Sunday, 1 January 2017

03301 నుండి 03400వరకు

3301. మనసు మెరుపులీనింది_కొన్ని కలతలు కన్నీటిలో కొట్టుకుపోగానే..
3302. ఊసుల సట్రంలో నేను_నీ ఊహలకు ఉలిక్కిపడుతూ..
3303. పెదవిప్పి లాస్యం చేసానందుకే_నీ తొలికవిత నాదవ్వాలని..
3304. అలుకను నటించడమెక్కడ నేర్చావో_అధరాలపై మనసైనప్పుడల్లా..
3305. అదను చూసి అలుగడం నీకే చెల్లింది_నన్ను వియోగానికి పొమ్మంటూ..
3306. అనురాగం అదను చూసుకుంది_అలిగిన అధరాన్ని అనునయించే నెపంలో.. 
3307. అలుకను దాచేసిందామె_అతని అభిమానానికి దూరమవకూడదనే..
3308. అదను చూసి అలిగిందా అతివ_ఆమె అధరాలంటే అతను పడి ఛస్తాడని..
3309. అలుకలకెన్ని ఒయారాలో_ఆమె అధరాల అందాన్ని ద్విగిణీకృతిస్తూ..
3310. స్వరంలో నువ్వున్నందుకే..నా శ్వాసలకిన్ని పరిమళాలు..
3311. కలలప్పుడే ఏకమైనవి_రెండు హృదయాల చప్పుడు ఒకటైనప్పుడే..
3312. అనురాగం వర్ధిల్లిందప్పుడే_నా నవ్వులు నీవిగా చేసుకోగానే..
3313. నాదే కువకువ వేకువలో_నేనే కలవంక కౌగిలిలో
3314. మౌనమూ పరిమళిస్తుందని గుర్తించా_నీ తలపు నన్నావహించగానే..
3315. నా నవ్వుకో అర్ధమొచ్చింది_నీలో ప్రేమను నిద్దురలేపగానే..
3316. తడిచిపోతున్నా_క్షణక్షణం పరవశమందించే నీ వలపుజల్లులో..
3317. అలసిన మనసుకి లేపనమే_చెలిమి పూతల చల్లదనం..
3318. కలతలన్నీ దాటేసా_కలలో నువ్విచ్చిన మధురిమను దాచుకొని..
3319. నా అలుకలు_కన్నీటిని నటించి ప్రేమను ఆశించేవి..
3320. కన్నీరూ తీపవుతుంది_చేరువైన చెలిమి చందనాల పూతలతో..
3321. నా వలపు విహంగమే_గగనమెగిసి నిన్ను చేరేవేళల..
3322. భావాలకెన్ని భంగిమలో_నీ అక్షరంలో అలవోకగా ఒదిగిపోతూ..
3323. షోడశకళానిధినైపోయా_నీ కదలికలన్నింటా నన్నే ఆహ్వానిస్తుంటే..
3324. పున్నమిపువ్వై నవ్వుకుంటున్నా_అమాస దగ్గరపడుతుందని మరచినవేళ..
3325. మన ప్రేమ_రుచి తెలిసిన రాగాత్మ స్వరూపమేగా..
3326. మధురక్షణాల మాలలెన్ని అల్లుతావో_నీలో నువ్వు లేవనుకుంటూనే..
3327. పరిమళిస్తున్నా_హృదయస్పందనలో నాకు మాత్రమే చోటిచ్చావని..
3328. నా చూపు చిక్కనయ్యింది_నీ వలపుకి చిక్కినందుకే..
3329. నీ మనసొచ్చి నా చెంత చేరింది_మదిలో చింత నువ్వు తీర్చలేదంటూ..
3330. అనుభూతులన్నీ ప్రోదిచేసుంచా_ఒక్కో అనుభవంగా మదిలో దాచుకుంటూ..
3331. మంత్రాలలో ఆరితేరి పోయాను_నీ పేరునే మంత్రాక్షరిగా జపిస్తూ..
3332. వరూధినని వచిస్తావెందుకో_తారల్లో తారగా నేను కలిసిపోదామనుకుంటే
3333. ఎన్ని వసంతాలు కనుమరుగో_నీకై వేచిన నా నిరీక్షణలో
3334. వసంతానికి చేపట్టనేలేదు_హేమంతానికి సీమంతమంటావేమిటో..
3335. నా ప్రేమ మత్తులో మునిగినందుకేమో_క్షణాలను యుగాలుగా కొలుస్తూ నువ్వు..
3336. ఆశక్కడే ఆగింది_నీ మనసు ముచ్చట్లను ఆలకిస్తూ..
3337. ముహూర్తం దగ్గరపడిందంటోంది మది_మనసుంటే మార్గం దగ్గరవొచ్చని
3338. తపనెందుకో తీరకుంది_సంతోషమింకా నా తలుపు తట్టలేదనే..
