ళు మొహం మొత్తినందుకేమో_కోయిల చేదును రుచి చూస్తానంటూ..
3981. గగనం నేలకొంగినట్లుంది_ఇలలో తారల సందళ్ళు చూసేందుకు..
3982. మనసంతా మకరందాలే_మధుమాసమంటూ కలవరిస్తుంటే..
3983. ఆకాశం పగుళ్ళిచ్చినట్లుంది_మెరుపులొచ్చి నన్ను పలకరిస్తుంటే..
3984. ఇష్టపదులన్నీ నాకోసమేగా_అష్టపదులు కావాలని అడిగానని..
3985. కాటుక రంగెప్పుడో మార్చుకుంది_కన్నీటిలో ఎరుపును కాస్తద్దుకొని..
3986. వెన్నెల్లో సేద తీరినట్లనిపిస్తుంది_నీ భావాలు ఏకాంతంలో చదివినప్పుడల్లా..
3987. ఎన్ని ఋతువులు దాటుకొచ్చానో_నీలో వసంతాన్ని తిలకించాలని..
3988. వసంతానికర్ధం నువ్వేగా_నాలో స్పందనకు అర్ధమిచ్చావంటే..
3989. నా భావాలు రాగరంజితాలే_నీ జ్ఞాపకాలను రాస్తున్నందుకు..
3990. ప్రేమ తన రూపు మార్చుకుంది_నీలో ప్రతిబింబించాలని..
3991. నీ కన్నులకంత ఎరుపులెందుకో_సూర్యకిరణాల్ని జార్చినట్లున్న ఆవేశంలా..
3992. అందెల సవ్వడి అధికమయ్యింది_నీలో నవ్వు తెరలు కదులుతుండగానే..
3993. నా మనసో చింతయ్యింది_నీ ఊహలు రుచించక కదిలిపోగానే..
3994. చెలి చెక్కిలికో గమ్మత్తుంది_నీకై నవ్వితేనే సొట్టలవుతూ..
3995. ఆకాశమై విస్తరించాలనుంది_నిన్ను దాచుకోమని మనసంటుంటే..
3996. ఇంద్రధనస్సు చేతికందినట్టేగా_చెక్కిట్లో రంగులు నువ్వు కనిపెట్టావంటే..
3997. మనసంతా ఒలికించానలా_నీ మదిగదిలోనైనా భద్రం చేస్తావనే..
3998. సాయం సంధ్యల్లోనూ నువ్వే_అరుణరాగాన్ని నే మోహిస్తున్నానంటే.. 
3999. ఊహలెన్ని ఊతమవ్వాల్లో_నా కవిత్వం నీపై జల్లయ్యింది చాలక.. 
4000. వెలిసిపోక తప్పలేదు_నా హృదయానికి సొబగులద్దేందుకు నువ్వొస్తుంటే..

3801 to 3900

3801. అనుకోలా కవిత్వమవుతుందని_నే రాసినప్పుడల్లా నీ పేరుని..
3802. శూన్యస్వప్నాలకీ పేరొచ్చింది_కవిత్వమని లోకానికందించగానే..
3803. ఊపిరందింది ఇన్నాళ్ళకి_కవిత్వాన్ని చెలిమిగా చేసుకోగానే..
3804. కదలక తప్పలేదా తలపులకి_నిదురొచ్చి కల్లోకి రమ్మంటుంటే..
3805. సందేహం తీరిందిప్పుడు_నా దేహంలో నీ ఆత్మ విలీనమవ్వగానే..
3806. దూరమవుతాననుకోలా ఇలా_ప్రేమను ద్వేషించేంతగా..
3807. మనసు గారడీనే_వలపు ఊయాలూపుతుందంటే..
3808. నీలో అనుమానమెందుకంట_మనసంటూ నాకుంటే అది నీకేనంట.. 
3809. సొగసును సంధించక తప్పలేదు_నీలో అల్లరి చూడాలనుకున్నందుకు..
