6401. పలచబడినట్టుంది చీకటి..వేకువ విచ్చుకున్నందుకే..
6402. అపస్వరాలను ఆలపించకలా..నాలో భావాలు వలసపోయేలా..
6403. వెన్నెల నవ్వుతున్నది నిజమే..మన అనురాగాన్ని తొంగిచూసిందిగా..
6404. అపాత్రమయ్యింది ప్రేమ..విలువలెరుగని అతని స్వార్ధాన్ని తెలుసుకోలేక..
6405. వెలుతురు విలువ తెలుసుకుంది చీకటి..అందుకే పక్కకి తొలిగింది..
6406. మనసుకో గమ్యముందనుకున్నా..జన్మజన్మలుగా నిన్నారాధిస్తుంటే..
6407. మాటలతో ఏమార్చకలా..మనసునిన్నిసార్లు మభ్యపెడుతూ..
6408. మధురమేగా మన బంధం..కొన్ని జన్మలుగా కలిసున్నామంటే..
6409. వెన్నెల చిక్కబడింది..కార్తీకాన్ని అనుభూతికి అందించాలని కాబోలు..
6410. నిట్టూర్పులే..నన్ను రాయలేని నీ అసహాయతను నిందిస్తూ..
6411. కలల్లోకి తొంగిచూడకలా..నాలో కేరింతలన్నీ కులుకులయ్యేలా..
6412. విషాదమే మిగులుతుందేమో..పదేపదే విషాన్నే స్మరిస్తే..
6413. జ్ఞాపకాలను రాయాలనుకున్నా..అక్షరం సాయమొచ్చిందిలా..
6414. కనుబొమ్మలవంతే..కాంచినవారికే కనువిందులు చేస్తుంటాయ్..
6415. మౌనం పాటయ్యింది..నీ మాటలు పల్లవులై మొదలవ్వగానే..
6416. మతి పోతుందిక్కడ..ఎంతమంది నన్ను వలపిస్తున్నారో తెలిసి..
6417. మిసమిసలెన్నో నీ అక్షరాలలో..మనసుతో నన్ను చదివించేస్తూ..
6418. నక్షత్రాలు కుమ్మరించినట్లుందిలే..నీ పలుకుల అభిషేకాన్ని ఆస్వాదిస్తుంటే..
6419. హడావుడెక్కువే అక్షరానికి..మనసునందుకే బయటపెడుతుంది..
6420. కలలు హత్తుకున్నది మనసునే..రేయంతా మత్తిల్లినది కన్నులైనా..
6421. స్వర్గం ప్రాప్తించింది నాన్నకు..నరకాన్ని తప్పించాలనే మరి..
6422. కన్నులు ఎర్రనయ్యాయి..వియోగాన్ని పాడి అలసిన కోయిల మాదిరి..
6423. చీకటలా చెదిరిపోయింది..మనసు ప్రేమను కాస్త పులుముకోగానే..
6424. కాలానికి చిక్కని అనురాగం..నీ పాటందుకే నాకపురూపం..
6425. తరలిపోయిన చిరునవ్వు..విషాదాన్నెందుకు స్మరించిందో మనసు..
6426. మనస్సంఘర్షణది..శోకం అడ్డుపడి మౌనాన్ని ముసుగేసుకుంది..
6427. అక్షరమై మురవాలో భావం..మనసులోటు తీర్చే చెలిమిగా..
6428. ఆగిపోయిన ఊహ మొదలయ్యింది..నువ్వలా వెన్నెల్ని గుర్తుచేసాక..
6429. కనులిప్పుడు కథలు..కన్నీటిలో పన్నీరు కలిసిందని మురిసిపోతూ..
6430. చిలిపిదనం మన సొంతమైంది..నీ మనసు నాదైనప్పుడేగా..
6431. ఒక్క పలకరింపు చాలుగా..మనమో చెలిమిబంధంలో ముడిపడేందుకు..
6432. నాలోనే నువ్వు..ప్రపంచంతో పనేముందసలు..
6433. మధురమైనదే నీ ఊహ..మనసందుకే నీకు దాసోహమైంది..
