6101. నిద్దట్లోనూ కలతలే..వస్తానన్న నువ్వు కలలోనూ రాకపోతుంటే..
6102. కనురెప్పలందుకే మూయలేకున్నా..నీ రూపు మరుగైతే వేదనవుతుందని..
6103. మౌనాన్ని మధురంగా వింటున్నా..నీ మనసులోని మాటలుగా అలరిస్తున్నందుకే..
6104. మనసుకెప్పుడూ విషాదమే..ఏకాకితనాన్ని తలపోసినప్పుడల్లా..
6105. జీవితమో వసంతం..ఆస్వాదించే హృదయ సంకల్పం మనదవ్వాలంతే..
6106. నీ చూపునందుకే కలుపుతున్నా..మనిద్దరి నవ్వులు ఒకటవ్వాలని..
6107. కొందరంతే..మనసుకి అంటుకట్టినట్టు మనతో ఎదుగుతుంటారంతే..
6108. ఊహలందుకే రాసేసా..నా ఎదురుచూపులు కవితలైతే చదువుతావని..
6109. నేనంటే నువ్వేగా..మనమంటే సరిపోతుందిగా..
6110. ఆత్మలెప్పుడూ ఒకటేగా..హృదయాలు రెండు విడివిడిగా స్పందిస్తున్నా..
6111. కలలంటే భయమేస్తుంది..అర్ధరాత్రి కన్నీటికి కాటుక చెదురుతుంటే..
6112. పున్నమినై నేనొస్తున్నా..వెన్నెల్లో తడవాలనుందన్నావుగా..
6113. కలలకోసం ఎదురుచూపులిప్పుడు..మనసంతా నువ్వైనందుకే..
6114. ఊహలెన్నుంటేనేమిలే..ఊసులతో మనసు నింపేందుకెన్నడూ రావుగా..
6115. ప్రవహిస్తూనే నేనుంటా..నన్ను కలంలో నువ్వు నింపుకోవాలంతే..
6116. వేకువైనట్టే..నీ మౌనం చెదిరి నాతో మాట కలిపావంటే..
6117. అల్లుకున్నా కొన్ని పాటలు..సాహిత్యమంతా నీ తలపవుతుంటే..
6118. వరించాలనుకున్నా కొన్ని క్షణాలు..మనసంతా పరిమళమద్దుకోవాలని..
6119. నిర్జీవమవుతున్న ఆశలు..నువ్వెదురై యుగాలైనట్టుంటే..
6120. ఎడారిలో వెన్నెల పూలు పూసినట్టేగా..నా కలలో నీ దర్శనమైందంటే...
6121. మలుపులోనే విడిచేసా గతాన్ని..విషాదానికి వీడ్కోలు పలకాలని..
6122. నక్షత్రమైపోనా నేనే..ఆకాశం నువ్వవుతానంటే..
6123. తడబడుతున్న ఊపిరిక్కడ..నీ మాటలకు తడిచినందుకేమో..
6124. నీ మాటలు కెరటాలే..నన్ను తీరం చేసి తడిపేవేళ..
6125. మౌనం మొగ్గతొడిగిందప్పుడే..కొన్ని చీకట్లకు నేను చేరువైనప్పుడే..
6126. వింటూనే ఉంటున్నా విషాదగీతాన్ని..శిశిరాన్ని ఊహిస్తున్నందుకేమో..
6127. చెలి జాబిలయ్యింది అందుకే..నిత్యమూ వెన్నెల కురిపిస్తున్నందుకే..
6128. అనుక్షణమూ అదే తపన..నీ సమక్షమే కావాలన్నట్టు..
6129. స్వప్నంలోనూ శిల్పాలే..మనసు రాయైపోయింది కాబోలు..
6130. క్షణాలు అబ్బురమయ్యాయి..వెన్నెలబొమ్మలా నిన్ను ఊహిస్తుంటే..
6131. మనసెప్పుడూ అమలినమే..నాలుక..నడత నలుగురూ మెచ్చాలంతే..
6132. ఆవేదన శాశ్వతమయ్యింది..అనుమానాలు తీరనందుకే..
6133. చరణాలన్నిటా నేనుంటా..నీ అడుగుల్లోకి నన్నాహ్వానించావంటే..
