Sunday, 1 January 2017

02601 నుండి 02700 వరకు

2601. అనురాగం గగనమంటింది_మన చెలిమి గీతానికి సాయమొచ్చి..
2602. తారలెన్ని తరలొచ్చాయో_గగనానికి చెలిమిహారమేద్దామని పిలవగానే
2603. సరిగమలకెంత ఆనందమో_స్నేహగీతంలో తమకు చోటిచ్చినందుకు..
2604. సాహిత్యమెప్పుడూ మక్కువేగా నాకు_చెలిమి చేతులు కలిపింది తానేనని..
2605. చెలిమే కలిమయ్యింది_వేరే బలమేదీ వద్దనుకున్నాక మనసు
2606. పులకింతల తోరణాలెప్పుడు కట్టావో_చెలిమిపండుగకు నన్ను పిలవకుండానే
2607. గ్రీషమమందుకే తరలిపోయింది_చెలిమనే చినుకు కురవడం మొదలవ్వగానే
2608. పచ్చగా రమ్మన్నప్పుడే అనుకున్నా_నీ చెలిమికి ఊపిరి నాదేనని..
2609. కన్నుల్లో కోటి కలలెందుకోననుకున్నా_చెలిమి వసంతమొచ్చిందని గుర్తించక
2610. షడ్రుచులు నాకెందుకులే_స్నేహమనే నీ తీపి మనసునంటగా
2611. చెలిమికెన్ని రాగాలో_ప్రతిరాగంలోనూ అనుబంధం చిక్కబడుతూ
2612. చేదు కూడా తీపై కూర్చుంది_నీ చెలిమి అతిశయం వంటబట్టిందనేమో..
2613. ఆనందరాగమై మనసూగింది_భైరవిలోనూ నన్నే కూర్చి పాడావని..
2614. తుమ్మెదనెప్పుడూ ఆహ్వానించా_పుష్పాలన్నీ కలిసికట్టుగా విందిస్తున్నాయనే..
2615. దేవుడెంత అబ్బురపడ్డాడో_స్నేహితులుగా మనల్ని ఇలకు పంపి..
2616. భ్రమరాంబనై ఎదురుచూస్తా_చెలి మల్లికవై నా కొప్పు చేరతానంటే
2617. సెలయేరులా మన స్నేహం_ప్రవహిస్తూ నిత్యకుండమై మిగలాలని..
2618. మనసునెప్పుడో సిద్ధం చేసేసా_చెలిమి పంట పండించేందుకు నువ్వొస్తావని
2619. ఎన్ని వరదలొస్తేనేమిలే_మన స్నేహమైతే కొట్టుకుపోనిదేగా
2620. చెలిమి చప్పుడయ్యినప్పుడే అనుకున్నా_తలపుల్లో నువ్వొచ్చి చేరుంటావని
2621. కలతల మాటెందుకులే మనకు_కలిమి చెలిమై చేయూతకొచ్చేసాక
2622. అపార్ధాలెంత గింజుకున్నాయో_మన చెలిమిలో తమకు స్థానమివ్వలేదని..
2623. చిత్రాంగిలా ఆడింది చెలిమి_నువ్వు చేసిన మువ్వల సవ్వడికి సంతసించి
2624. ఆంతరంగికమై మిగిలిపోయాగా_స్నేహమనే హృదిగదిలో నాకు హారతిచ్చాక..
2625. కాలమెందుకు వెనుదిరిగిందో_మన చెలిమి వేగానికి కుళ్ళుకుందేమో
2626. చెలిమెప్పుడూ చిరంజీవే_అపార్ధానికి ఆయువు మూడినప్పుడు
2627. చెలిమి రాతలేగా మనవన్నీ_అపర్ధానికి చోటిచ్చేదెవరులే
2628. చెలిమి చిరునవ్వినప్పుడే అనుకున్నా_మువ్వలా సవ్వడేనని మురిసిపోతావని..
2629. నీ అడుగులో నా నడుకలే_స్నేహానికి సరికొత్త బాటనేస్తూ..