6434. కొన్ని నిముషాలు అపురూపమే..నీ సమక్షాన్ని నాకిచ్చినవి..
6435. కలలో కలుస్తావేమో నన్ను..నీ భావాలందుకే మెరుస్తున్నాయి..
6436. కబుర్లు కోటి చెప్తావు..క్షణాలు ఇట్టే కరిగేట్టు..
6437. మనసింక పారేసుకోవద్దనుకున్నా..నువ్వు తిరిగివ్వలేనంటుంటే..
6438. వెన్నెలై కాసింది నేనే..మనసుకి ఉక్కబోసిందని కబురెట్టావని..
6439. నాలో భావం అనంతమైంది..నిన్ను రాయడం మొదలెట్టగానే..
6440. ఎప్పుడూ నువ్వనే సాగదీస్తావు..నేనేదో నువ్వు కానట్టు..
6441. కొన్ని మాటలందుకే దాచేసా..మౌనంలో నన్ను చదువుకుంటావని..
6442. మౌనం ముగిసింది..నీ మాటలు పదేపదే స్మరించుకున్నందుకే..
6443. పరిచయం పరవశమయ్యింది..నిన్ను చూసినంతనే భావాలు పరిమళించి..
6444. తళుక్కుమంటున్న మనసు..నీ కన్నుల్లో స్వప్నాలు నావేనని..
6445. మనసందుకే వలచింది నిన్ను..కన్నుల్లో ఎప్పటికీ నన్ను దాచుకుంటావని..
6446. ఎప్పుడూ అదే మాట..నువ్వెప్పుడిన్నావో నా పాట..
6447. నీ మనసుని ఆలకించలేదెన్నడూ..నే మౌనంలో మునిగినందుకేమో..
6448. మనసు తలుపులు మూసేసావనుకున్నా..నీ కన్నుల్లో నన్ను చూసుకోగానే..
6449. ఎన్ని భావాలో నాలో..మునుపులేని నిన్ను స్మరించినప్పుడల్లా..
6450. విషాదాన్ని వెనక్కి పంపుతాలే..వరమై నన్ను వరిస్తావంటే..
6451. నీ మాటలు ముద్రించకలా..నా మది పుస్తకమయ్యేలా..
6452. ఎంత మౌనాన్ని రాసానో..నీ మాటిలా బైటకొచ్చేందుకు..
6453. కలలింకా మొదలవ్వలేదు..కథను ఊహించనందుకేమో..
6454. అలుకెటో ఎగిరిపోయింది..తన చిరునవ్వు పులకింతలు రేపగానే..
6455. ఆనందం ఆగిందక్కడ..నువ్వొస్తే కన్నులు దాటి ప్రవహించొచ్చని..
6456. పదునెక్కువే పరువానికి..నీ పదాలు నన్ను ఎక్కుపెట్టాయంటే..
6457. అక్షరంలో మనసుంటుందని తెలిసింది..నీ భావాలు నాపరమైనందుకే..
6458. శోకమలా మించిపోతుంది..తీర్చేవారే దూరమయ్యారని..
6459. రాత్రి కోసం ఎదురుచూడలేదందుకే..నీ కన్నుల్లో విశ్రాంతి తధ్యమని..
6460. మనసు ఏకాంతం కోరుతోంది..తనలో తను సంభాషించుకొనేందుకే..
6461. మురిపాలనూ రాస్తుంటాను..మనసును జోకొట్టుకొనేలా..
6462. నాలోని ఆర్తి వికసించింది..మనఃసౌరభాన్ని నువ్వు గుర్తించినందుకే..
6463. వేసవితో పనిలేదిప్పుడు..నీ మాటలకే నే వెచ్చబడుతుంటే..
6464. నా ప్రేమ పారిజాతమైంది..నువ్వు రాగరంజితం చేసినందుకే..
6465. ఆనందాన్ని వర్షించాలనుంది..నీ భావం మనసు మీటగానే..
6466. లాలిత్యమే నీ పదాలన్నిటా..నన్ను రాసేందుకు సంకల్పించినందుకేమో..
