6801. కవనానికి దారి మరచిపోయా..అక్షరాలు వరుసగా పేర్చుకొనున్నా..
6802. నిరీక్షణలో నేనోడిపోయా..చూపులొక్కటే మిగిలినందుకు..
6803. మాటల పొదుపు మానేయింక..నా మౌనాన్ని గెలిచేసావుగా..
6804. జీవితం మార్చుకోవాలిప్పుడు..మలుపులు తిరగని దారేసుకోవాలిక..
6805. చూపులే చుక్కానిగా చేసుకో..గమ్యమెంతో దూరముండదిక..
6806. కుసుమమే కదా వాడిందనుకోకు..అదింకా పరిమళిస్తూనే ఉంది..
6807. మనసంతా తీపయ్యింది.. నీ కళ్ళు కన్న కలలు నావైనందుకేమో..
6808. అందెలసవ్వడెక్కువయ్యింది..నీ నిదురను చెడగొట్టాలనే కాబోలు..
6809. కలలోనే మిగిలింది ప్రేమ..నా మనసు కన్నీటిపాలవ్వొదనుకొనే..
6810. కలం రాసిన ఆనందమది..నా భాష్పాన్ని కాజేసిందది..
6811. ఎన్ని మెలికలు తిరిగుంటానో..నీ గమకంలో నేనొంపునయ్యి..
6812. మల్లెలూ..మరువాలు..ఈ జన్మకివి చాలనిపించే పరిమళాలు..
6813. కలుపుతున్నానందుకే చూపులు..నా పారవశ్యాన్ని నీకు చేర్చాలని..
6814. అంతరాయం లేని జ్ఞాపకాలు..వసంతాన్ని మాత్రమే నాకందించేవి..
6815. ఏం మెరుపులో అవి..కన్నీటికీ సొబగులద్దినట్టు మెరుస్తున్నవి..
6816. కన్నీటి విలువ తెలిసేదెన్నటికో..మనసు చేజారిందని గుర్తించనప్పుడు..
6817. రంగురంగుల సందడే లోనంతా..ఏ పండుగై నువ్వొచ్చావనో..
6818. బరువెక్కుతున్న బంధాలు..మనసు తేలికయ్యే దారిలేనందుకు..
6819. భావాలకందుకే పరిమళాలు..అక్షరాలుగా ఊపిరిపోసుకుంటూ..
6820. కలలో కబురెట్టినా చాలనుకున్నా..నిద్దురాపి నీజతగా నేనొచ్చేసానందుకే..
6821. నేనింతే..రమ్మంటే అరణ్యానికైనా నీతో వచ్చేస్తా..
6822. వేసవి మొదలైనట్టుంది..మల్లెల వాసనతో మనసుకి ఉక్కపోస్తుంది..
6823. హేమంతం కదిలింది..శిశిరానికి సమయమైందనే..
6824. బుగ్గలందుకే నొప్పిపుడుతున్నాయి..నీకోసం ఆగకుండా నవ్వీ నవ్వీ..
6825. పరవశాన్ని ముసుగేసుకుంది మనసు..వశమైన నీ తలపులకేగా..
6826. కార్తీకమెప్పుడూ నా కన్నుల్లోనే..పండగంటే నీకిష్టమన్నావుగా..
6827. కాలాన్నలా సాగనిస్తున్నా..జీవితంలో వెలుగు నీడలు సహజమనే..
6828. కలిసిపోయా నీలో నేనెప్పుడో..నిన్ను తరచి చూసుకోవెందుకో..
6829. ఖైదీగానైనా ఉండిపోతా..మీ మనసులో చోటెంతో నచ్చింది..
6830. మతిచెడి నేనున్నానిక్కడ..నింపాదిగా నువ్వెక్కడో..
6831. కాలానిదెంత కుట్రో తెలిసింది..నిన్నూనన్నూ వేరు చేసిందది..
6832. వియోగమందుకే తీపయ్యింది..కలయిక కమనీయమయ్యేందుకే..
6833. మనసు రంగు తెలిసింది..నీ కలలోకి ఆహ్వానమందినప్పుడే..