3339. ఆశలకదిగో ఉషోదయం_నిరాశను నిశీధిలో విడిచేయగానే
3340. విషాదంలో నేనున్నా_ఆనందం నీతో ముడిపడిందని తెలుసుకున్నాక..
3341. తమకం గగనమయ్యింది_నీ వలపు గంధాలు నాకలదగానే
3342. కన్నీటి ఉప్పదనం తెలిసింది_చెలియలకట్టలేని సంద్రమై ఎగిసాక..
3343. కొన్ని మనసులంతే_పరిచయంలోనే అశాంతికి గురిచేస్తూ..
3344. కొన్ని భావ పరిమళాలు_వద్దనుకున్నా మనసుని తట్టిలేపుతూ
3345. నిద్దురలోనూ నిన్నే దాచా_రెప్పలు విప్పితే తప్పిపోతావని
3346. తనువు తీపెక్కుతోంది_నీ స్మృతుల తేనెలు నెమరేసేకొద్దీ..
3347. చచ్చి బ్రతికినట్టవుతోంది_నీకు నచ్చనప్పుడు నన్ను ఓదార్చుకోలేక..
3348. అలుకనెందుకు తెప్పిస్తావో నాకు_అలరింపంటే మక్కువ లేదంటూనే..
3349. పులకింతలతో మది తడిచిపోతుంది_నీ వలపు పిలుపందుతుంటే..
3350. ఇలకొచ్చింది వాన చినుకు_నా భావాన్ని వెంటాడే ప్రయత్నంలోనే..
3351.  ఇష్టాఇష్టాలతో పని లేదట_అంతరంగం అలలెత్తి పోటెత్తుతోందలా..
3352 . ఇల్లంతా సందడొచ్చింది...మౌనం సెలవు పుచ్చుకొని మాటలు మొదలవ్వగానే..
3353. నేనెప్పుడూ దీపశిఖనే_నీ శూన్యహృదయంలో..
3354. ఇలలో ప్రేయసినంటావే_కలలోకి నన్నాహ్వానించకుండానే
3355. నిముషానికో కవితంటావు_ నిశ్శబ్దానికి కాసేపైనా విశ్రాంతినివ్వకుండా
3356. 
ఆస్వాదించడం అలవాటయ్యింది నీకు_నా సాహచర్యంలోని సంగీతాన్ని.
3357. నేనంతమైనట్టే_నాలో ప్రేమ కనుమరుగైపోతే..
3358. కురుస్తూనే ఉంది వేదనలా_శీతలమో సాంత్వనమై పలకరించేదాకా..
3359. నా మనసెప్పుడూ గొప్పదే_స్వప్నాల పరిధిదాటి నిన్నాకట్టుకున్నందుకు..
3360. ఆమె కళ్ళెప్పుడూ ఎరుపే_గుండెల్లోని మంటని వెదజల్లుతూ..
3361. అపూర్వలోకాలనేలుదాం_అనంతమైన ప్రకృతిలో మమేకమవుతూ..
3362. వెలుతురెటో మాయమయ్యింది_దైన్యం ఆవరించి మనసు రోదిస్తుంటే..
3363. మనసు తీపెక్కింది_ప్రతికలలో తేనెలు కురిపిస్తున్నది నువ్వయ్యాక..
3364. క్షణాలన్నీ ప్రియమైనవే_మనసంతా నిండిన నీ వలపుతోనే..
3365. జీవితమంతే_అశ్రువులలోనే ఆశలన్నీ తొక్కిపెడుతూ..
3366. హృదయంలో నువ్వెంత పదిలమో_నా ఆత్మలో విలీనమైన అనుభూతిలా..
3367. అలవాటైన గాయాలేగా అన్నీ_గేయాలకి ఉపమానాలుగా మిగిలిపోతూ..
3368. కలలన్నిటా నువ్వే_మనసంతా నువ్వయ్యాక..
3369. తడుముతున్న జ్ఞాపకాలెన్నో_నువ్వు దూరమైన హేమంతపు చలిలో..
3370. పెదవిపై మత్తుగా కమ్ముకుంది_తన పేరులోని అమృతం.. 
3371. నీ నవ్వులన్నీ దాచుకున్నా_ఆవేదనలో నన్ను ఓదార్చుతాయని..
3372. భాష రాదని భయపడలేదెప్పుడూ_కన్నులతో మాట్లాడే చొరవుందనే..
3373. మనసంతా గాల్లో తేలినట్లుంది_జ్ఞాపకాల మైమరపు మైకానికేమో..
3374. అతివని గుర్తించేదెందరో_ఆమె త్యాగాన్ని జీవితమంతా అనుభవిస్తూనే..
3375. పరిమళిస్తుంటే పువ్వనుకున్నా_నా మెడ వెనుక గిలిగింతవనుకోలా..
3376. రాణిగా పట్టం కడతావనుకున్నా_నీ రాజ్యానికి అతిధిగా పిలిచినప్పుడే..