2630. కన్నీరెప్పుడు ఆనందమైందో తెలీనేలేదు_నీ చెలిమిలో మునిగిపోయాక
2631. అపార్ధాలెప్పుడో అంటుకున్నవి_చెలిమి చల్లదనాలు తనకు పడలేదంటూ
2632. నడకలో నాట్యాలూను_మన చెలిమి మయూరమై పురివిప్పుకుంటే
2633. అనుమానం గాలికెగిరింది_నీ చెలిమి నన్ను ఆదుకోగానే
2634. వేరే అనునయాలొద్దనుకున్నా_నీ చెలిమి చైతన్యానికి చేరువయ్యాక..
2635. కలతలకెప్పుడూ అగచాట్లే_మన స్నేహానికి కన్నులు మండుతుంటే
2636. కలానికెంత కులుకొచ్చిందో_చెలిమికి వారధిగా రమ్మని పిలవగానే
2637. చెలిమితోనే చక్కదిద్దాలిక_విడిపోయిన కాలపు వంతెనను..
2638. నా కలానికెంత ఆనందమో_నీ చెలిమిని రాయమన్న ఉత్సాహంలో..
2639. ముఖచిత్రం నేనైపోతాగా_చెలిమి గ్రంధాన్నే నువ్వు ముద్రిస్తానంటే
2640. తారల నడుమ చెలిమి చూస్తున్నా_పున్నమి వెన్నెలను మరపించినట్లుగా
2641. ఎన్ని చుక్కలు ఒక్కటయ్యాయో_చెలిమికి చేదోడుగా చేరమంటే
2642. లాలసెక్కువేగా మన చెలిమికి_అనురాగాన్ని నీరుగా పోసినందుకు
2643. చెలిమే వెన్నెలై కురిసింది_రాతిరి నిశీధి అమాసని మరిపిస్తూ..
2644. వెన్నెలైనా చీకటైనా మనమేగా_చెలిమనేదే మన తోడైతే
2645. రసోదయమైనప్పుడే అనుకున్నా_చెలిమి పండుగకు వేళయ్యిందని
2646. మనసేగా దారి చూపింది_స్నేహం అడ్డదారిలో పయనిస్తుంటే
2647. వెతలన్నీ వేడుకైనవిగా_స్నేహమనే చిరునవ్వుతో నన్ను పలకరించగానే
2648. కలలోనూ కలవరమే_వరమైన నీ స్నేహాన్ని గుర్తించినప్పుడల్లా
2649. కవితలన్నీ కవనమైనవి_మన చెలిమి పుష్పించి పరిమళిస్తుంటే
2650. అపార్ధం అడ్డు తొలగినప్పుడే అనుకున్నా_స్నేహానికి దారి సుగమమైందని
2651. నవరసాలకెందుకో ఆరాటం_మన స్నేహగీతంలో కలవాలని ఒక్కసారి
2652. గమ్యమే చెలిమయ్యింది_అపార్ధాలు దారి మళ్ళించాలని చూసినా
2653. నాకు నేనుగా చేయి కలిపా నీతో_అనుబంధాన్ని వదులుకోరాదనే
2654. వజ్రమైనా దిగదుడుపేగా_ నీ చెలిమి గట్టితనం ముందర..
2655. కృష్ణవర్ణం పులుముకుంది రేయి_మన చెలిమి వెలుగు చూడాలని..
2656. వేరే పరిచయమక్కర్లేదుగా_నీ చెలిమి నేనని ప్రపంచానికి తెలిసిపోయాక..
2657. బాల్యంలోని బంధమేగా మనది_స్నేహానికి మరింత వన్నె పెంచుతూ 
2658. పరసువేదిలా నీ స్నేహం_ఎన్ని కష్టాలకోర్చుకొని నిలబడిందో..
2659. చుక్కలకెందులో ఆరాటం_చెలిమి వెలుతురును సవాలు చేయాలని..
2660. క్షణభంగురమైతేనేమి జీవితం_చెలిమి చేయూతను చవిచూసాక
2661. వేల చుక్కలూ సమానం కావేమో_మన చెలిమి గాఢతను లెక్కించాలంటే
2662. వన్నెలన్నీ మన స్నేహానివేగా_అంబరమే చెలిమికి తలవంచితే..
2663. అక్కరకి రాని చెలిమెందుకు దండుగ_మనసును అధోగతి పట్టిస్తూ
2664. నిశీధిలో వర్షిస్తేనేమిలే_అమృతధారలేగా నీ చెలిమి..