6834. నీకోసమే నా నవ్వులు..కొన్ని పులకింతలు కావాలన్నావని..
6835. విశేషమే తన జ్ఞాపకం..నిద్దురలోనూ నన్ను వీడనంటూ..
6836. ఆప్తమైపోనా నీకే..నా కన్నీరు ఆవిరి చేస్తానంటే..
6837. ఎన్ని కథలని రాస్తావో..ఒక్క పాత్రయినా నాకివ్వకుండా..
6838. చిరుగాలిని పోలిన కల..నిద్దట్లోనూ నవ్వులు పూయిస్తూ..
6839. కలతెటో కనుమరుగయ్యింది..చెలికాని రాకతోనే..
6840. దయలేని కన్నులు..నిత్యం వర్షిస్తూ నిరాశని నింపుతాయి..
6841. నా చూపంతే..నీకు ప్రాణం పోసిందంటే సంజీవనేగా..
6842. మనసొక్కటేగా..పంచమని ఇంతమంది అల్లరెందుకో..
6843. కురుస్తున్న ఆకాశం..తన ఆశీర్వాద బలాన్ని చూపేందుకే..
6844. గుసగుసలవుతూ నీ సొదలు..నా ఎదనంతా కమ్ముకుంటూ..
6845. మనసు నీరైపోతుంది..నాపై నీ భావాలను ఆలకించి..
6846. ఎవరికి పంచాలో ఆర్తిని..నిరీక్షణంటూ అంతమవని జీవితంలో..
6847. జ్ఞాపకాల తడంతే..మనసుని పొడారనివ్వవు..
6848. నాలోనూ మొదలైన వివశం..మన క్షణాలు నెమరేసుకోగానే..
6849. మనసుని కానుక చేసేసా..నీ జీవితాన్ని రాసిచ్చావనే..
6850. కాటుక చెదిరినప్పుడే అనుకున్నా..కన్నుల్లో విరిసింది సంతోషమేనని..
6851. మువ్వలా నా కులుకులు..నీ మదిని ఆకర్షించాలనే..
6852. చిరునవ్వస్సలు చెరగదులే..నా మనసులోకి అడుగేసొచ్చావుగా..
6853. నీ మనసంతా చదివేసా..నన్నే నకలు రాసినట్టుందని..
6854. ఊపేస్తుందో తీయదనం..వేరే రుచులేవీ మనసుకి నప్పవంటూ..
6855. ప్రేమేగా జీవరథం..అందుకే మన ప్రయాణమింత సుఖం..
6856. వలపలా వెలిగింది..మన చూపులొక్కటై అగ్గి రాజుకోగానే..
6857. ప్రేమ అడుగేయని మనసేముంది..గుర్తించకనే అలసిపోతారు కొందరంతే..
6858. జరామరణాన్ని జయించిన మిత్రుడు..వీర జవాన్ ఓ రక్షకుడే మనకు..
6859. నీరవమెటు పోయిందో మరి..నీ ధ్యాసకు నన్నప్పగించి..
6860. ఉగ్రవాదం హెచ్చు మీరింది..నిర్దాక్షిణ్యంగా వీరుల్ని కాలరాచేట్టు..
6861. మనసందుకే మురిసింది..మన కలయిక శాశ్వతమని గుర్తించి..
6862. క్షణమో యుగమవుతోంది..నా ఏకాంతానికి నువ్వింకా రానందుకు..
6863. మిన్నంటుతున్న విషాదం..ఎన్ని ఆశలు నేల కూలాయోనని..
6864. నిజమందుకే వెనుకబడింది..అబద్దం అడ్డులేక ముందుకెళ్తుంటే..
6865. మనసందుకే పులకించనంటోంది..సముద్రాన్నేమీ అనలేక..
6866. ఎన్ని జ్ఞాపకాలు తోసుకొస్తున్నాయో..కన్నీరు కాస్త ఊరగానే..
6867. విలువ కట్టలేనిది అమ్మతనం..అందరికీ అందని సౌభాగ్యమందుకే..