3377. హృదయాన్ని నీకిచ్చేసా_కంటిచూపుతో కొల్లగొట్టింది నిజమనుకొనే..
3378. ఆత్మసాక్షి నీవే_నా పదాల ప్రతిపదార్ధం గుర్తించాక..
3379. ఆకర్షణెప్పుడూ సహజమే_నా రాతల్లో నువ్వున్నంత నిజంలా..
3380. అభిమానం_ఆర్ద్రతై నీలా కురిసిన మమకారం..
3381. మెరిసిన బిందువుదే అందం_పెదవంచు హరివిల్లును పూయిస్తూ..
3382. ఉదయానికెప్పుడూ ఆరాటమే_చీకటి తెరలు చీల్చుకు కిరణాలు వెదజల్లాలని..
3383. వేయి సితారల సవ్వళ్ళు ఎదలో_నాలోని పరిమళాన్ని నువ్వు ఆస్వాదిస్తుంటే
3384. నా మనసందంగా తొణికింది_నిన్ను దాచుకున్న పులకరింతకి..
3385. కన్నులు విడిచింది కన్నీటిననుకున్నా_హృదయాన్ని కడిగిందని గమనించక
3386. ప్రతీక్షణే మిగిలింది_తీక్షణలేని నీ ప్రేమకై ఎదురుచూపులో..
3387. ముందుగా మనసుపడ్డా_ఆపై నీ నిర్లక్ష్యంతో అలుసుపడ్డా
3388. నువ్వను సందడి_నేనను మధుమాసానికి..
3389. మనసు చీకటి చెదిరిపోయింది_మల్లెలా తెల్లగా నువ్వు  నవ్వగానే..
3390. మౌనానికెన్ని మాటలు నేర్పానో_నీతో ఊసులాటకు రావాలని..
3391. నీ సిగలో జాబిల్లినే_నన్ను తలకెక్కుంచుకు మురిసావంటే..
3392. నీలో చేరానప్పుడే_తొలిచూపులో నన్ను వెతుకుతున్నావని గుర్తించి..
3393. అరమోడ్పులవుతూ కన్నులు_నీ ఊహలు మదిని మెలిపెడుతుంటే..
3394. ప్రతి పదమూ నువ్వేగా_నేనంటూ రాయడం మొదలెడితే
3395. వలపునై వెనక్కు తిరిగొచ్చేసా_నీ ఊహలు ఉసిగొలుపినందుకే..
3396. కంటిపాపల బెదురులు_నీ చూపులు మీటుతున్న రాగాలకి..
3397. వలపు వెన్నెలై కురిసింది_హేమంతపు జల్లును నేనాశించినందుకే..
3398. ఎన్ని నయగరాల వెల్లువలో_నీ చూపు గారాల చిరునవ్వులో..
3399. ఎన్ని శిధిలాల ముక్కలో_నిన్ను జ్ఞాపకంగా తవ్వుకున్న ప్రతిసారీ..
3400. మనసుభరిణ తెరిచే ఉంచా_అక్షరముత్యాలు కొన్నయినా దాచుకుంటావనే..

03201 నుండి 03300 వరకు

3201. కథెన్ని మలుపులు తిరిగితేనేమి_చివరి మలుపులో కలిసేది మనమిద్దరమేగా
3202. అనుభూతులెన్ని పోగేసుకున్నావో_నా ఎదలో సుధలన్నీ కాజేసుకున్నాక..
3203. అనుభూతిగా వర్ణించినప్పుడే అనుకున్నా_అక్షరాలనే నాకు కానుకిచ్చావని..
3204. 
నీ మనసునప్పుడే గుర్తించా_అనుభవాలన్నింటా నేనే ఎదురుపడ్డాక..
3205. మనసు తీపికెక్కింది_మేఘాన్ని చూసి మయూరినై మురిసినందుకే
3206. పొలిమేర దాటి పయనించావెందుకో_నీ ఎదురుచూపుల్లో నేనుడిగిపోతుంటే..
3207. నీ రాణిగా నేనొస్తున్నా_మనోరాజ్యానికి దేవేరిగా ఆహ్వానించావనే..
3208. అనుభూతుల కిలకిలలు_నీ భావాలలో భంగిమలన్నీ నాకొసగావనే
3209. అంబరముగా మారిపోయా_అక్షరాలతో నన్ను మోసేస్తుంటే..
3210. రసరమ్య తీరాలన్నీ మనవేగా_అనుభూతుల ఆస్వాదనలో మించిపోయాక..
3211. మౌనాన్ని ముసుగేసుకున్నా_మాటలతో నిన్ను మెప్పించలేనని తెలిసాకే..
3212. ముగ్ధమైపోయా నేనే_నీ రూపాన్ని మదిలో మోహించి..