3810. అసామాన్యమైపోయా నేను_నీ కల్పనలో కళ్యాణిగా కదిలి..
3811. పదిమాట్లు ప్రశ్నిస్తావెందుకో_పదిలమై హృదయంలో ఒదగలేక..
3812. పూలబాణం వదిలానందుకే_మదికి గాయమయ్యిందని అలుగుతావనే..
3813. అవ్యక్తమైతేనేమి_నా కవితల్లో అభివ్యక్తిగా మారిందిగా..
3814. సాంత్వనందలేదు నా హృదయానికి_ఈ జన్మకు ఒంటరినని తెలిసి
3815. మధుమాసానికై ఎదురుచూస్తున్నా_శూన్యం కదిలి వసంతమొస్తుందని..
3816. ప్రమాణాలు పట్టుక్కూర్చుంటావెందుకో_ప్రాణమై వెంటే నేనుంటున్నా..
3817. మకుటంలేని మహారాణినే నేను_జీవితమంతా వెన్నెల కరువైనా..
3818. నువ్వంటే నువ్వే_నాలో ఊపిరిగా కదులుతున్న భావన..
3819. మనసు కోలుకుందిన్నాళ్ళకి_ఒక ఉషస్సు ప్రేమగా తడమగానే..
3820. నా మనసు నన్నెళ్ళగొట్టింది_నీ హృదయానికి చోటిచ్చి..
3821. మాయమవ్వాలనుంది_నీ మదిలో మర్మాన్ని వెలికితీసేందుకై..
3822. నిన్ను నువ్వే చెక్కుకున్నావు_ఉలికదలికలు తెలిసిన శిల్పివైనందుకేగా..
3823. సుకుమార సుమానివే నువ్వు_మధుపమై రమ్మని నన్నాహ్వానిస్తూ..
3824. కధలు బానే చెప్తావు_కల్లోకి రమ్మంటే కుదరదంటూ..
3825. నిష్ఠూరాలెన్నేస్తేనేమి_ఆ వైపు పెదవైతె విచ్చుకోదుగా..
3826. గేయాలు రాసిరాసి నేనలసిపోయాను_నీ మదికి లేపనమవుతాయనే..
3827. నా పరవశాన్ని ప్రశ్నిస్తావెందుకో_నిజమవుతున్న
ది నీ కలైతే..
3828. అనుభవమిలా పాఠమయ్యింది_అంతరాత్మ అర్ధమయ్యాక..
3829. నీకొరకే నా గీతలు_అక్షరాలుగా ఆకట్టేందుకే..
3830. గులాబీలను నలుగెట్టినందుకే_నా మేనికిన్ని వలపు సువాసనలు..
3831. మనసు నిండినట్లుంది_నీ కవనాన్ని కాస్త ఆరగించినందుకే..
3832. కాపురంలో కలతలు_కన్నీరు మాత్రం ఖచ్ఛితంగా ఆమెకే..
3833. మనసు గాల్లో తేలింది_నువ్వేసిన పొగడ(డ్త) ధూపానికి..
3834. సంపెంగలు పెట్టుకోవడం మానేసా_ప్రతిసారీ నన్ను నీకు పట్టిస్తున్నాయనే..
3835. ఆవిరవుతున్నా ఆనందాలను కూడి_నిత్యసంతోషిణై నేనుండాలనే..
3836. ముహూర్తబలమలా కుదిరిందిగా_ప్రతిరూజూ నీతో పండుగేనంటూ...
3837. పచ్చదనాన్ని కట్టుకు నేనొచ్చేయనూ_వసంతమై నువ్వు రమ్మన్నావంటే..
3838. నా జ్ఞాపకాలు గంధాలేగా_నీ సమక్షంలో పరిమళిస్తున్నాయంటే..
3839. నే కొలనే_నువ్వొచ్చి మదిలో ఈదులాడే వేళల్లో..
