Saturday, 15 December 2018

6301 - 6400

6301. పులకరింతలు కలల వల్లే..ప్రేమ పలకరించిన రాత్రులెల్ల..
6302. విడిపించుకోవాలనిపించని సంకెళ్ళు..నీ పదాలు మనసులో సందళ్ళు..
6303. జ్ఞాపకాలవంతే..ఊపిరాగే వరకూ సహజీవనం చేస్తుంటాయి..
6304. దోబూచులే కన్నులకి..నువ్వెదురుపడ్డ ప్రతిసారీ..
6305. జ్ఞాపకాలందుకే ప్రాణం..నీతో నిత్యం కలిసుండేలా చేస్తుంటాయని..
6306. తేనెవానలవి..తీయగా తడిచిపోవాలంతే..
6307. గగనమెప్పుడో విడిచొచ్చేసా..నన్ను మోహించావని తెలిసి..
6308. బంధం అపూర్వమైంది..ఈ జన్మకి మనమొకటేనని చెప్పేందుకు..
6309. మదిలో మొలకెత్తిన భావమది..నా నవ్వులుగా నీకందినది..! 
6310. నీ పదాలతో ఆకట్టుకున్నందుకేమో..నా పెదవుల్లో పాటయ్యావు..
6311. నిఘంటువు నేనవుతున్నా..నన్ను రాస్తున్నావనే ఆనందం నాది..
6312. కలలో రావాలనుకున్నా..ఓ నీడగానైనా నన్ను గుర్తిస్తావని..
6313. కలతలే మిగిలినట్టున్నాయి..నా కన్నుల్లో నీరింకి పొడారిపోయి..
6314. హాయిరాగం వినబడినట్టుంది..మనసిప్పుడు తేలికయ్యింది..
6315. ఎదురుచూపు మొదలయ్యింది..నా స్వప్నంలోకెప్పుడొస్తావో నువ్వని..
6316. విహరిస్తున్నది నేనేగా..నీ మనసు గాలిపటమై ఎగురుతున్నా..
6317. పల్లవి కాలేనా నీ పాటకి..తపస్సుగా నా పేరునే పాడుతుంటే..
6318.జవాబులెక్కడని వెతకను..నీ ప్రశ్నలో నన్ను అనుమానిస్తుంటే..
6319.జ్ఞాపకాలెప్పటికీ సజీవమే..మనిషిగా మనుగడ ఎన్నడో ముగిసిపోయినా..
6320. వీడిపోనంటూ జ్ఞాపకాలు..క్షణాలను బంధిస్తామని..
6321. మహదానందమే..ఏకమైన మనసులు మనువుగా ఏకమైతే..
6322. ఆ గాలి గాంధర్వమైపోదా..వేణువంటూ నువ్వు మీటితే..
6323. కలకలలాడింది కవనం..నీ మౌనంలో కలవరాన్ని కనిపెట్టగానే..
6324. తినిపించబోకు చేదురుచిని..గతమంటే నాకు మింగుడుపడని కాలం..
6325. మాట్లడటం మానేసా నేనందుకే..నా మౌనాన్ని నువ్వాలకించగలవని..
6326. కష్టాల కడలిని దాటలేను..మునకతప్పదని ముందే తెలిసినందుకు..
6327. నువ్వు పదాలు అల్లినప్పుడే అనుకున్నా..పందిరి కింద నే చేరిపోవచ్చని..
6328. కొన్ని జ్ఞాపకాలు మంచివే..జీవితానికవి అవరోధం కానంతవరకూ..
6329. ఆకాశం ఆపుకోలేని ఆనందమది..చినుకై నేలమ్మ తనివితీర్చింది..
6330. మాటలన్నీ పాటలైన సంతోషమది..నా మనసునలా నీకందించింది..
6331. చేమంతినై నవ్వుకుంటున్నా..చెక్కిలిగింతలిచ్చే నీ మాటలు ఆలకించి...
6332. తడిచిపోతున్నా విషాదంలో..నీ జ్ఞాపకాలు కురుస్తున్నవి మరి..
6333. నీ మాటల తీపులకేమో..మనసు సద్దుమణిగిందిక్కడ..
6334. మనసిప్పుడు తేలికైంది..నీ మౌనాన్ని అనువదించడం నేర్చినందుకు..
