Monday, 2 September 2019

7001 - 7100

7001. మనసు పరుచుకొని ఎదురుచూస్తున్నా..నువ్వు రాగానే స్వాగతిద్దామని..
7002. ఆశ చీలినట్టయింది..నీ జ్ఞాపకాల ముసురు పట్టినందుకే..
7003. అనుభవాలందుకే..మరోసారి నెమరేసుకోడానికి..
7004. మనసు పరిమళిస్తున్నదెందుకో..అరవిరిసింది పెదవైతే..
7005. నీ మైమరపు తెలుసులే..నా మైకంలో మునిగున్నప్పటిదేగా..
7006. నిదురలా తేలిపోయింది..కలలో నిన్ను వెతికి నేనలసినందుకు..
7007. మౌనపు విశ్వరూపం..పెదవి దాటని మాటల సమ్యమనం..
7008. ఎటెళ్ళిందో ఈ క్షణం..నీ నిరీక్షణ భరించలేనంటూ.
7009. ఒక్క రాగమైనా చాలనుకున్నా..నీ అనురాగం ఆలకించేందుకు..
7010. బుగ్గలు కందినవి చూడు..నీ చూపులెంత వేడి బాణాలేసినవో..
7011. మనసు రాగం పాడుతూనే ఉంది..పెదవి అలసి ఆగిపోయినా..
7012. విరహం శిశిరమై జారుకుంది..వసంతమై నువ్విచ్చేయగానే..
7013. సాయింత్రం ప్రతిరోజూ ఉండేదే..సంబరం మాత్రం నువ్వున్నందుకే..
7014. మనసెప్పుడూ నీవైపే..ఏ గమ్మత్తు చూపుతున్నావో మరి..
7015. నీ ముందరే మసులుతున్నా..దృష్టి మరల్చి నన్నాలకిస్తావని.. 
7016. కలగానైనా మిగిలున్నానలా..కన్నీరై జారితే నువ్వు తట్టుకోలేవనే..
7017. ఎవరికి వారే విజేతలు..మహానటుల మథ్య పోటీలో..
7018. హృదిలో నీ తలపు..కనిపెట్టేసారందుకే నాలోనీ మైమరపు..
7019. గండుమల్లెనై పరిమళిస్తున్నా..వసంతకాలమై నువ్వొచ్చావనేగా..
7020. నేనే ఓ మధువనం..నీరాకతో పెరిగింది పరిమళం..
7021. మమత రుచి తెలుస్తోంది..నీ మాటలను ఆరగిస్తుంటే..
7022. ఉరిమినంత పని చేసావుగా..నిజంగానే వాన పడుతుందిప్పుడు..
7023. సమస్తం తానయ్యింది చెలి..పొద్దస్తమానం వెంట తిరిగావనే..
7024. దారి తప్పింది జీవితం..గమ్యానికి దూరం జరిగి..
7025. ప్రేమంటని వసంత గీతం..శిశిరమే నయమనిపించే ఋతురాగం..
7026. ఉసిగొలిపినట్టే నీ మాటలు..జతగా నన్నూయలూపుతూ..
7027. పరవశం పదింతలు..నువ్వు పాడించిన రాగం అనురాగానిదని..
7028. గతజన్మలోని పులకింతలే..ఈనాటికీ ఎదలో సందళ్ళు రప్పిస్తూ..
7029. మనసాక్షరాలే నే రాసేవన్నీ..హత్తుకొని తీరతాయి నిన్నందుకే..
7030. భావానికెందుకో కలవరం..కలం పట్టి రాస్తున్నది నేనైతే..
7031. పున్నమందుకే చేస్తుంది సడి..మదిలోని మధుర్యాలు మోగాలని..
7032. ఎంతకని నీ ఎదురుచూపులో..నా పిలుపందితే ఎగిరొద్దామని..
7033. చూపుల కథానికది..నీ కనులు కలిస్తేనే పూర్తయ్యేది..
7034. కాలాతీతమై కురుస్తాను..వర్షమంటే నీకిష్టమనే..
