Sunday, 1 January 2017

02501 నుండి 02600 వరకు

2501. సంపెంగికెందుకో సిగ్గు_నా మోము మందారమై మెరుస్తుంటే
2502. అలుకెందుకు కులుకులు నేర్చిందో_అనురాగాన్నే ఆలపిస్తున్నా..
2503. వగలు పోతున్నప్పుడే అనుకున్నా_నా మీద వలపేదో పెంచుకున్నావని..
2504. వెన్నెల్లో పూసుకున్నందుకేమో_నా అందానికి మైమరపు తోడయ్యింది..
2505. నీ ఆనందం నేనవుతా_నువ్వనుభూతులు నెమరేసుకున్న ప్రతిసారీ..
2506. అద్దమై నువ్వుంటే చాలనుకుంటున్నా_అనుక్షణం అందాన్ని దిద్దుకొనేందుకు
2507. రోజూ పున్నమినెలా చూస్తావో_అందంలో వెన్నెలను రంగరించుకొని..
2508. రాత్రికి ముందొచ్చేది వేకువే_సత్యమ్ముందర దాగిన అకారములా..
2509. కాలాన్నే అనుసరించాలేమో_తప్పటడుగు తప్పించాలంటే
2510. అనుసరిస్తూ నా మనసు_నీ తలపులనే వెంటాడుతూ..
2511. ఋతువులన్నీ మనవేగా_కాలం గుప్పిట్లోకొచ్చాక..
2512. మనమొకటైనప్పుడే అనుకున్నా_ప్రకృతినింక లెక్కచేయబోవని..
2513. ఉప్పు తేరావనుకోలేదు_ఆనందభాష్పాలనుకున్నందుకు ఇప్పటివరకూ..
2514. గర్వమెక్కువే మగువకి_మల్లైనా జాజైనా తనకు ఉపమానాలేనని..
2515. గొంతు విప్పినప్పుడే అనుకున్నా_నచ్చిన రాగాలన్నీ ఒడిసిపట్టేద్దామని..
2516. బుగ్గలు తడిమినప్పుడే అనుకున్నా_నా నవ్వులు నీకు నచ్చేసాయని..
2517. కన్నులకింత మత్తుందంది తెలీదు_నువ్విలా గమ్మత్తు మాటలు చెప్పేదాకా.
2518. కలలోకొచ్చినప్పుడే కనిపెట్టా_కందిరీగవై కుట్టేస్తావని.
2519. మనసంతా నీదని ఒప్పుకుంటున్న_తప్పుకోక నావెంటే తిరుగుతుంటే
2520. సహనమనే సాధిస్తున్నారు_సమయాభావాన్నీ గుర్తించని కొందరు
2521. సౌందర్యమబ్బినప్పుడే అనుకున్నాను_పరిమళం ప్రాప్తించక తప్పదని
2522. లోకాన్ని విడిచేసాను_నన్ను కాదని తను విర్రవీగాక..
2523. రసలోకమొకటీ సరిపోతుందిలే_హృదయాలు చేరువయ్యాక
2524. మాటలు ప్రవహించినప్పుడే అనుకున్నా_నిన్నో గమ్మత్తుకు గురిచేయాలని..
2525. వెలుగుతున్నా పున్నమిగా_నీ సౌరభాలను దోచుకున్న రాతిరిలా..
2526. పెద్దరికం మంటగలిసింది_సూక్ష్మబుద్ధి అడుగంటగానే..
2527. అనురాగాల సవ్వడి నీదేనా_అభిమానం బెంగ తీరేలా..
2528. మునిమాపుకై నేనెదురు చూస్తున్నా_సంధ్యారాగమై నీవెంట నడవాలని..
2526. నీ వలపు అమృతం_తాగినకొద్దీ తీయదనం పెరుగుతూ..
2527. అడుగులకెప్పుడూ తడబాటే_వసంతం ఆహ్వానిస్తున్నా వాయిదావేస్తూ..
2528. గోధూళి రాగానే గుర్తించు_నా పదముల అడుగుజాడలను..
2529. సంధ్యారాగపు ఊహలు పెరుగుతున్నవి మదిలో_నీ జత చేరాలనే తొందరలో..
2530. ఆమంటే ఆప్యాయతే_అనురాగానికి మారుపేరు
2531. పరవశంలో పడేసినప్పుడే అనుకున్నా_సిగ్గుపల్లవిని శృతి చేసుంటావని..