6467. కోటితారలిప్పుడు కన్నుల్లో..మనసు ఆకాశమైందని గుట్టు విప్పేస్తూ..
6468. నవ్వుల్లో ఎప్పుడు మునిగావో..నేనెప్పుడూ విషాదాన్నే వర్షిస్తుంటే..
6469. కాసేపాగితే భాషనీ మర్చిపోతావు..నా నవ్వులతో లెక్కలు తారుమారైతే..
6470. మనసిప్పుడు నిండుతోంది..తన ఖాళీలన్నీ నువ్వు పూరిస్తుంటే..
6471. మాటలతో వల వేయకలా..మౌనానికి కలలు కానుకయ్యేలా..
6472. జ్ఞాపకాలనిప్పుడు తవ్వకలా..కన్నీరు ఊటబావులయ్యేలా..
6473. కాదనలేను మౌనాన్ని సైతం..కన్నులతో అనునయించి పలకరిస్తుంటే..
6474. నేనో ముగ్ధలా మిగిలిపోతా..నందివర్ధనంతో నన్ను పోల్చావంటే..
6475. కలతలెప్పుడూ రహస్యాలే..మనసు గుట్టువిప్పనంటుంటే..
6476. ముద్దులంటూ గుర్తుచేయకలా..మాటలతో నన్ను ముగ్గులోకి లాగేస్తూ..
6477. కలలే కదానని అనుకున్నా..శిశిరంలా అవి రాలిపోతాయని తెలీక..
6478. కలలు నిజమైనప్పుడనుకున్నా..నన్ను మదిలో దాచుకున్నది నిజమేనని..
6479. ఏకాంతమిప్పుడెంతో బాగుంది..నీ తోడు నన్నిలా ఆకర్షిస్తుంటే..
6480. సంతోషపు దొంతరలు మేనంతా..నీ తపనలన్నీ నావైనందుకు..
6481. కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాలనుకున్నా..ఉలి పట్టడం ఆలశ్యమైందీలోపే..
6482. నా బుగ్గల్లో సొట్టలు..నీ చూపులు ఉలిగా మారినందుకే మరి..
6483. ఉలి దెబ్బలకు భయపడ్డట్టుంది..పసుపు రాసుకు పూజలందుకుంటుందా రాయి..
6484. ఉలి కుంచెగా మారిందేమో..ఆకాశంలో హరివిల్లుగా ఆవిష్కరించబడింది..
6485. కలే నా కనపడని ఉలి..కవిత్వాన్ని శిల్పంగా మలచానందుకే..
6486. అమృతం తాగినట్టుంది..ఆనందం తరగలేదందుకే..
6488. కథనే మరి..కలతలా ఉలిక్కిపడతావేమి..
6489. అమాస దగ్గరైందనేమో..చీకట్లో తప్పిపోతున్నా..
6490. పంచదార పూస్తావేమి క్షణాలకి..సమక్షంలో ఉన్నది నేనైతే..
6491. కలగా రావాలనుకున్నా..కథనమే మార్చేసావుగా..
6492. ప్రవహించడం మర్చిపోతున్నా నేను..మునకేయడానికి వస్తున్నది నువ్వైతే..
6493. విరహమొచ్చి ఛస్తున్నాను..వసంతమింకా రాదేమని..
6494.వలస పోతోంది యవ్వనం..వయసొచ్చి మీద పడుతుంటే..
6495. శీతాకాలమని మర్చిపోతావు..వెచ్చదనాన్నే తలపోస్తూ నువ్వు..
6496. నీ నవ్వులెన్ని దాచుకున్నానో..మౌనంలో నన్ను ఓదార్చుకోడానికి..
6497. ఎన్ని పువ్వుల మకరందాలో..నీ నవ్వులుగా నన్ను తడిపినవి..
6498. మనసందుకే కలిపేసా..నీ కన్నీటిని తీపి చేద్దామని..
6499. నీ వలపే..నా నులివెచ్చదనం..
6500. మునిగినప్పుడల్లా సంతోషమే..ప్రణయాంబుధి నీవైతే..
No comments:
Post a Comment