3213. నిశ్శబ్దం నీరయ్యింది_నా నవ్వులను అనుభూతించి కరిగిందేమో..
3214.ఎన్ని మలుపులైతేనేమి జీవితం_చివరిగమ్యంలో నాకోసం నువ్వున్నాక..
3215. మల్లెల త్యాగమదే_వేకువకు వాడినా పరవశాన్ని పంచుతూ...
3216. దిగులు వెన్నెలయ్యిందప్పుడే_నీ స్మృతుల నక్షత్రాలు మెరిసినందుకే..
3217. 
నా కలలకెన్ని రంగులో_జ్ఞాపకాలు ఇంద్రధనస్సులై విరబూస్తుంటే
3218. మరెన్ని జన్మలెత్తాలో_నీ జతకోసం జీవితాన్ని వరిస్తూ..
3219. మైమరపు వాక్యం నువ్వు_కలమంటగానే కాగితంపై ఒదిగిపోతావు..
3220. కొత్తగా పరిమళిస్తున్న పువ్వది_నిదురిస్తున్న లోకాన్ని మేల్కొలుపుతుంది...
3221. అక్షర నక్షత్రాల్లో నన్నెతుకున్నా_మనసాకాశంలో విహరించేది నేనన్నావని..
3222. ఇప్పుడే మొదలైంది ఆలాపన_ప్రతిపల్లవిలో నిన్నే కూర్చుకుంటుంటే..
3223. చూపుతోనే రణం_నలుగురి మధ్యలో నీకు అభివందనం..
3224.  ఇంకిపోయిందనుకున్నా కన్నీరు_ఈ జన్మకిలా ఊరుతుందని తెలీక..
3225. రోజుకో శుభాన్ని ఊహిస్తున్నా_నీ పొగడ్తలతో మనసుప్పొంగుతుంటే..
3226. సున్నితత్వాన్ని కోల్పోయిన మనసది_మాటల గాయాలకి రాటుదేరిపోయి..
3227. జలదానమెవరిచ్చారో ఆ జంటకు_జీవనదులై నిత్యమూ ప్రవహించేందుకు..
3228. నీ పెదవి పలికే పదములన్నీ నావేగా_రాస్తున్నది నా నువ్వైతే..
3229. గిజిగాడివేమో నువ్వు ఆ జన్మలో_వేళ కాని వేళలో నన్నల్లుకుపోతూ నేటికీ
3230. కలువలుగా నా కళ్ళు_నీ పూజకు పనికొస్తాయనే..
3231. మౌనం ధరించిన అధరాలేనవి_వ్యధలన్నీ మదిలో తలపోసుకొని..
3232. కవితగా కాలేని భావమొకటి_బాధలో భాషను వెతుక్కుంటూ..
3233. నేనెప్పుడూ మెరుస్తూనే ఉంటాగా_నీ కన్నుల్లో..
3234. నా మనసెప్పుడో నీకిచ్చేసా_అద్దమనుకొని అప్పుడప్పుడైనా తొంగిచూస్తావని..
3235. అక్షరాలకు బాధ పెరిగింది_ హృదయపు బరువును రాసేకొద్దీ
3236. మనసు మోయలేని బరువే అది_కాగితమెలా చేరదీసిందో..
3237. నెలవంకగా విచ్చేయనా_ఏ వంకా పెట్టకుండా ఆహ్వానించేందుకు నీవుంటే
3238. నీ ఊపిరి_నా నవ్వుల్లో మిళితమైన సంగీతమది..
3239. ఏకాంతం పరిమళిస్తోంది_నీ తలపులంటిన వెన్నెల్లో నేనున్నందుకే..
3240. చీకటికందని వెలుతురిచ్చావుగా_చెలిమిస్తావని చెంత చేరినందుకే
3241. నిన్ను మరవనందుకేగా_నిద్దురవిడిచి జాగారం చేస్తుంది రేయంతా..
3242. రేపటికి ఎదురుపడాలనుకుంటున్నా_నీ రెప్పలనాపే అద్భుతం నేనై..
3243. ఉల్లాసమే_నీ శ్వాసల్లో నాకు చోటిచ్చినందుకే..
3244. మువ్వై మోగింది నేనే_నీ హృదయాన్ని చిలికించాలని..
3245. సల్లాపమే_నా హృదయాన్ని చూపుతో చదివేస్తుంటే నువ్వు..
3246. ప్రేమ రగిలినప్పుడే అనుకున్నా_కలలో వలచింది నువ్వేనని..
3247. కాలమలా కదిలిపోతుంది_ఎన్నో రోజుల్ని రేపట్లోకి తీసుకెళ్తూ..
3248. వెన్నెలకి మెరుపంట_చీకట్లో రేరాజుతో కలిసి నీటిపై తేలుతుంటే..
3249. చెలిమిలో సౌఖ్యమే_చింతలన్నీ మదిలోనే సమాధి చేస్తూ..
