5901. కదులుతున్న నీడలక్కడ..నీ అడుగులు సరిహద్దునున్నాయి కాబోలు..
5902. రాయిలాంటి హృదయాలెన్నో..రాసిన భావాన్ని అసలే మెచ్చలేక..
5903. వానొచ్చి తడిమినందుకే..సెలయేటికిన్ని సెగలు..
5904. అలుకలెప్పుడూ నీవంతేగా..అనునయిస్తానని అలుసాయ్యాక..
5905. రేగుముల్లే కదాని ఓర్చుకున్నా..గునపాలుగా మారతాయని తెలీకా మాటలు..
5906. రంగు రంగులే స్వప్నాలు..రాతిరిలో హోళీ పండగొచ్చినట్టు..
5907. ముగింపు లేనిది చెలిమొక్కటే..జీవితమొక్కచోట కూలబడినా..
5908. మనసు కర్పూరమైంది..నీకు హారతి పట్టాలని లోననుకోగానే..
5909. ఆకాశానికెంత వెలుగొచ్చిందో.. రాతిరి నక్షత్రాల కోక కట్టినందుకు..
5910. నమ్మించి నడిపిస్తారు కొందరు..నగుబాటులో నిలబెడతారు చివరికి..
5911. మెరుపు వయ్యారం తెలిసింది..మేఘాలతో చూపులు కలిపినందుకే..
5912. మౌనం ముగిసిందిక్కడ..అందుకున్న ప్రేమ నవ్వులుగా విరిసి..
5913. నేర్పుతూనే ఉంటుంది కాలం..జ్ఞానమంత త్వరగా వికసించదంతే..
5914. కలలకు జోలపాడేసానెప్పుడో..నిదురలోకి జారుకున్నాయందుకేనేమో..
5915. ఆ స్పర్శ అద్భుతమనిపిస్తుంది..ఆనందమందుకే రెట్టింపయ్యింది మరి..
5916. చెలిమి పరిమళమే ఇక్కడంతా..పదాలు పూలై విరిసినందుకే..
5917. చీకటెంత చిక్కనయ్యిందో..జీవజాలానికి విశ్రాంతినివ్వాలని..
5918. నా ముగ్గులు సంక్రాంతికే..నీ తలపైతే ప్రత్యేకమే..
5919. ఒక్క చినుకుగానే మొదలయ్యింది..ఇప్పుడు ప్రేమ ప్రవాహమైంది..
5920. ఆలంబనై ఉంటా కడవరకూ..నాలో చివరిశ్వాస నీదయ్యేందుకు..
5921. మధువందుకే పంచిపెట్టా..తలచినప్పుడల్లా తీపిగవుతావని..
5922. మేఘమై మురుస్తూ నేనున్నా..వానగా నీలో కురవాలనే ఆనందంలో..
5923. పలకరింపైతే నిజమేగా..మనసుతోనన్నది అబద్దమైనా..
5924. మనసు బరువు దిగినట్టే..కన్నీరొలికి సాంత్వన చేకూరిందంటే..
5925. చెలిమి ఘనీభవించినట్టే..అర్ధాలు మారి అపార్ధాలు చేరువైతే..
5926. గుండె పొడారినట్టుంది..కన్నీరందుకే ఒలకలేనంది కన్ను..
5927. మనసు గొప్పదే..ఆకాశంతో పోల్చబడిందంటే..
5928. నా ప్రేమ కవితయ్యింది..నిన్ను మదిలోకి ఆహ్వానించగానే..
5929. మధువెలా ఒంపాలో తెలియట్లేదు..నువ్వున్న మనసు తీపిగవుతుంటే..
5930. కన్ను కనికరించినట్టుంది..నీ చూపందుకే నన్ను వరించింది..
5931. నీ హృదయమెందుకు శిలయ్యిందో..నేనెంత ప్రేమను ఆలపిస్తున్నా..
5932. ఎన్ని పేరులో పరిచయానికి..ఉనికిలేకుండా పోయింది ప్రేమొక్కటే..