7035. ఆవిరవ్వని తలపులే..నీ మనసు నాతో ఏకమైనందుకు..
7036. హృదయాన్ని శృతి చేసిందెవరో..నాలో లయ మొదలయ్యింది..
7037. కొన్ని కలలంతే..మెలకువొస్తూనే కరిగిపోతుంటాయి..
7038. ఎన్ని మంత్రాలొచ్చో నీకు..నీవైపు నన్ను ఆకర్షించుకున్నావు..
7039. తలపుల్లో మెరిస్తేనేమిలే..నేనెప్పుడూ అపురూపాన్నేగా..
7040. వెన్నెలై వద్దామనుకున్నా..ఈరోజు చైత్రపున్నమి విశేషమని....
7041. మాటలను వెతుకుతున్నా..మౌనాన్ని ముగించాలని..
7042. చెలి పరిమళం తెలుస్తోంది..నువ్విటు నడిచిన ప్రతిసారీ..
7043. ఊహల్లోనూ ఊపిరి తీసేస్తావు..నీ తలపుల తీయదనం అలాంటిది..
7044. పాటలు మొదలు..ఎదలో రాగం నిన్ను కదిలించగానే..
7045. నీతోనే నా తలపు..వలపు తలుపు తట్టిన్నందుకు..
7046. కలవై రా ముందు..అలవై తర్వాత ముంచుదువు..
7047. సముద్రం నాకు సమానమైంది..తనలో అలజడేదో రేగినప్పుడు..
7048. పెరుగుతున్న పగటికలలు..నీ తలపులతో నేనలసి నిద్రిస్తుంటే..
7049. జ్ఞాపకాల నీడలో నేనుండిపోయా..వాస్తవం నిరంతరం మండిస్తుందనే..
7050. అప్పటికే విషమించింది..ఆలశ్యం అమృతమనుకొనేలోగా..
7051. మానస వీణ వినిపించింది..నీ ఎదపై తలవాల్చగానే..
7052. ఋతువులన్నీ ఏకమై కూసాయి..ఎన్ని కూయిలలు కూజితాలోనవి..
7053. మధురాలాపంలో నీ మాటలు..నిరంతర మత్తులోనే నన్నుంచుతూ..
7054. కొన్ని ఆనందాలంతే..జ్ఞాపకాలతోనే ముడిపడుంటాయి..
7055. నా కన్నుల దీపాలే..నీ హృదయాన్నలా వెలిగిస్తున్నవి..
7056. తండనాలాడమన్నది నువ్వేగా..నేనొస్తే పండగొచ్చినట్టుందంటూ..
7057. ఆగని అలలా నీవు..తీరాన్ని అదేపనిగా వెంబడిస్తూ..
7058. మధురానుభూతే మనసుకి..నీలో స్పందన నేనేనని తెలిసి..
7059. గతి తప్పిన జీవితం..మతిమాలిన మనసుతో..
7060. చెక్కరతీపులే నా పలుకులు..ఏమారగిస్తానో రహస్యం మరి..
7061. జ్ఞాపకాన్నెందుకు పిలిచానో..తిరిగి రాజుకున్నట్టయింది ఆరిపోయిన గాయం..
7062. వెన్నెలెటో పోయింది..నీ విరహంతో రోజూ అమాసలేనయి..
7063. మరుపు మంచిదే..జ్ఞాపకాల మరకలు అలా తుడిపేస్తూ..
7064. ఆకలి రుచి మరిచింది..రక్తం చేదుగా ప్రవహించి..
7065. మాటలు కోటలు దాటాయి..మౌనం బదులివ్వదని తెలిసే..
7066. చిత్తడి చేస్తూ నీ తలపులు..నిరంతరవలపై గుర్తొస్తుంటే నువ్వు..
7067. గిలిగింతలు పెడుతున్న రాగం..మెత్తని నీ పలకరింపుల నాదం..
7068. కదలనంటూ సమయం..ఒక్క రోజైనా నిన్ను చూడకుంటే..