3250. ఆలపించా ఆనందగీతం_చినుకు తడికి సరిగమలు పెదవంటగానే
3251. పెదవులదే తన్మయత్వమనుకున్నా_కన్నులు అరమోడ్పులై పరవశమొందేవరకూ
3252. బెంగపడ్డాది మది_రేపు కలగబోతున్న విరహానికే
3253. మధురిమ పెరిగిన నా పేరు_నీ ప్రేమలేఖలో చోటివ్వగానే..
3254. మౌనం గెలిచింది_నా అలుకలు నీ బుజ్జగింపులో కరిగిపోగానే
3255. ఎన్నో వేదనలోర్చుకుంది వెదురు_వేణువై హృదయాలను కొల్లగొట్టాలని..
3256. వెన్నెల గంధాలెప్పుడో నింపుకున్నా_నీ విరహపువేడిని తాళలేక..
3257. రేపటికి తోడవుతాలే_నా నిరీక్షణలోనే ప్రతీక్షణం నువ్వుంటే..
3258. ఎన్ని రాగాలో మనోగతంలో_నువ్వొస్తే వినిపించాలని..
3259. నే కధానాయికురాలునైనట్లే_నువ్వు కలం పడితే చాలుగా
3260. మనసెప్పుడో జేగంటై మోగింది_నీ కవనం నన్నల్లగానే
3261. కృష్ణవర్ణంలోనూ మెరుపొచ్చింది_మోహనగీతం చైతన్యమై రాధవ్వగానే..
3262. ఆలకిస్తూనే ఉన్నా నిన్ను_మౌనంగానో..ఆవేదనా గీతిగానో..
3263. నీ చూపులకు చిక్కుతాననుకోలా_కొన్ని అరనవ్వులు విసిరినందుకు..
3264. కొందరినే కౌగిలిస్తాయి కష్టాలు_వారి కన్నీటికి రుచెక్కువనేమో..
3265. మనసుని కోసి వెతుకుతావెందుకో_తనువుకి గాయమెక్కడయ్యిందని..
3266. అడుగడుగునా నీ తలపే_నువ్వే గమ్యమైన దారుల్లో..
3267. ఆశల రాగం మొదలెట్టా_కులాసగా నిన్ను చేరుకోవాలనే
3268. అనుభూతులన్నీ స్వర్గమిక_మనసంతా మనమయ్యాక..
3269. చిగురులేసి నేనెదురు చూస్తున్నా_ఆకులోఆకుగా నీకై మారి..
3270. కలలన్నీ నీ పరమేగా_వియోగంలో నే నొంటరయ్యాక..
3271. ప్రతి కధనీ దాచుకుంటున్నా_నన్ను పువ్వుగా రాసానన్నావని..
3272. ఆస్వాదిస్తున్నా స్మృతుల వెన్నెలలు_రాతిరి పరిమళించి నవ్వుతున్నందుకే..
3274. గాలితో నేనూసులాడుతున్నా_నీ వార్తలన్నీ మోసుకొస్తుందనే..
3275. నన్ను రాసినప్పుడే అనుకున్నా_నీ చికాకులన్నీ తీరిపోయుంటాయని..
3276. వర్షంలో కలిపేసా కన్నీటిని_నువ్వు గుర్తించడం ఇష్టంలేదనే..
3277. పూర్ణాంగి అప్పుడే అయ్యింది_ఇచ్చిన సగాన్ని పూర్తిగా ఆక్రమించినప్పుడే
3278. అనందానికెప్పుడూ అనుమానమే_విషాదం వెనుకొస్తుందేమోనని కంగారవుతూ
3279. హృదయంతో స్పందిస్తే చాలనుకున్నా_వెన్నెలనూ మోసుకొస్తావని తెలీక
3280. వెన్నెలెందుకు వెలవెలబోతుందో_గలగలమని నీ ఎదలోకి నేనొస్తే
3281. వసంతమొచ్చిందేమో నీ మదికి_కోయిలై నన్ను పలకరిస్తుంది..
3282. చెక్కిళ్ళకు అందమొచ్చింది_చందమామగా నిన్ను తలవగానే
3283. అమృతాలే నీ పలుకులెప్పుడూ_మధువులెన్నో నాపై చిలికిస్తూ..
3284. రేయిపగలూ లేదంటూ నిద్ర_కలలో నువ్వొస్తావని మాటిచ్చినట్లు..
3285. రేయంతా కురిసిందట వెన్నెల_తడిచిన అందాలతో కలువను చూడాలని..
3286. పారిజాతపు సున్నిసత్వం పెదవికంటింది_నా నవ్వును నువ్వు మెచ్చగానే
3287. చెంగల్వ చేరింది చెక్కిట_అతివేడిస్తే అందాన్ని అనునయిద్దామనే..