5933. ఒంటరినంటావెందుకో..నీ తుంటరి తలపులన్నీ నాకొదిలింది చాలక..
5934. కథలను లెక్కించలేదు..రోజుకో వ్యథ రాస్తూ కలముంటుంటే..
5935. చూపులతో కొలుస్తుంటారు అందాలు..ఆకాశమంటి మనసును అందుకోలేకేమో..
5936. చెదిరిపోతూ కలలు..నిన్నెతకలేక అలసిపోతూ..
5937. సంచలనాన్ని ఊహించలేదు..మనసింతగా కంపిస్తుందని..
5938. మువ్వల సందడెక్కువయ్యింది..నీ మౌనంలో రాగాలెప్పుడు విన్నదో..
5939. ప్రేమహారమేస్తాను..నీ మనసు నాకు కానుకయ్యిందంటే..
5940. పదాలెన్ని పులకిస్తున్నవో..పల్లవిగా రమ్మన్న నీ ఆహ్వానమందగానే..
5941. ఆ నలుగురిలో నేను..నీకో నేస్తమై మిగిలుండాలని..
5942. నిన్ను కలగంటున్న రాత్రులెన్నో..అనుక్షణం నాకు తోడుంటావని..
5943. భావాల వెన్నెల కాస్తున్నట్టుంది..నీ కవితల్లో మునిగిపోయానంటే..
5944. గుసగుసలతో గోలెందుకు చేస్తావో..చక్కని శృతిలో నే సర్దిచెప్తున్నా..
5945. ఒడిలో చోటు సరిపోలేదంటావే..నా మనసులో ఆశ్రయమిస్తున్నా..
5946. ఊపిరి చప్పుడు తెలుస్తోంది..నీలో నిశ్శబ్దం నన్నంటగానే..
5947. కనులు దాచుకున్న స్వప్నాలేమో..వేకువపూలై విచ్చుతున్నవి ప్రతిరోజూ..
5948. క్షణం ఆలశ్యమైనందుకేమో..మనసుకో వసంతం దూరమయ్యింది..
5949. శిశిరమైతే కాదిది..ఆకులెందుకు రాలుతున్నవో అకాలంలో మరి..
5950. మువ్వలా నీ నవ్వులెందుకు..నా భావాలను పాడుకుంటుంటే..
5951. సజీవమే కొన్ని కవితలెప్పటికీ..ఆ పదాలు అమృతసమానమైనందుకే..
5952. పున్నమిని కలవరించావెందుకో..వెన్నెలై నీ ముందు నేనుంటే..
5953. నేనవుతాగా నాదాన్ని..నీదానిగా స్వీకరిస్తానంటే..
5954. మంచిగా కలవాలనుకున్నా నీతో..మాటిచ్చి దాటేయవని నమ్మితే..
5955. అంతుండదుగా ఆనందానికి..నిన్నూ నన్నూ కలిపి పాడుతున్నందుకు..
5956. తీయని మనసే నీది..ఆ రుచిని మరువలేనెప్పటికీ..
5957. ఇంత వానెప్పుడూ కురవలేదు..నా కన్నీటికి ప్రతీకగా..
5958. మట్టిపూల వాసనది..మనసంతా అలజడి నింపుతోంది..
5959. పరవశాన్ని మూటకట్టుకున్నా..నీ ఆగమనంతోనే..
5960. మనసు విలాపం..మనిషి దౌర్భాగ్యం..
5961. కథలా ఎదురైనందుకేమో..కలలా కనుమరుగయ్యావు..
5962. అవన్నీ అంతే..అనుభవానికొచ్చినప్పుడు ఆనందించాలి..
5963. ఏకతాళమేసి ఆకర్షించినందుకేమో..నా మనసు నీ పరమయ్యింది..
5964. తడి స్వప్నాలే అన్నీ..ఈ వానాగేట్టు లేదిప్పుడే..
5965. కలతాగే రాతిరి కావాలి..నువ్వే సాయం చేయాలి..
5966. కన్నీరందుకే కదిలిపోతుంది..మనసు తేలికవుతుందని..