3840. కలల్లోకింక రావొద్దనుకున్నా_నిదురను సైతం నువ్వు నటిస్తుంటే..
3841. సిగ్గెటో సెలవు పుచ్చుకుంది_వలపు సెగ నువ్వంటించగానే 
3842. ఇంత వెచ్చననుకోల చుంబనం_నా చెక్కిలి మీటేవరకూ
3843. ఆనందం నర్తించినప్పుడే అనుకున్నా_నాలో మందహాసం మరణించలేదని..
3844. ఇష్టంగా పిలిచినప్పుడే అనుకున్నా_కష్టమైన పరీక్షేదో పెట్టబోతున్నావని..
3845. ఆ కళ్ళెప్పుడూ మడుగులే_ఆకలి తీరని ఆవేదనలో..
3846. మరుపుకి మందునేగా నేను_నీకు స్మృతిగా తోడయ్యానంటే..
3847. మనసు తేలికైతే చాలనుకున్నా_కన్నుల్లోంచి జారినా ఫరవాలేదని..
3848. భవిష్యత్తు భయానకమని అనిపిస్తుంది_గతం నీడనని వెంటాడుతుంటే..
3849.మేరుపర్వతంలా నువ్వు_నన్ను పొగిడినప్పుడల్లా..
3850. చుక్కల్లో జాబిల్లిని వెతుక్కోవక్కర్లా_తనలా వెలుగుతుందంతే..
3851. నా నవ్వులు వెన్నెలన్నావెందుకో_ఈరోజు అమాసని మరచినట్లున్నావు..
3852. ఆపలేకున్నా నవ్వులను_నీ అల్లరులిప్పుడు సద్దు చేయడం మానేస్తాయని..
3853. నా నవ్వులకు మెరుపుందని తెలీలేదు_నీ మోములో వెలుగు చూసేదాకా..
3854. అనుమానించలేదు నిన్నెప్పుడూ_జాబిలి నేనని కనిపెట్టేస్తావని..
3855. హృదయం ఉప్పొంగవలసిందే_ఆ కవిత వేణువై రవళించిందంటే..
3856. మదికెన్ని గాయాలైతేనేమిలే_నువ్వొచ్చి మంత్రమేసే వీల్లేకుంటే..
3857. హరివిల్లునై నవ్వుకుంటున్నా_నువ్వలా వర్ణాలను కల్లోకి రమ్మంటుంటే
3858. చెలిమి చిరాయువేగా_కాలమెంత వేగముగా కదిలిపోతున్నా..
3859. మల్లెలంటే మక్కువెందుకో నీకు_గులాబీలెంత గుభాళింపుతో ఎదురొస్తున్నా..
3860. సొగసుకందిన పరిమళాలు_గులాబీల పూతలవే సౌందర్యాలు..
3861. అందానికిప్పుడు అతిశయమంటింది_గులాబీ రాణి తనకు లేపనమయ్యిందని..
3862. కోయిలమ్మ దాగుడుమూతలు_తన పాటను నువ్వెలా అనుకరిస్తావోనని..
3863. వెనుకడుగేయక తప్పలేదు_నీ ఆనందానికి అడ్డు రావొద్దనుకోగానే..
3864. ప్రేరణైతే నువ్వేగా_నా కలంలో సిరాగా నువ్వొలికిపోతూ..
3865. నీ సింగారానికి దాసోహమే నేను_నాలో ఊపిరి నిలిచేంత వరకూ.. 
3866. వేసవిలో వానేంటో అనుకున్నా_ఆకాశపు ఆవేదన గుర్తించలేక  
3867. నీ తలపులన్నీ నాకిష్టమే_నీరవాన్ని భగ్నం చేసినాసరే..
3868. ఎన్ని జన్మలెత్తితేనేమి_మనసు పడేదైతే నీమీదనేగా..
3869. పరీక్షించాలనా_ప్రతి అక్షరాన్ని పట్టి పట్టి అడుగుతున్నావ్..