3288. నిలువెల్లా రాగాలే నాలో_నీ మోవి మీటిన పరవశానికనుకుంటా
3289. ఎన్నెన్ని గుసగుసలు దాచుకోవాలో_నీ శ్వాసలో సజీవమవ్వాలంటే..
3290. గమకాలెంత త్వరపడ్డాయో_మన తమకంలో తామొచ్చి చేరాలని
3291. మనసు ముంగిటే నిలబడిపోయా_ప్రియమారా నువ్వొచ్చి పిలవలేదనే..
3292. నల్లనితుమ్మెదలే నా కురులు_మోమందాన్ని రెట్టింపుచేసి మనసూగించేవేళ..
3293. ప్రవహిస్తూనే మనసు_నిన్ను చేరి ఆశ నివేదించాలని..
3294. అరమూతలవుతూ నా రెప్పలు_నీ రూపం దాచుకున్న పరవశానికి
3295. నీరవాన్నే నినాదంగా నివేదించా_మనసుకి ఏకాగ్రత కుదురుతుందని..
3296. నా ఊపిరికి హద్దులు చెరిపేసా_నీ శ్వాసలో చోటెత్తుక్కుంటూ..
3297. నా ఊపిరిలో చేరావప్పుడే_రాగాత్మను చేసి నిన్నాలపించినప్పుడే..
3298. తడపాలనుకున్నా నిన్నెప్పుడో_శరద్వెన్నెల్లో కాలాన్ని కాసేపు ఆగమనైనా.
3299. నీ కలలెప్పుడూ వరదలే_నిన్నాశించి నిదురించే వేళలల్లా..
3300. మైమురిసిపోతున్నా ఆ కవనంలో_నిన్నూ నన్నూ కలిపి రాసావనే..

03101 నుండి 03200 వరకు

3101. కలిపేసానిప్పుడే కనులూ కనులూ_మనిద్దరి కలలూ ఒకటేనని..
3102. అనుబంధపు గుభాళింపదే_తెరలు తెరలుగా హృదయాన్నే తాకుతుంది..
3103. లెక్కతేలని అనుభూతులు కొన్ని_ఆర్ధిక లావాదేవీల్లో చిక్కుకుపోతూ..
3104. ఆ జీవనం యాంత్రికమే_ఉల్లాస చైతన్యానికి సెలవిచ్చాక
3105. తన వియోగం_మునుపులేని విషాదాన్ని మదికి పరిచయించింది..
3106. వృక్షాలను కాపాడవల్సిందిక్కడే_పచ్చదనానికి పదిమంది చేతులు కలిపి..
3107. పగలంతా ఎక్కడుంటేనేం_రాతిరైతే కలగా చేరేది నన్నేగా
3108.  నీ ఒడిలో ఓదార్చినప్పుడనుకున్నా_ఇన్నాళ్ళ విరహమెందుకు దాచానోనని..
3109. నులివెచ్చనయ్యింది మది_కంటి భాష్పం తనలోకి జారాక..
3110. అతిధిగా అరుదెంచావనుకున్నా_ఆక్రమించేందుకు అడుగులేసావనుకోలా..
3111. నీ చెయ్యందుకున్నది చాలులే_విరిసినవిగా మనసంతా మాలికలే..
3112. జీవం నీలోనే_దేహమున్నది నాతోనైనా..
3113. గమకాన్ని గుర్తుపట్టేసా_తమకంతో నీ మనసు పాడినప్పుడే..
3114. నా రాతిరి ఘొల్లుమంటుంది_ఈ విరహానికి అంతమెపుడని..
3115. క్షణాలు కరుగుతుంటే ఆపలేకపోయా_జీవితం జరుగుతుంది కదాని..
3116. లక్ష్యాన్ని కలగన్నందుకేమో_విజయం సులువయ్యింది..
3117. చినుకు తడి తెలిసింది భూమికి_ఆకాశం అతిగా కురిపించిన వలపుకి..
3118. నేను సైతం తడిచిపోయా_కురిసింది ప్రేమజల్లని తెలిసాక..
3119. నేనోడిపోయా_అనుమానంతో నీ ప్రేమను కాదనుకొని..
3120. ప్రేమశాస్త్రం నేర్వాలనుకుంటా_వేరే గొడవల జోలికి పోవద్దనుకుంటే
3121. అపురూపమై చేరుతున్నా_ఆలింగనంలో పొదుపుకుంటావని..
3122. స్వరాలాపనే ఎదలో_నీ తలపులు స్వప్నాలై నన్నల్లేవేళ
3123. దేవతను కాక తప్పలేదు_నువ్వు గుడి కట్టి మదిలో పూజిస్తున్నందుకు..
3124. తొలకరిగా కురిపించా చిరునవ్వు_అమృతంలో తడవాలనుందని నువ్వంటుంటే
3125. సాగనంపేసా భావాలను_చంచలించే చిత్తాన్ని జయించలేని నిస్సహాయతలో
3126. సంతోషం సగం చచ్చింది_మరణంలో తనను సాయమడిగావనే..