7069. కోటి భావాల మదనోత్సవం..నిన్ను రాస్తున్న నా మానసానికి..
7070. మనోల్లాసమంతా నాదే..పిలవగానే మదిలోకొచ్చినందుకు..
7071. ఆనందం అనంతమైనది..నీ ఊహల్లో నేను ఆకాశమైనప్పుడల్లా..
7072. ప్రేమయ్యిందనేమో..మనసిప్పుడు మౌనాన్నే మోహరిస్తుంది..
7073. ఇన్ని రాగాలెప్పుడు ఒలికినవో..దాహం తీరక జలపాతాన్ని నేనర్థిస్తుంటే
7074. నీకిచ్చిన మొదటి కానుక..కన్నుల్లో అందుకేగా తొట్రుపాటు.
7075. కన్నుల ఆనందభాష్పాలు..మనసుపుష్పం వికసించినట్టు..
7076. కూసే కోయిలై నేను..నువ్వు వసంతమై వచ్చావనే..
7077. బంగారు సంకెళ్ళే నాకవి..నీ తలపుల్లోని క్షణాలవి..
7078. మనసును శృతి చేయాలిగా..అనురాగం కుదిరి ఆలాపనవ్వాలంటే..
7079. కాలయాపన చెయ్యదులే కాలం..కలలు నిజం చేసేందుకే దాని సంకల్పం..
7080. ఇంకెంతకాలం చదవాలో నీ మనసుని..అర్ధంకాని అద్వైతమని తెలిసినా..
7081. విద్య వాణిజ్యమైపోయింది..ఒక వ్యాపారంగా వ్యవస్థ మారిపోయాక..
7082. గెలుపోటములు జీవితానికి సంబంధమయ్యాయి..విద్య విశేషమే కాదంటూ..
7083. సంస్కారమే మదినాకట్టేది..విద్య ఎంతున్నా వినయం ముందు కాబట్టి..
7084. వానాకాలం చదువులే ఇప్పుడన్నీ..అరచేతిలో అంతర్జాలం చేరికయ్యిందిగా..
7085. నీ ప్రేమలేఖనే చదువుతున్నా..అంతగా నచ్చింది మరి..
7086. విద్యలో వెనుకబడింది నువ్వేగా..ఇంతమంది స్నేహితులున్న కారణానికి..
7087. మది దుర్గమారణ్యమయ్యింది..చదివింది గుర్తు పెట్టుకోలేక..
7088. చదివేదేం మిగిలుందిక..జీవితాన్నే ఔపాసన పట్టేసాక..
7089. క్షణానికో తలపు..నీ వలపు ఋజువులు కోరినట్టు..
 7090. పరిమళమిక్కడి వరకూ పాకింది..నీ అందానికి అతిశయమున్నట్టుంది..
7091. ఒక్క కవనమైనా రాయవెందుకో..నీ మనసంతా నిండానంటూనే..
7092. ఎప్పుడో గెలిచేసా జీవితాన్ని..ఆనందమే గమ్యమైన ఆటకదాని..
7093. పంచుతున్నా ప్రేమనందుకే..రెట్టింపై తిరిగొస్తుందని..
7094. అలసిపోయినా ఆమె అందమే..అందరి అవసరాలు తనవైనందుకు..
7095. రేయంతా కలలే..నువ్వు కడలివై నది నేనయ్యినట్టు..
7096. బంధాలెందుకంత బలహీనమో..ముడిపడేలోగానే ఒదులవుతుంటాయి..
7097. నీ వలపు గొడుగే..నే వాన కోరినప్పుడల్లా..
7098. అణిచేస్తున్నా మనసుని..నీకూ నాకూ జత కుదరదన్నావనే..
7099. కదిలిపోతుంది కాలమందుకే..కలతలతో పనిలేదని..
7100. కలలు కోటికి పెరిగాయి..నువ్వంతా నేనని అనిపిస్తుంటే..

No comments:

Post a Comment