2665. నీ చెలిమేగా ఆధారం_నా మల్లె మనసు పరిమళించేందుకు..
2666. చెలిమి పులకింతల్లో సేద తీరింది మది_ఆనందం కానుక చేసిందనే
2667. పల్లవి నేనై ఒదిగిపోలేనా_స్నేహగీతాన్ని నాకోసం రాసానంటే
2668. నిశ్శబ్దమెటు పయనించిందో_మన చెలిమి కేరింతల తుళ్ళింతల్లో..
2669. చిరునవ్వూ అరువు తెచ్చుకోవాలేమో_నీ చెలిమే నన్ను చేరకపోతే
2670.చెలిమికి చిరునామా మనమేగా_ఏ దిక్కునున్నా మనసొక్కటైనందుకు..
2671. చెలిమొక చైత్రమాసమేగా_మధుగీతికలకు ప్రాణం పోసేవేళ
2672. అవునన్నా కాదన్నా_నా చెలిమి నువ్వేగా ఈ జన్మకి..
2673. అనురాగానికే నర్తిస్తున్నా_చెలిమి చకోరినై ఎదురు చూసినందుకు
2675. వెన్నెల్లో వనవాసమైతేనేమి_నీ చెలిమిగా నేను మిగిలిపోయాక..
2676. నీరందని గులాబీలా నేను_నీ చెలిమిని కోరి భంగపడ్డందుకు
2677. కన్నుల్లోనే దాచుకున్నా పున్నములు_చెలిమి పండక్కి నువ్వొస్తే చూపాలని..
2678. ఆకలి మంటకు పరిష్కారమయ్యావు_నీ చెలిమితో ఆహారాన్నందించి
2679. స్నేహగీతమొకటి రాస్తున్నా_అంకితమిచ్చేందుకు  నీవున్నావనే
2680. హేమంతమనే పేరు పెడతాను_గ్రీష్మమైనా నీ చెలిమి తోడుంటే
2681. ఋతువులన్నీ మధుమాసాలే_చెలిమి పుష్పాలను ఆఘ్రాణిస్తుంటే
2682. వేరే చింతలు మనకెందుకులే_వంత పాడేందుకు చెలిమనే గీతముండగా
2685. కలకాలం ఉంటుందిగా మన స్నేహం_పరిచయానికి కొనసాగింపుగా
2686. పూలవాన కురిసినట్లుంది_నీ స్నేహం జల్లై నన్ను అభిషేకిస్తుంటే
2687. పరిమళమంతా చెలిమిదేగా_మనసు వివశమైనప్పుడల్లా
2688. స్నేహసుమాన్ని వాడనివ్వనుగా_అమృతమైనా పోసి రక్షిస్తూ..
2689. నవలోకానికి నాయికనయ్యా_నీ చెలిమి వారసత్వం నాదయ్యాక
2690. వన్నెకెక్కిన విశేషమే_స్నేహమనే అరుణకిరణం
2691. నా పండుగలన్నీ నీతోనే_చెలిమి కళలన్నీ మనవైనందుకు
2692. అలౌకికానందమైంది_చెలిమి అతిశయించి గలగలమంటుంటే
2693. నీ చెలిమేగా నాకు సుప్రభాతం_ఉదయమెంత ముసురేసినా
2694. మైత్రివనంలో మనమిద్దరం_స్నేహగీతాలకు ప్రాణం పోస్తూ
2695. కలలెన్ని వెల్లువయ్యాయో_మన స్నేహాన్ని మది గుర్తించగానే
2696. మౌనమైనా మధురమవుతోంది_నీ చెలిమి ఆస్వాదనలో
2697. ఎన్ని కలలను పొదుగుకోవాలో_స్నేహాన్ని పెంచి పోషించాలంటే..
2698. నీకు నాకు మధ్య నిశ్శబ్దమెందుకో_చెలిమిలో చేదును తుంచేయక
2699. చెలిమిరాగానికెన్ని కృతులో_అనుపల్లవి నువ్వై పాట పాడగా
2700. రోహిణికార్తెలో శీతల సమీరం_నీ చెలిమి మలయమారుతం..

No comments:

Post a Comment