3127. విషాదం తరిగిపోయింది_కన్నీటితో మనసు బాధ కడిగేసాక..
3128. మునకలేస్తూనే నేనుంటా_నీ వలపునదిలో పరిమళమున్నంత కాలం..
3129. పెదవుల్లో తప్పిపోతావెందుకో నువ్వలా_నవ్వుతున్నది నా కన్నులైతే..
3130. కలతకు కబురెట్టావెందుకో_కన్నుల్లోకి రమ్మని పిలిచింది నిన్నైతే..
3131. ప్రేమ కనుమరుగయ్యిందని తెలీదు_కెంజాయి రాగాలలో నేనున్నందుకు..
3132. వెన్నెలప్పుడే చిన్నబోయింది_తనకన్నా ముందే కన్నీరొచ్చి కురిసిందని..
3133. కన్నులు గుచ్చుతాయని తెలీదు_గుండెల్లో నొప్పి పుట్టేవరకూ
3134. మౌనాన్ని అనువదించేసా_అక్షరాలు వెల్లువై పాటగా కదిలొచ్చాయని.
3135. వాన కురిసినప్పుడనుకున్నా_నేనూ పువ్వునై పరవశిస్తే బాగుండునని
3136. ఎంత సతమతమయ్యానో_నీ జ్ఞాపకాల రాకపోకల ఒత్తిడిలో నేను..
3137. నినాదంగానే మిగిలింది శాంతి_రక్తం చిందిన రాత్రికి సాక్షిగా
3138. నా మనసెప్పుడు ఆరా తీసావో_ఆనందాన్ని నాకంటు కడుతూ నువ్వు..
3139. మనసులో ఎందుకో యుద్ధం_ప్రేమను అందుకొనేందుకు నేనుండగా..
3140. నా అరనవ్వులెప్పుడు దోచావో_నిన్న రాత్రి ఆదమరపుగా నేనుంటే
3141. నువ్వూ నేను_దూరమై కలిసున్న ఏక హృదయులమేగా..
3142. మృత్యువెప్పుడు ముంగిట్లోకొచ్చిందో_నీ వియోగంలోని నన్నోదార్చేందుకు..
3143. నీ మౌనానికిదే బదులు_నా పెదవికి కట్టుకట్టుకుంటూ..
3144.మౌనమెన్ని మాటలు గుప్పించాలో_నీ సంతోషాన్ని పంచుకోవాలంటే
3145. తలపుల నావ కదులుతోంది_కురిసే వానతో మనసు మమేకమవుతుంటే
3146. మనసంతా నేనే_నీలో సగమవ్వమంటూ పూర్తిగా చోటిచ్చాక..
3147. భావాలకెన్ని కిలకిలలో_అక్షరాల్లోకి నిన్ను తర్జుమా చేసేవేళల్లో..
3148. పరిమళ గానామృతమేలే_నా మనసు..నా మాట..
3149. అతివ ఆకాశంతో సమానమే_తనకు తాను ఉన్నతంగా ఆవిష్కరించుకోవడంలో
3150. పెరిగిన మాటల తరిగిన వలపులు_అపార్ధాల చిక్కులు బిగిసిన వలలో..
3151. ఆగిన ఊపిరి తిరిగొచ్చింది_చిరునవ్వుల తొలకరివై నీవొచ్చినందుకే
3152. మౌనం ముక్కలయ్యింది_నీ మాటలు సీతాకోకలై పిలువగానే..
3153. నల్లరంగు పులుముకుంది ఆకాశం_మరోసారి రోదించేందుకు సిద్ధమయ్యిందేమో
3154. అగమ్యమై తిరుగుతున్నా_నక్షత్రాల నడుమ నెలరాజు కానరాకనే
3155. అపస్వరాలెన్నో సరిదిద్దా_సంసారాన్ని స్వరబద్ధం చేయాలనే ఆశతోనే..
3156. నిశ్శబ్దంగా నవ్వేసా_అతిగా స్పందిస్తే నా కలలు నిద్దుర లేస్తాయని..
3157. నీ నవ్వులతో శృతి కలిపా_నువ్వు సంబరపడతావని భావించే
3158. మరల మరల జన్మిస్తా_అక్షరనిధులన్నీ నాకే రాసిస్తానంటే..
3159. ఎంతకని కాలాన్ని వేడుకోను_లిప్తలు గంటల్లోకి మారమని నీ సమక్షంలో..
3160. ప్రేమయఙ్ఞం మొదలెట్టాలేమో_జీవితాన్ని గెలుచుకోవాలనుకుంటే
3161. తరలిపోతున్న మేఘం_తనవారు గుర్తొచ్చిన క్షణాల తొందరలో..
3162. నవ్వడం నేర్పుతున్నా కన్నులకు_నీ అనుభూతులకు స్పందించాలనే..
