4301. ఉలి చిన్నబోయింది...ఒళ్ళంతా గాయం చేయాల్సిన శిలను తలచి..
4302. అక్షర తావి మలిగింది ...ఆశించిన మదికి పరిమళాలు పడలేదని..
4303. నేనెప్పుడూ హరివిల్లునే_ఆకాశమాపలేని చినుకుగా నువ్వు కురవాలంతే..
4304. కవితగా రాసేసుకున్నా_తన పరిచయాన్ని పదిలంగా పట్టుకోవాలని..
4305. పరిమళాన్ని తోడుతెచ్చా వెన్నెలనై_పరవశంలో నువ్వు గుర్తించలేదంతే..
4306. అనుభూతులపూలను గుర్తించా_నీ మనసు అందంగా నవ్వగానే..
4307. అపురూపాలే కొన్ని_ఆ క్షణాన నువ్వు లేవంతే..
4308. ఓ సరికొత్త రాగం_మన పరిచయాన్ని పురస్కరించుకుంటూ..
4309. ఇంద్రధనసు విరిసినవేళ_నా మనసు నవ్విన హేల..
4310. మనసు కెరటమై ఎగుస్తుందలా_నీ జ్ఞాపకాలు మీటినప్పుడల్లా..
4311. కాలం పలుకరిస్తుంది_నా మదిలో సంగీతాన్ని ఆలకించాలని..
4312. మనసెన్ని మెలికలు తిరిగిందో_జాబిలంటూ ఒయారాన్ని కాజేస్తుంటే..
4313. కన్నీటిని ఆపేదెలా_ఆయువలా పూర్తైపోతుంటే..
4314. మనసెందుకు నవ్వుకుంటుందో_నా చూపుకి కలలు అడ్డుపడుతుంటే..
4315. నీ ఊహలోనే మూగబోతున్నా_కొన్ని కలలు తీపినిస్తుంటే..
4316. నేనేగా లోకం నీకంతా_మనసెంత చీకట్లో చిక్కుకున్నా..
4317. నీ స్వప్నాల నీడలు_నా మెలకువకు వర్ణాలద్దుతూ..
4318. ఆరుద్రనవుతూ నేను_మిణుగురును ప్రేమించే నిన్నాకట్టుకుందామని..
4319. వియోగం ప్రాణానికొచ్చింది_ఊపిరిసలపనివ్వని వేదన ఎక్కువై..
4320. నేనెప్పుడూ కలగానే మిగిలిపోతా_శూన్యాన్నే తలచి నువ్వు రోదిస్తానంటే..
4321. మరోజన్మలోనూ కలవాలనుకున్నా_ఈ జన్మకిలా సాధిస్తూనైనా..
4322. మల్లెలు గానం చేయడమేమిటో_నీ మాటలకు మురిసిపోతూ..
4323. నీ మనసెప్పుడూ ఆకాశమే_నాకై విశాలంగా ఎదురుచూస్తూ..
4324. చకోరిగా ఎదురు చూసావనే_నీ కలనై నేనొచ్చా..
4325. పరవశాలే మదికిప్పుడు_పున్నమిని నువ్వు గుర్తుచేసినందుకు..
4326. చిగురాకు మెరుపులన్నీ నాలో_వసంతాన్ని ఊహించిన భావనకేమో..
4327. అతని ఆరాధనకు పువ్వులు_పరమాత్ముని కైంకర్యానికి సిద్ధమవుతూ..
4328. ఆకాశమాపలేని చినుకులంట_నేలమ్మను ఆలింగనం చేయాలని..
4329. పరువానికెందుకింత తొందరో_ప్రణయానికి రమ్మని నువ్వు పిలవగానే..
4330. నీ గానంలో తడవాలనుంది_తొలకరివై ఓ పాట పాడరాదా..
4331. చెలికాని పులకరింపు_చెలి చెమరింతలో..
4332. ఆ కన్నీరు నిత్యప్రవాహమే_కొన్ని కలలు మరుగుతున్నవేళ..
4333. కలల తాకిళ్ళు_వలపు నవ్వినందుకేమో..
4334. కాగితం పొర ఆపలేనంది_భావాల ఆవేదన తట్టుకోలేనంటూ..
4335. ఆనందం కదిలొచ్చింది_నిన్నుదాటి నీ పరిమళం నన్నంటగానే..
4336. మనసుల హోలీ_కలల రంగుల్లో..