5967. ఆరాటం మొదలయ్యిందిప్పుడే..నాకు దూరమైపోతావేమోనని..
5968. అక్షరమై రాసుకున్నానందుకే..నీ వలపు నాకమృత సమానమనే..
5969. బందీ చేయలేను..నీ జ్ఞాపకాలు ప్రియమనవి నాకంతే..
5970. ఆవగింజే అనుమానం..అవమానం జీవితమంత..
5971. కొదవేముందిప్పుడు..నీ హృదయమంతా నేనాక్రమించాక..
5972. నీ పిలుపులో సంగీతమిప్పుడు..నాపై ప్రేమ వినిపించినందుకే..
5973. నీ రూపమే కన్నుల్లో..నా మనసు ప్రతిఫలిస్తున్నట్టుంది..
5974. పదాలలో మించకలా..పదనిసల్లో ముంచేస్తానిలా..
5975. చీకటి వలయంలో రాతిరి..కన్నీటిని దాచుకోమని కళ్ళని..
5976. చైత్ర కోయిల పరవశమిది..వసంతాన్ని గెలిచిన సంబరంలో..
5977. మనసు పరిమళం హద్దులు దాటింది..నీ పరవశాన్ని నాకంటిస్తూ..
5978. వాడినపూలలోనూ పరిమళముంది..ఆశలు సుమించాలంతే..
5979. రెప్పలు తడిపే భావాలే నావన్నీ..మనసు ఉప్పెనై పొంగినప్పుడల్లా..
5980. చూపుల రణం మొదలయ్యింది..పెదవులు మౌనాన్ని ఆశ్రయించినందుకే..
5981. మరుపు మందిచ్చింది కాలం..అలా మాయమయ్యింది గాయం..
5982. నీ కవితల్లో చేరిపోతున్నా..ఇష్టంగా రాస్తానని మాటిచ్చావనే..
5983. విశ్వాసమొచ్చిందిప్పుడే..నీ ఆకాంక్షలోని ఆనందం నేనవగానే..
5984. విజయాన్ని వరించాల్సిందే..అవిశ్వాసమెంత వెంటాడుతున్నా..
5985. నీ స్వప్నంలో నేను..అన్వేషించే ఆమనికి ప్రతీకగా..
5986. నేనేగా నిన్నలరించే ఆకాశం..నువ్వందుకోవాలని చూసే అనంతం..
5987. అల్లరి చేసి ఆకట్టుకోకలా..తుంటరయ్యానని నన్ను నిందించేలా..
5988. నువ్వంటే మనమేలే..నేనున్నది నీ మదిలోనే అయితే..
5989. నవ్వింది నేనే..గొంతెత్తి నువ్వు పిలిచినట్టు అనిపించగానే..
5990. పండుగన్నదే లేకపోయింది..నువ్వు దూరమైన నా జీవితానికి..
5991. నీ భావంలో నేనో అనంతం..నన్ను ఆకాశం చేసి రాస్తునందుకేమో..
5992. అడ్డూఆపులేని స్వేచ్ఛాలోకం..యువతరానికదేగా బంగారులోకం..
5993. జీవించక తప్పదుగా..మహానటన ఎవరూ గుర్తించకపోయినా..
5994. హేమంతం మొదలైనప్పుడే అనుకున్నా..శిశిరానికి దగ్గరపడుతున్నానని..
5995. సంసారపు సరిగమలో నేను..అపశృతులన్నీ సరిచేసుకుంటూ..
5996. నీ అల్లిబిల్లి అక్షరాలే..నన్ను అలకనందలై ముంచేస్తున్నవి..
5997. ఆమని మనలోనే ఉందేమో..ఆశల పగ్గాలు చేయి జారనివ్వకుంటే..
5998. సహించలేకున్నా..నీకున్న భావాలతో నన్ను సాధిస్తున్నావని..
5999. అరచేతిలోనివే అక్షరాలు..నిన్నంటి నక్షత్రాలైనట్టు..
6000. అక్షరాలపై మక్కువే..ఆకాశాన్ని ఇలకు దింపి రాయమంది..
No comments:
Post a Comment