6335. వలసపోయిన కలలు..నీ ఎడబాటు చిత్రించలేనంటూ..
6336. నీ ధ్యానంలో నేను..ఎప్పటికైనా కరుణిస్తావని ఆశిస్తూ..
6337. పదాలు వెంటపడ్డప్పుడే అనుకున్నా..నిన్ను రాస్తున్న ఉత్సాహమదేనని..
6338. విషాదమొక్కటే మిగిలింది..జ్ఞాపకం నాకో అనుభవంగా మారిపోగానే..
6339. తడిచి ముద్దయిపోలేనా..వెన్నెల్లో కురుస్తున్నవి నీ తలపులైతే..
6340. మనసులు విడిపోవందుకే..అక్షరాలు కలిపిన బంధం అపురూపమైనదని..
6341. కమ్మగానే వండాలనుకున్న కవిత..మమకారం తక్కువైందని తెలీక..
6342. నిరీక్షణలోనే నా కన్నులు..నవ్వులు నటించలేనని ఓడిపోతూ..
6343. సౌందర్యమబ్బింది ఇన్నాళ్ళకి..నీ కవితలో నన్ను పొదిగావనే..
6344. నీ తలపులతో మేల్కొంటున్నా..కలలు కావాలంటూ కన్నులెంత నిద్రపోతున్నా..
6345. అవకాశమొచ్చింది ఇన్నాళ్ళకి..మంచితనం పరిమళించడానికి..
6346. కలతనిద్దురలో నేనుంటున్నా..చీకటికావల ఏముందో వెతకలేక..
6347. వెన్నెలనలా వేడుకుంటున్నా..రేయంతా వర్షిస్తూనే ఉండమనిలా..
6348. కొన్ని జ్ఞాపకాలు అపురూపమే..ఎన్నేళ్ళయినా కలై వెంటాడుతున్నాయంటే..
6349. నీ పిలుపైతే నాకమృతమే..పిలిచినప్పుడల్లా ప్రాణం లేచొస్తుంటే..
6350. పదనిసలు పాడకలా..నాలో సరిగమలు సాగరమై ప్రవహించేలా..
6351. నా మనసు చెమరింత..నీ చూపులు గుచ్చుకున్నంత..
6352. క్షణాలెంత తొందరపడుతున్నాయో..యవ్వనాన్ని ఆస్వాదించాలనే ఆత్రుతలో..
6353. శిశిరాన్ని దాటేయాలనుంది..వసంతపు వలువలు కట్టుకోవాలనే..
6354. తరించినట్టే ఉంది జన్మ..నీతో పొందు ఫలించిందిగా..
6355. మిట్టమగ్గినా లేవనంటావు..హేమంతపు చలి నీకు సరిపడదంటూ..
6356. నా వలపు తుళ్ళింత..నీ తలపు రేగినంత..
6357. నా పెదాల పలవరింత..నీ ప్రణయం నిజమయినంత..
6358. సహజమంటూనే సిగ్గుపడతావు..చిలిపి రంగులు పూయమంటూనే కలలకు..
6359. కార్తీక పున్నమికి నిద్దురంటావు..వలపును సద్దు చేయనివ్వనంటూ..
6360. కొన్ని రాగాలందుకే దాచుంచా..రాతిరైతే నీతో పంచుకోవాలని..
6361. కాటుకనెందుకు విడిచిపెట్టావో..కరిమబ్బుపై నీకు అలుకలేదంటూనే..
6362. ఎంతసేపని ఎదురుచూడాలో..ఏ కలలో నువ్వొస్తావో తెలీక..
6363. అనునయించేందుకో మంత్రమేయాలి..మౌనాన్ని నాపై రుద్దేయకలా..
6364. ఓటమైతేనేమి ఆటలో..గెలిచింది నీ మనసునైతే..
6365. నా నిరీక్షణ నిజమేగా..కలలో నీ దర్శనమైందంటే..
6366. ఇప్పటికి తీరేది కాదు నా అలుక..పొగడచెట్టుపై నన్ను అనునయించినా..
6367. జీవించేందుకో కారణం దొరికింది..నిన్నెదురు పడేలా చేసిందిగా విధి..