2532. ఆకర్షణెక్కువవుతోంది_నీ మందలింపులోని లాలింపుకే..
2533. మౌనలిపీ తెలుగులోనే_మాతృభాషపై మక్కువనేమో..
2534. శూన్యమైంది జీవితం_ఆర్భాటాన్ని రచ్చ కెక్కించుకొనే
2535. దాసోహమెప్పుడో నా మది_నీ మాటలు మంత్రమేసినప్పుడే..
2536. పూవునై మెరిసిపోతున్నా_నీ మాటల పరిమళం నాకద్దగానే..
2537. మల్లెలే మధురభావనలు_సుదతి సోయగాన్ని రెట్టింపు చేయడంలో..
2538. నీ తలపులు కలహంసలే_నా ప్రపంచానికి రెక్కలొచ్చినప్పుడు..
2539. పులకింతై కదిలింది_నీ స్మృతులలోని నా ఆనందమేదో..
2540. ఉల్లాసాన్ని ఊపిరిలోకి ఆహ్వానిస్తున్నా_గెలుపు గమ్యాన్ని ఆశపెట్టి..
2541. ఆ నలుగురూ అవసరమే_నువ్వు బ్రతికున్నావని గుర్తు చేసేందుకైనా..
2542. కలలనే కవితలుగా రాస్తున్నా_నీ కళ్ళు మెచ్చుకుంటాయనే..
2543. కన్నులతో నవ్వడమెక్కడ నేర్చావో_చూపులతోనే కనికట్టు చేస్తూ..
2544. కరిమబ్బులు కదిలిపోతున్నాయి_నీ ప్రేయసి కాటుకలకసూయ చెందేనేమో..
2545. తోటలోనే ఉండిపోవాలనుకున్నా_తుమ్మెదవై తప్పక పలకరిస్తావనే..
2546. నీ పరిమళానికే మత్తిల్లిపోతున్నా_పువ్వునని నేను మర్చిపోతూనే..
2547. చేరువయ్యే చేతులు కొన్నే_చెలిమికి చైత్రన్యముగా చుట్టమయ్యేవి..
2548. మనసు తేలికైనప్పుడే అనుకున్నా_నీ ఆత్మీయతేదో ప్రవహిస్తుందని..
2549. మనసు గుబులు తీరినట్లుంది_నువ్వొచ్చి గాయాలను నిమరగానే..
2550. భావలకెందుకు బెంగవుతోందో_అక్షరాలు కూడగట్టుకొనేలోపుగానే..
2551. చెలిమి ముసుగులో ద్రోహాలు_నేస్తాన్ని నిప్పుల ఊబిలోకి నెట్టేస్తూ..
2552. చిరునవ్వు తానే చేరికయ్యింది_చెక్కిళ్ళు రమ్మని ఆహ్వానించగానే
2553. నీ చూపులెంత తీక్షణాలో_మనసును కొల్లగొట్టి అడుగులేస్తూ..
2554. ఆత్మీయతను మరచిపోవాలనుకున్నా_నన్ను నాకు కాకుండా చేస్తుందని..
2555. అపాత్రదానాన్ని గుర్తించలేకపోయా_ఆత్మీయతలో కళ్ళు మూసుకుపోయినందుకే
2556. నగుబాటుగా మిగులుతోంది జీవితం_నలుగురిని తలచినప్పుడల్లా..
2557. మువ్వలు నవ్వినప్పుడే అనుకున్నా_మనసు నిండే వేళయ్యిందని..
2558. ఎంత తేనె తాగమంటావో_మాటల తీయందనాలు తడుముకోవాలంటూ..
2559. ఆ విరులదెంత అతిశయమో_అతివ అందానికి తాము కారణమయ్యామని..
2560. అందం గెలిచిందిగా_ఎవరితో పోటీ పడే అవకాశమే ఇవ్వనంటూ..
2561. మల్లెలపై అలుకెందుకో అతివకి_మనసులో తను గుర్తుకొస్తున్నా..
2562. కాలం మందు పూయాలనుకుంది_కలాన్ని చేరదీసానని తెలుసుకోలేక..
2563. అశృగీతికలేనవి_ఆకలి మంటలను ఆర్పలేని చలివేంద్రాలు..
2564. ఊసుల్లోనే కలదిరుగుతావెందుకో_వేరెవ్వరితోనూ ముచ్చట్లు సాగనివ్వకుండా..
2565. కలెందుకు నవ్వుకుందో_రాతిరి కాకుండానే తనని రమ్మనందుకేమో..
2566. నలుగురెప్పుడూ నావెంటే_నన్ను నీలాపనిందల నుండీ కాపాడేందుకు..