6868. నన్నలా వెతుక్కున్నా..నీ హృదయంలోకి ఆహ్వానం అందగానే..
6869. గుంజుకున్నావుగా మనసందుకే..చూపులు కలిసిన సాక్ష్యానికి..
6870. సాంత్వనమే స్వప్నాలు..నిద్రించే అవకాశముండే అదృష్టం మనదైతే..
6871. కథలు అల్లేసుకున్నా..జారిపడ్డ నీ కలలు నేనేరుకొని..
6872. చేరువైంది ఆకాశం నిజమే..నచ్చని అలవాట్లు మానుకోగానే..
6873. గాయమవుతుందనుకోలా జ్ఞాపకం..ఇన్నాళ్ళ కలల్లో తారాడకపోయినా..
6874. శత్రువందుకే సమాజము..కవి స్వేచ్ఛను హరించాలని చూస్తూ..
6875. అక్కడో పావురం మూలుగుతోంది..వీరజవాన్ మరణాన్ని చూసినట్టుంది..
6876. మనసులోకెప్పుడొచ్చావో..మాటలన్నీ కవితలైన సందడి..
6877. విజయమందుకే వరించింది..కాలానికి విలువివ్వబట్టి..
6878. శూన్యానికీ ఓ విలువుంటుంది..పక్క నిలబడే చొరవుండాలంతే..
6879. నిద్రెలా తరిగిందో మరి..కలలను తిప్పికొడుతూ కనులిప్పుడు..
6880. కొన్ని బలహీనతలంతే..బంధమని కూడా చూడకుండా వేధిస్తుంటాయి..
6881. నీ ఊసులకే నవ్వుకుంటున్నా..ఊహగా మెదిలితే ఏమైపోతానో..
6882. ఎందుకంత ప్రాణమిస్తావో..నీ విశ్వమంతా నేనే అయినట్టు..
6883. అంతరాత్మలో నువ్వేగా..ఆత్మ పవిత్రతకి లోటేముంది చెప్పు..
6884. తీగలా పాకావెందుకో..బంధమంటే భరించలేనప్పుడు..
6885. నువ్వూహించుకొనే మాయ అదంతే..నా జ్ఞాపకమై వెంటాడుతుంది..
6886. మనసెలా కనిపెట్టెస్తావో..మంత్రాలేవో తెలిసినట్టు..
6887. చెరుకుతో పనేముంది..నీ మాటలతో మది తీపెక్కుతుంటే..
6888. సందడంటే మన వలపేగా..తలపులు తూచి తడుముకుంటావే..
6889. నడుస్తా నీతోనే..చెలిమి అడుగుల్లో అసమానతలు లేనంతవరకూ..
6890. నిద్దుర కొరత..మాటలన్నీ ప్రేమైనప్పుడు..
6891. మనసెంత బాగా విరచిస్తావో..చూస్తున్నది నా నవ్వులనైనా..
6892. ఎంతకని పొగుడుతావో..నా అలుకలోని అద్భుతాలు గమనిస్తూ..
6893. అంతగా వెంటబడతావెందుకు..నా నీడకీ భయపడి ఛస్తున్నా..
6894. మౌనానికి బరువెక్కుతున్న మది..నిశ్శబ్దాన్ని భరించలేని యాతనది..
6895. జగమంతా వెన్నెల నింపాలనుంది..నా నవ్వులందుకే ఆపనీ రాతిరి..
6896. అలల సందడే తీరమంతా..ఆటలాడి మురిపిస్తున్న కారణంగా..
6897. అక్షరాలు చెప్తున్న సంతోషమదే..నేనే నువ్వైన సంగతి..
6898. గుండె వంద కొట్టుకుంటుంది..నువ్వేం చెప్పావో గుర్తురాకనే..
6899. మధుమాసం నాకోసమే..మన్మథుడు విచ్చేసాడంటే..
6900. కన్నుల్లో కోటి కాంతులు..నవ్వుతూ నువ్వొచ్చిన సంతోషానికే..
No comments:
Post a Comment