3870. ఒక జీవిత కాలం వెనకబడ్డాననుకున్నా_నిన్ను కలిసే వరకూ..
3871. నా జ్ఞాపకాలు పాలనురుగులు_నిన్ను తీయగా తడిపేందుకు..
3872. చేదంటూ చిన్నబోతావనే_ఊహల మేఘమై కమ్మగా కమ్ముకున్నా..
3873. కాకులెందుకు దూరం జరిగాయో_ఏకాకులంటే వాటికీ లోకువే అనుకుంటా..
3874. మనసుకెందుకో అశాంతులు_జీవితమే అశాశ్వతమైనప్పుడు..
3875. నా అందం_నీ స్వప్నంలోకొచ్చి కలవరపెట్టిన నిజం..
3876. నీ మదికైతే నే  వసంతాన్నేగా_వేరెవరి జీవితంలో శిశిరాన్నైనా.. 
3877. నా మనసు నీకేసిన వల_ఈ రేయి నీ కల..
3878. నా కవితలెన్నో నీకంకితమిచ్చా_హృదయం నీ పరమయ్యిందనేగా..
3879. అధికారమంటే మక్కువే_నువ్వలా రాణిని చేసి పూజిస్తుంటే..
3880. ఆకాశమవుతావనుకోలా_నాకు మనసిచ్చిన పున్నమిలా..
3881. పచ్చబడింది పైరు_చినుకొచ్చి వెచ్చగా ఓసారి కురవగానే..
3882. ఆనందం ఆకాశమే_అహం అల్లుకున్నంత సేపూ ఏకాకిగా..
3883. అపార్ధానికి దారే లేదక్కడ_చెలిమి గమ్యమైన చోట..
3884. రూపాలు మార్చేస్తుంది అద్దం_నన్నడిగితే నిన్ను చూపిస్తూ..
3885. ముచ్చట్లెన్నడో మటుమాయం_తన మాటల్లో మౌనమొచ్చి దొర్లుతున్నాక..
3886. హృదయమెందుకో నవ్వుకుంది_నీ దర్పాన్ని దర్పణం కనిపెట్టిందని..
3887. కదులుతున్న కాలాన్ని ఆపలేకున్నా_వేగవంతమై అలా ఉరికిపోతుంటే..
3888. బెల్లం తీపి తెలియట్లేదు_వేప జీవితాన్ని పోల్చి ఉంటుంటే..
3889. ప్రేమరాజ్యమిప్పుడు నాదయ్యింది_నేనే రాణినని ప్రకటించగానే
3890. మల్లెగంధం అంటినప్పుడే అనుకున్నా_నీ ఊసుల గుభాళింపు మొదలయ్యిందని
3891. నా మనసు మువ్వల్లో చేరింది_నీ హృదయాన్ని లాగేందుకు..
3892. స్వప్నాల్లోనే సాన్నిహిత్యం_వాస్తమనే వలయంలో అహమొచ్చి చేరాక..
3893. అన్నీ ముసుగులే_రంగులే వేరు..
3894. నే పాడింది వసంతరాగమే_నీకు అభేరిగా వినిపిస్తూ.. 
3895. అడుసు_తొక్కినందుకు ఫలితం..
3896. నీ మనసెప్పుడూ రసఝరిగానేగా_నన్ను మునకేసేందుకు పిలిచినప్పుడు..
3897. సరసాంబుధిని_వేసవిలో తడవాలని నువ్వనుకున్నాక..
3898. జ్ఞాపకమైనా తీయగానే ఉంది_నెమరేస్తున్నది నిన్నే అయితే..
3899. నీ తలపుల స్వేదమేనది_నాకు గ్రీష్మాన్ని ప్రసాదించింది..
3900. చెక్కిళ్ళకెందుకంత ఎరుపో_నువ్వు పూలబాణమేసింది నా హృదయానికైతే..