3163. పరిమళాలే పడకుండా పోయాయి_నీకు దూరమైన క్షణమునుండే..
3164. జ్ఞాపకాలు కురిసిన సవ్వళ్ళేనవి_కన్నులనుండీ జారిన చినుకుల్లోనివి..
3165. అనుభూతుల వెల్లువలో తడిచిపోతున్నా_అక్షరాలు నీలా అభిషేకిస్తుంటే..
3166. జీవించే ఉంటా నీలోఎప్పటికీ_వాస్తవానికి మరణం సమీపించినా..!
3167. రాతిరవడం గుర్తించలేదు_నీ తలపుల నెమరింపులో మైమరచిపోతూ..
3168. నేనెంతటి అపురూపమైతేనేమి_తన చూపు నాపై పడనప్పుడు..
3169. నవ్వులను గువ్వలుగా మార్చేసా_నీ ముందరొచ్చి వాలేందుకే..
3170. 
కన్నుల గట్టు తెగింది_మనసు భారాన్ని మోయలేక..! 
3171. ఇంద్రధనస్సునై చేరుకున్నా_ఆకాశమై నువ్వున్నందుకే
3172. తలపులు తొందర పడ్డప్పుడు అనుకున్నా_తలుపులతో పని లేదని
3173. ఉత్తరం కోసమే ఎదురుచూస్తున్నా_నీ మనసు చదువుకుందామనే..
3174. అనుభవాలెప్పుడూ పాఠాలే_ఆవేశాన్ని దిగమింగుకోలేనందుకు..
3175. కలలు నిద్దుర లేచాయి_రాతిరి రాగమొకటి వినిపించగానే
3176. కరిగింది కల_పంజరాన్ని కౌగిలిగా భ్రమించానని తెలియగానే..
3177. అందం బంధమేసింది_ఆమె బొమ్మలా ఆకట్టుకోగానే..
3178. మాననంటూ గతం_మరుపునెంత ఆహ్వానించినా తాను వెళ్ళనంటూ.. 
3179. కన్ను చూపు మరలించింది_నీ కన్నీటికి ఆర్ద్రమవుతుంటే..
3180. నీ పేరే ప్రియమైంది_ఎన్నిసార్లు చెరిపి రాసుకున్నా..
3181. రెండువైపులా పదునే_కవి కలమంటూ కత్తిగా మారితే..
3182. ప్రేమప్పుడే పట్టుబడింది_మనసు నీవైపుకి తిరిగినప్పుడే..
3183. నువ్వు కలం పట్టినప్పుడే అనుకున్నా_నా కన్నీటికధను మొదలెడతావని..
3184. కన్నీటితో కడిగేసా_గతమొచ్చి పదేపదే ఇబ్బందిపెడుతుంటే
3185. అక్షరాలు అలరించాయి_కవి మనసుకి హృదిలో జోహారులర్పించి..
3186. పూబంతినై నవ్వుకున్నా_పండుగలో నన్ను ప్రధానాకర్షణగా చేస్తుంటే
3187. నా మనసు చెరుకుతీపయ్యింది_నీ మాటల తీయందనాలకే..
3188. అతివెప్పుడూ అద్భుతమే_సంసారాన్ని శృతి చేసే నేర్పు తనకుంటే
3189. నవ్వించేందుకు నేనొచ్చేసా_కేరింతలు నీతో కొట్టించాలని..
3190. బాధ సగమవ్వడం తెలిసింది_చెలిమివై నువ్వు పంచుకున్నప్పుడే
3191. కాలమాగిందక్కడే_తన గానానికి పరవశించిన దరహాసమై..
3192. రణాలే మిగిలాయాఖరికి_ఆ తోరణాలకి న్యాయం చేకూర్చలేక..
3193. అక్షరాలతో కలిసున్నా చాలనుకున్నా_నా కుశలోపరి నీకందుతుందని..
3194. ప్రవాహమవుతున్నా నీలో_నిత్య స్రవంతిగా నీలో కదలాడాలని..
3195. కల్పితమన్నది మిగిలినదేముందక్కడ_రాసిన ప్రేమంతా మన కధేగా..
3196. దయలేని క్షణాలేనవి_నిన్నల్లో నన్నొదిలేసి ముందుకు కదిలిపోతూ..
3196. బుగ్గలెరుపెక్కినప్పుడనున్నా_హృ
దయాన్ని మంత్రించి వేసింది నువ్వేనని
3197. ఓదార్చుకోక తప్పలేదు_నీ వియోగంలో మనసు కుదుటపడనంటుంటే
3198. చదివి చదివి అలసిపోయా_మనసు కాగితం చెమరించినంతగా..
3199. వ్యధలేగా అన్నీ_అప్పుడు కల్లోకొచ్చినవి నేడు నిజమైపోతూ..
3200. రంగు వెలసిన ఆనందమొకటి_తను నిష్క్రమించిన సాయంత్రములో