Monday, 2 September 2019

7101 - 7200

7101. తొలి తారను నేనే..నీ మనసో ఆకాశమంత విశాలమైతే..
7102. నిశ్శబ్దమూ పాడగలదు..దాని సాహిత్యాన్ని పోల్చుకోవాలంతే..
7103. వెలుతురు చూడని చీకటది..అందుకే నలుపుగా మిగిలింది..
7104. ఎన్ని కలలో ఈనాడు..నిన్న కలవరింతలు అనుకున్నవి..
7105. మనసంతా గుసగుసలు..నువ్వు నన్ను తలుస్తున్న ఆనవాళ్ళు..
7106. సముద్రమంత కన్నీళ్ళు..నువ్వు దూరమైన నా కన్నుల్లో..
7107. మేఘమెటు వలసపోయిందో..వేసవి గాలుల పలకరింతకి..
7108. ఆకుమాటు పువ్వును నేనే..నీతో దోబూచులాడుతున్నప్పుడు..
7109. కెరటాల్లా నాలో కోరికలవెల్లువలు..నీ మనసు నాదైనట్టు..
7110. ఆవేదన నిజమయ్యింది..మనసు కలని కాదనలేనట్టు..
7111. ఎన్ని తలపులో..ఒకదాని వెంట ఒకటిగా నీలా అనుసరిస్తూ..
7112. ఎన్నడుగులేసానో నీతో..సప్తపదిని లెక్కించకుండానే..
7113. మౌనం మధురమే..నా మది లోలకమై నీకోసమూగుతుంటే..
7114. ఎన్ని సిద్ధాంతాలో శాంతి కోసం..రాద్దాంతాన్ని మాత్రం ఆపకుండా..
7115. ఆకాశాన్ని కొలవాలనుకున్నా..ఆనందం ఎగిసిందని..
7116. ఊగిసలాడుతూ ప్రాణం..మరో జన్మంటేనే భయపడుతూ..
7117. జ్ఞాపకాలు గుప్పెడే..గుండెనంతా ఆక్రమిస్తూ
7118. పలుకే బంగారమన్నావుగా..మౌనం ముత్యమంటూ ఇప్పుడెందుకిలా..
7119. ఆసాంతం చదవాలనుంది..నువ్వు ఇష్టమైన పుస్తకమయ్యావుగా..
7120. దాహం తీరలేదంటూ కన్నులు..నీ దర్శనమవ్వలేదని..
7121. జతగా రమ్మంటున్నా..నువ్వులేని పాట సగంలో ఆగిందని..
7122. చూపులవిందుకు రమ్మంటావేం..మనసొద్దని వారిస్తున్నా.
7123. నీ పలకరింత కావాలిప్పుడు..ఈ చీకటి వెన్నెలవ్వాలంటే..
7124. ఎక్కడని వెతకాలో నిన్ను..నాలో తప్పిపోతూ నువ్వుంటుంటే..
7125. కొనసాగుతున్న సంతోషం..నిన్ను గెలిపించానన్న తృప్తిలో..
7126. ఏకాంతమలా ముగిసింది..విషాదమొకటి మనల్ని వేరు చేయగానే..
7127. కలుపుకున్నా చెలిమి నీతో..తలుపుచాటు పిలుపుకని వేచున్నావనే..
7128. గాలెందుకో రంగు మారినట్టుంది..చీకటిలో కలిసిపోయేందుకేమో..
7129. వసంతానికి తొందరెక్కువే..వనమంతా విరబూయాలని..
7130. కోరికలెన్ని రంగులో..ఇంద్రథనస్సుని తనతో పోల్చుకుంది మనసందుకే..
7131. నీటిబుడగేం కాదు ప్రేమ..అరక్షణంలో పగిలి కరిగేందుకు..
7132. అనుభూతులన్నీ నీ పరమే..ఇన్ని అనుభవాలు పంచిచ్చావని..
7133. మనసలా ఎగురుతోంది..తూనీగలా స్వేచ్ఛని అనుభవించాలని..
7134. నక్షత్రం తూలిపడబోయింది..గాలేం తాగి చీకటిని తరిమిందో..
7135. పువ్వులనదిలా నువ్వు..ప్రవహించేందుకు పిలుస్తావెందుకో నన్ను..
7136. మనసు బరువెక్కుతోంది..బంధం వదులవగానే..
7137. వద్దన్నా నవనీతంలో ముంచుతావు..వన్నెలకు మెరుపొస్తుందంటూ నీవు..
7138. నువ్వొచ్చిన కలే..ఎన్నేళ్ళయినా ప్రియమైనది..
7139. అనురాగాన్ని ఆలకించా..నీ భావంలో నే వినబడ్డానని..
7140. మౌనరాగం కదా నాది..నీ మనసుకెలా వినబడిందో..
7141. ఊగుతున్నా నీ తలపుల్లోనే..సమయాలన్నీ ఏకం చేస్తావని..
7142. సన్నాయిరాగమే నేనంతా..నీ ప్రణయానికి కానుకగా అవ్వాలనే
7143. తొంగిచూడాలనుకోలేదు గతంలోకి..వర్తమానానికి నువ్వున్నావనే..
7144. పదాల్లో వసంతమొచ్చింది..నీరాక చైత్రసంగీతమైనందుకే..
7145. నవ్వుతూ నాలుగు మాటలు..నీరెండగా సేదతీర్చు హృదయాల్ని..
7146. మనసు పరవశమది..పరిమళిస్తున్న మాయగా నీచుట్టూ అల్లుకుంది..
7147. లెక్కలు రావంటావు..నిముషాల్ని నిలబెట్టి గంటలుగా మార్చుకుంటూ..
7148. ప్రేమ మధురమంతే..మనసు పడ్డదందుకే..
7149. మనసంతా కవ్వింత..నీ తలపులతో మొదలైందిలా కేరింత..