2567. కుసుమించిందో భావం_నీ మనసుపొరల్లోని మమతను మీటేందుకే..
2568. నిద్దురే పట్టకుంది రేయంతా_కలలను కౌగిలించే ఆశను కోల్పోతూ..
2569. పరిమళించే మనసేమో తనది_సిగలో పువ్వులకూ కాస్తంత పంచుతూ..
2570. మరణమెటో జారుకుంది_సంజీవైన నిన్ను నాలో చూడగానే
2571. కళ్యాణిపైనే మక్కువంటున్నా_కిన్నెరగీతాలన్ని ఆలపిస్తున్నా..
2572. సంధ్యారాగం వినబడుతోంది_అలల హోరు నృత్యానికి శృతి కలిపి..
2573. నిముషాలెన్ని నిలబెట్టానో_నా వలపు ఆఘ్రాణించే నీ నిరీక్షణలో..
2574. రాతిరిదే పులకింత_ఎంతకీ అంతమవని మన ఊసులతో..
2575. విరహం ద్రవిస్తోంది_నీ అతిశయపు మాటలకు ప్రేమొచ్చి..
2576. జాబిలి నేనై మురిసిపోయా_నాకోసం నువ్వెదురు చూసావనే..
2577. రేయికెప్పుడూ వగలే_పగటి ఊసులతో పోటీ పెట్టినా గెలుపు తనదేనని
2578. వయసును మరిపిస్తున్న యాంత్రికత_కళ్యాణాన్ని కల్లగా విడిచేస్తూ..
2579. కన్నులవే భాష్యాలన్నీ_అంతమవని వేదనను అశ్రువులుగా కురిపిస్తూ..
2580. తలపులకే అంకితమైన జీవితం_నెమరింతల పర్వానికి చేరువయ్యాక..
2581. మరణానికి దడుపు లేదు_నీ ఆత్మలో లీనమయ్యాక..
2582. నా ప్రేమ అమరం_అక్షరాల రాసులన్నీ నిన్నభిషేకించాక..
2583. వింతగా ఒయారాలు పోతోంది గోదారి_వెన్నెల్లో ఆడపిల్లని తలచుకుందేమో..
2584. పున్నమి వెన్నెలయ్యింది నా మది_నీలో అనందం తనలో పొంగిపొరలగానే..
2585. పలుకు తేనేలవుతోంది ప్రతిసారీ_నిన్ను పిలిచిన సంతోషానికే
2586. కన్నుల కవితలు చదువుకున్నా_పరిమళాలు నావైపు ప్రసరిస్తుంటే..
2587. సిగ్గులు దాచుకున్న కన్నులే నావి_కాటుకలు గీసిన హద్దులతో..
2588. సహజముగా దగ్గరైన హృదయాల్లోనే_సంగీతమై వెల్లువెత్తు ప్రణయాలు..
2589. మనసైన పాటేనది_సంతసాన్ని పల్లవిగా చేసుకొని పాడింది..
2590. తాళం వేద్దామనుకున్నా ఇప్పుడే_తాదాత్మ్యం తనువును తాకినందుకే
2591. జల్లుగా కురిసినప్పుడే అనుకున్నా_కవిత్వాన్ని చల్లింది నువ్వేనని..
2592. గుర్తొచ్చిందో జ్ఞాపకం_అనురాగం గానముగా ఆనందం హరివిల్లుగా
2593. విరహంలో ఉందేమో కోయిల_హేమంతాన్నే వసంతంగా భావిస్తూ..
2594. మనసిక్కడ ఆలపిస్తుంది_నువ్వక్కడేస్తున్న తాళానికే..
2595. అరకొరగానే పడుతున్న చినుకులు_స్వాతిశయాన్ని చూపిస్తుంటే మేఘాలు..
2596. ఆనదభాష్పాలు నావయ్యాయి_ఆనందాలు నీవైనందుకే..
2597. మనసే మధుమాసమయ్యింది_బృందావనాన్ని శాశ్వతం చేసేస్తూ..
2598. వెన్నెలకీ పరిమళమంటింది_మల్లలను తలుచుకు కురుస్తున్నందుకే
2599. నిద్దుర లేచిన మనసొకటి_కలలోని కేరింతల సందడికి..
2600. చెలిమిదెప్పుడూ గెలుపే_కాలమెన్ని కష్టాలను పరీక్షగా పెట్టినా..

 

No comments:

Post a Comment