6134. ఏమరుపాటు దూరమయ్యింది..నీదరికి చేరువైనందుకే..
6135. తలపులతో తీరని తపనలు..నీతో ఏకాంతసేవని ఆశిస్తూ..
6136. మనసూగినప్పుడే అనుకున్నా..మైమరపేదో మొదలయ్యిందని..
6137. అనుభూతి వానై కురిసినట్టుంది..కాలం జ్ఞాపకాల్లోకి జారిపోయినందుకే..
6138. మెరుపుకలలే నావైనాయిక..వానొస్తుందని కంగారుపడకు..
6139. కొన్నిక్షణాల కేరింతలు..నా మనసున విరిసిన హరివిల్లులు..
6140. ఒక్క జీవితం సరిపోదనిపిస్తుంది..నీతో కలిసున్న సంతోషానికి..
6141. వర్తమానం విసుగొస్తుంది..గతాన్నంతగా ప్రేమించినందుకేమో..
6142. అలసి ఆగినట్టుంది కాలం..మన మనసుల వేగాన్ని అందుకోలేక..
6143. కాలానికెందుకంత అసూయో..కలిసున్న మనసుల్ని విడగొడుతుంది..
6144. కొన్ని కోయిలలు కూతనాపేసాయి..ఇది శ్రావణమని గుర్తొచ్చి కాబోలు..
6145. పండగలా కదిలిపోతుంది..నిద్దట్లోనే మైమరచిపోతుంటే..
6146. జ్ఞాపకాలతో పయనించలేకున్నా..గమ్యం దూరమైనట్టనిపిస్తుంటే..
6147. కాలమదంతే..కన్నుమూసి తెరిచేలోగా అనంతంగా దొర్లిపోతూ..
6148. క్షణాల భారమిది..నీ సమక్షం లేక కదలనంటూ..
6149. ఊపిరో వరమే..నిన్ను శ్వాసించేందుకే నే బ్రతికుంటే..
6150. మధువందుకే పొంగింది..నిన్ను రాసే అక్షరాలు తేనెలైనాయని..
6151. మనసుని దాచేసాను..కన్నీరెంత కురిపించినా నువ్వు తడవట్లేదని..
6152. చిరునవ్వు చేదయ్యింది..మనసు బాధ నువ్వు తీసుకోనన్నాక..
6153. మువ్వల సవ్వడి పెరిగిందిప్పుడు..నీ పలకరింపులకి స్పందించాలని..
6154. కలగానైనా వద్దామనుకున్నా..నువ్వెప్పుడూ నిద్దరోతుంటావని..
6155. ఆనందానికర్ధం తెలిసింది..కన్నీటిలో చక్కెర కలిపింది నువ్వేనని తెలిసి..
6156. ఉత్సాహమంతా నీవల్లే..నీరండల్లే నాకు గొడుగయ్యావుగా..
6157. కన్నుల్లో వర్షమిప్పుడు..నీ మనసంతా నన్ను ముసురుకున్నావని..
6158. వసంతానికని ఎదురుచూడటం ఆపేసా..నువ్వుంటే తను వచ్చినట్టేనని..
6159. బాధని మరచిపోతున్నా..సంతోషాన్ని ఆహ్వానించినందుకే..
6160. చిలిపితనం చిందించకలా..పరవశాన్ని తొణకలేనిప్పుడు..
6161. సిసలైన కేరింతలే నావిప్పుడు..నీ వలపంతా నాదైనందుకు..
6162. ప్రణయకావ్యాలందుకే..నా ప్రతిపదంలో నువ్వున్నందుకు..
6163. మౌనాన్ని ఒదులుకోవాలిక..మనసుపడ్డానని మాటిచ్చాక..
6164. వయసు తక్కువయ్యింది..మనసు ఉత్సాహాన్ని తనలో నింపుకొని..
6165. వానంటే భయమేస్తోందిప్పుడు..జ్ఞాపకాలొచ్ చి తడిపేస్తాయని..
6166. నీ చూపుల గిచ్చుళ్ళకేమో..మేనంతా మునుపులేని సలపరింతలు..
6167. మనసు తడారనంది..కన్నుల్లో ఇంకిపోని కన్నీళ్ళున్నందుకేమో..