6368. ఆర్ద్రతలా ఒలికిపోయింది..మనసు కాగితంపై ప్రవహించాలనుకోగానే..
6369. గతమో వెలసిన చిత్రమే..వాస్తవాన్ని వర్ణమయం చేసుకోవాలంతే..
6370. అపహాస్యమైన క్షణాలేగా నాకన్నీ..నువ్వు లేని నా జీవితాన..
6371. ఆకాశం చేయిచాచింది..పున్నమినందుకోవాలని సాగరం ఎగిసిపడ్డందుకే..
6372. అనుభూతి చెరిసగమయ్యింది..మనలో రాగాలు ఏకమైనందుకే..
6373. మనసిప్పుడు తేలికయ్యింది..నీ మౌనం నా మాటతో ముగిసిపోగానే..
6374. హేమంతం కదలనంటోందిగా..నీ దగ్గరతనం పోగొట్టుకోలేనంటూ..
6375. తీపెక్కిందే తనువంతా..అమృతానికి పోటీగా ఈరేయి నీవల్ల..
6376. మనసు చెవులు తెరిచింది..ప్రణవాన్ని ఆలకించేందుకు సిద్ధమవ్వాలని..
6377. మమతెప్పుడూ మారిపోదు..నీ మౌనంలోనూ అనురాగాన్ని ఆలకిస్తూ..
6378. వారే వీరు..ముసుగు తీసాక వికృతంగా కనిపిస్తున్నారంతే..
6379. తొలిపొద్దునై రావాలనుంది..నీ నిరంతర తపన నాకోసమైతే..
6380. పొంగిపొరలింది ఆనందమేలే..నవ్వై నాలో చిరకాలం నువ్వుంటావని..
6381. నీడలా తారాడుతున్నది నేనే..వెంటుండమని నువ్వు కోరావని..
6382. చినుకందుకే ఆగలేనంది..ఆకాశాన్ని విడిచొచ్చేసింది..
6383. అబ్బురమనిపించే పలుకులు నీవి..ఏ చిలక నేర్పుంటుందో..
6384. అభిమానమే నలువైపులా..నీ ఆరాధన అల్లుకున్న ప్రతిసారీ..
6385. ఆకాశమో అద్భుతం..అందుకే అందుకోవాలనే ఆశలు నాలో..
6386. సున్నితమైనదే మది..చేదుజ్ఞాపకాలసలే పంచకలా..
6387. మూతబడాలి ముందే కన్నులు..కొన్ని నిజాలు తెలుసుకొనేలోగా..
6388. నా పేరే కవితయ్యింది..ప్రేమగా నువ్వు పలికినందుకు..
6389. మన చెలిమి అజరామరం..గతజన్మలోనే మొదలైంది మరి..
6390. కలకాలం నీతో నేను..ఎప్పటికీ నేనే నీ నాయికనైతే..
6391. కాలమలా కరిగిపోతుంది..మనసుని మభ్యపెడుతూనే..
6392. ఈరోజెంతో బాగుంది నిజంగా..గతానికి నువ్వు తీపినద్దుకేగా..
6393. అనుభూతులైన పరవశాలెన్నో..నీ నవ్వులు పరవళ్ళు తొక్కినప్పుడల్లా..
6394. ఆకాశాన్నంటే ఆశలు..తలపులకు రెక్కలున్నందుకేగా..
6395. చుక్కలా మారిపోలేనా నేను..జాబిలివై నువ్వు వెన్నెలారబోసావంటే..
6396. చుక్కలన్నీ నా చీరలోనే..ఆకాశాన్ని తనువుకి చుట్టుకున్నాక..
6397. కవనం మొదలెట్టాలిక..నీ ఆహ్వానమందుకున్న కల నిజమయ్యిందిగా..
6398. పరిమళిస్తున్న జ్ఞాపకాలవి..అంతులేని ఊసులుగా నీలో మెదులుతున్నవి..
6399. ఆత్మసందేశం అందినట్టుంది..ఇప్పుడన్నీ మెరుపుకలలే ఆ కన్నుల్లో..
6400. దారి తప్పిన కన్నీరు..హృదయం ద్రవిస్తున్నందుకు అల్లాడుతూ..

No comments:

Post a Comment