7150. చూపుల చేవ్రాలు రాస్తున్నా..మనసు నీకందించాలని..
7151. శ్వాసించక తప్పలేదు ఆశని..నిట్టూర్చిన నిరశను సాగనంపాక..
7152. జగమంతా ప్రేమమయమే..నువ్వూ నేనూ ఒక్కటైన సంతోషమిది..
7153. పాటల పల్లకీలో ఊరేగుతున్నా..తన్మయత్వాన్ని రాసింది నువ్వనే..
7154. తలపునందుకే మూసేసా..వలపెటూ దక్కదని..
7155. కలలకు కొదవేముంది..కనులకు కలతలే కానుకై కుమిలిపోతున్నా..
7156. మనసుకి పన్నీరే..జ్ఞాపకాల వర్షమెప్పుడూ..
7157. మెత్తగా కురుస్తోంది వెన్నెల..దిగులు మేఘాలను దాటేసినట్టుంది..
7158. నిదురించాలనుంది..నీకిష్టమైన కలలోకి ఒక్కసారైనా రావాలని..
7159. విజయం తథ్యమనిపిస్తుంది..ప్రయత్నమంటూ మొదలెట్టాననే..
7160. చరిత్రను తిరగ రాయాలనుంది..ప్రతివారూ చదివి తీరాలనే..
7161. భావమలా కుదురుతుంది..నిన్ను రాయాలని కలం పట్టగానే..
7162. కలలతో పన్లేకపోయింది..నీ కన్నులంతా నే నిండిపోయానని..
7163. కలనందుకే తొడుక్కుంటున్నా..విషాదాన్ని దూరం పెట్టాలని..
7164. పాపగా మారిందో పాట..అమ్మ నోట పలికిందనే..
7165. చుక్కల లోకంలో నేను..జాబిలిగా నన్ను ఆరాధించావని..
7166. తపనలా తీరిపోయింది..తలపు నిజమై ఒడి నిండగానే..
7167. ఆలంబనవుతాలే..అసంకల్పితంగానైనా నన్ను చేరావంటే..
7168. సంతోషం నిరంతరం..నీ ప్రేమ నాదైన క్షణాల నుంచీ..
7169. కలలేవీ ఎంచకు..కనులు ముచ్చటపడ్డందుకైనా..
7170. మనసు జారిన ముచ్చటది..సిగ్గుగా కన్నుల్లో దాక్కుంటూ..
7171. నేనో నిశీధి కన్యనే..రేయంతా పరవశాలు నీకందిస్తూ..
7172. పూలరెక్కలా తేలుతూ నీవైపొస్తున్నా..గాలితో కబురెట్టావనే..
7173. అందం చిదుముకుంది చెలి ..చందమామ దాన్ని నేర్వలేకుంది..
7174. మనసుకి మరుపు రానీయకు..నన్ను గతమంటే నేనోర్వలేను..
7175. కనుమరుగే కలతీనాడు..నీ కన్నుల్లో నన్ను కొలువుంచావని..
7176. నవ్వొక వరమైంది..నీ మనసు నాపరం చేసింది..
7177. మల్లిక పరిమళిస్తుంది..నీ మనసుని పోలి ఉందని..
7178. నీ నవ్వే..జ్ఞాపకముగా నాకిప్పుడు..
7179. కనుసైగలింక చేయకు..నిద్దుర మరలిపోయేట్టుంది..
7180. అనివార్యమైంది అహం..నేనంటే నేననుకున్న భ్రమలో..
7181. నీ మాటల గమ్మత్తది..పగలే పండువెన్నెల కాసినట్టు..
7182. మనసు గలగలలవి..పక్షుల కూజితాలుగా..
7183. ఆనందం హద్దు మీరింది..నాలో పులకింతలు మొదలైనందుకే..
7184. అలల్లాంటివే నీ వలపులు..నా మనసొడ్డుని తడిమేస్తూ..
7185. మనదో జగం..అక్కడంతా ప్రేమమయం..
7186. నేనో అపార్ధాన్నవుతున్నా..అపాత్రదానం చేసినందుకేమో..
7187. నాలో మొదలైన కువకువలు..నీ మాటల గలగలలకే..
7188. కన్నీటి కథనే..నన్ను రాయలేని నీ హృదయానికి..
7189. మనసు నిద్దుర లేచింది..నీ చూపులు గుచ్చినందుకేమో..
7190. గమ్యం స్పష్టమయ్యింది..జీవితాన్ని గెలవాలనుకోగానే..
7191. కొందరి కష్టాలంతే..జీవితాన్ని మింగేస్తుంటాయి..
7192. నువ్వు మౌనవిస్తేనేమి..నే మనసునైతే గెలుచుకున్నాగా..
7193. ఎండ చురక సరిపోలేదనుకుంటా..మనసు మండలేదనుకుంటూ..
7194. అక్షరమెప్పుడూ ముందుంటుంది..ఆయాసమంటూ తెలియదంటూ..
7195. అక్షరానికలుపేముంది..వికారాలు మనిషి నైజమైనా..
7196. కలలోనూ కవితలు రాస్తున్నా..నిదురనైనా నువ్వు చదువుతావని..
7197. కానుక చేసి దాచుకున్నా..నీ మనసందం నచ్చిందని
7198. అలా ముగిసింది కల..కలతను కాదనుకున్నా కనుకనే..
7199. ఎదలోని ఆవేదనది..వర్షాకాలంలో నదిలా పారుతుందది..
7200. అపురూపమయ్యా నేను..తన మది అలౌకికమైంది కనుకనే..

No comments:

Post a Comment