6168. ఎన్ని కలలని తవ్వుకోవాలో..ఒంటరితనపు అలసట తీరిపోవాలంటే..
6169. మనసుకంటిన రంగులు..నీ ఊహల పరవశమేమో మరి..
6170. జ్ఞాపకాలందని దేహాలనుకుంట..క్షణాలు కోల్పోయిన శిల్పాలుగా..
6171. తప్పించుకోవాలని లేదా చూపుల్ని..మనసు గోరువెచ్చగా మురిసిపోతుంటే..
6172. అలికినట్టున్న కథలేగా అన్నీ..కన్నీరు కలాన్ని పట్టి రాసిందంటే..
6173. గతం నన్ను వీడనంటోంది..కాగితంపై తనను చూసుకోవాలంటూ..
6174. పులకరించానంటే అది నీవల్లే..నువ్వెక్కడున్నా నాకోసమేగా..
6175. కొన్ని మాటలంతే..నే పలక్కుండానే నీకు వినబడుతూ..
6176. ప్రవాహమాగని కన్నీరు..ఆ వెతల వేగానికి సమానమవ్వాలనేమో..
6177. వలపు వయ్యారం నయగారమే..సిగ్గులు సూదంటు రాయిలా గుచ్చుతుంటే..
6178. ఎదలొకటైన సంగమమిది..పదాల్లో అలవోకగా కదులుతున్నది..
6179. అత్మలెప్పుడో మమేకం..అంతరంగాలందుకే విలీనం..
6180. మతి పోగొడుతున్న జ్ఞాపకాలు..వాస్తవంలో నన్ను నిలవనివ్వనంటూ..
6181. ఈ జన్మకింతే..నీ జ్ఞాపకాలతోనే నా సావాసమయ్యేట్టుంది..
6182. చూపులు గిచ్చితేనేమిలే..మనసైతే పులకించిందిగా..
6183. నా మనసుకెప్పుడూ విరహమే..వసంతమైన నువ్వు కనుమరుగవుతుంటే..
6184. కార్తీకమంటే నేనే..ఋతువుల కోసం నువ్వు ఎదురుచూడక్కర్లేదంతే..
6185. హేమంతమంటే ఇష్టమందుకే..చలేసినప్పుడంతా నువ్వు తోడుంటావని..
6186. విశేషమిలా వింటున్నా..పండుగై నన్ను మురిపిస్తా అన్నావని..
6187. వాస్తవాన్ని వేటేయలేను..జ్ఞాపకాల కోసమని మాటేసుకుంటూ నేను..
6188. నవ్వులతోనే నెగడేస్తావు..చలి ఆమడదూరం పరిగెత్తి పోయేలా..
6189. ముద్దబంతిలా మారిపోతుంటావు..ముచ్చట్లు ముద్దుగా పంచమనగానే..
6190. ఆశ నిరాశల సహజీవనమంట..ఒకరు లేకుంటే మరొకరు లేమంటూ..
6191. సిగ్గుల చెర విడిపించాలిక..వలపు వాయినాలతో నువ్వు విందడిగావంటే..
6192. నూరేళ్ళందుకే ఒద్దనుకున్నా..నీతో కొన్ని క్షణాలున్నా చాలనే..
6193. అనుభవాలవంతే..జీవితాన్ని ఒక్కో కోణంలో తలపోస్తూ..
6194. ఆనందమై కదిలొచ్చా నేను..నీ కవితల్లో ఒదిగిపోవాలనే..
6195. మనసు తొందరపడుతోంది..నీ ప్రబంధంలో నన్ను వెతుక్కోవాలని..
6196. కథగా మార్చెస్తావెందుకో..కన్నుల ముందే నీకై తిరుగుతున్నా..
6197. కవనమై కదిలి రాలేనా..మనసంతా నన్నే రాసుకుంటానంటే..
6198. తీరింది కల ఇన్నాళ్ళకి..చెలిమై చెంత చేరాలనుకున్నది..
6199. ఈ జీవితమిక ఇంతే..ఇరుకు మనసులతో ముడిపడిపోయాక..
6200. మనసుని వెతుక్కోవడం మరచిపోవాలనుకుంట..కాగితం మీదకి ఒంపేసాక..
No comments:
Post a Comment