4337. వసంతం నిరంతరం_వరించిన ఊపిరికి..
4338. నీ ఊహలే ఆద్యంతం_నా పెదవుల్లో సంగీతం..
4339. నలుగురేడిస్తే చాలనుకున్నా_నలభైమందికా నవ్వులెందుకో..
4340. అదో మలుపు_కలగా సర్దుకుపోమంటావెలా..
4341. అపార్ధాల సంకెళ్ళు_వలచిన మనసుకి నరకాన్ని పరిచయిస్తూ...
4342. విరహానికి బదులివ్వనంటూ మది_తలపుల్లో నువ్వున్నావని మురిసిపోతూ..
4343. భావాల బడబాగ్ని_మనసుని వెలిగించి కవితని కదిలిస్తూ..
4344. మదిలో నిజమే మల్లెలవాన_పరిమళమెక్కడిదంటే ఏం చెప్పనూ..
4345. మాటల కొరడా ఝులిపించకలా_మౌనం ముక్కలై రాలిపడేలా..
4346. ఈ గాలికెందుకో గుసగుసలు_వర్షించిన ఊహల్లో నేనుంటుంటే..
4347. ఆనందాలేవీ మిగల్లేదిక్కడ_వేదన వీచికలై వీస్తుంటే..
4348. చినుకు కురిసిందందుకే_తనువారా తరువును తడపాలని..
4349. వలసపోతున్న పూలనడుగుతున్నా_నీవొస్తే నిష్క్రమిస్తున్నాయెందుకని..
4350. నీ మనసే నాదయ్యింది_వేరే నిధులేవీ కొరనివ్వనంటూ..
4351. నేనెప్పటికీ ప్రేయసినే_అతనంటూ మోహిస్తే..
4352. మల్లెలు తెచ్చిన సందడే_నీ మనసంతా పరిమళింపజేయాలని..
4353. ఆ మనసంతే_తడిగా ఉండలేనంటూ అదేపనిగా ఎండిపోతూ..
4354. ప్రశ్నోత్తరాలతోనే జీవితమంతా_నిన్నా రేపూ కలిసి నేడవనందుకు..
4355. ఆలాపనలా కుదిరిందంతే_బృందంలో నన్ను గమకాన్ని పాడమంటూ..
4356. సావేరిగానే మొదలెట్టా_మోహనగా మది మారుతుందని తెలీక..
4357. నేనంటూ వ్యర్ధమిప్పుడు_నన్నెవరూ తలవనప్పుడు..
4358. పాలపుంతగా నా మది_విశ్వాన్ని చూసేందుకు నువ్వొస్తావంటే..
4359. పరవశమిప్పుడబ్బింది_నీ కవనం నాలో వివశాన్ని రేపుతుంటే..
4360. మనసుకు జలుబు చేసింది_నీ వేదనలో తడిచినందుకేమో..
4361. ఎన్ని భావాలు రాశులయ్యాయో_మన రాగాలకు వంతపాడాలని..
4362. ఎన్ని తరువులు మూగబోయాయో_మన పల్లవిని ఆలకించాలని..
4363. పరవశాలెన్ని గుప్పుమన్నాయో_మల్లెల్ని మించిన మత్తునిచ్చావని..
4364. ఎన్ని ఊహలు నిద్రలేచాయో_నీ భావాల్లో నన్నుంచావని..
4365. తలగడకెందుకో తపనలు_నువ్వు ఆస్వాదిస్తుంది నన్నయితే..
4366. కష్టాల జలపాతాలు_కన్నీటిని కురిసేందుకేమో..
4367. చరణాలుగా కదులుతున్నా_ఒక్క పల్లవిగా నన్ను ఆరాధించావనే..
4368. గతాన్ని వదిలించుకున్నా_వర్తమానాన్ని అభిమానించాలనే..
4369. అక్షరం ఆయుథమయ్యింది_కొన్ని వికృతాల్ని ఖండించాలనే..
4370. నా ఊహల కదలికలు_రంగుల పడవలుగా గమ్యానికి చేరువవుతూ..
4371. కాగితపు పడవల్లో బాల్యం_చినుకు జారినప్పుడల్లా స్మృతుల్లోకి చేర్చుతూ..
4372. ఒంటరితనపు దిగులు దూరమైంది_బాల్యానికి పయనమవుతున్న ఏకాంతంలో..
4373. గాడి తప్పిన గుండె_కన్నీటి ప్రవాహాన్ని ఆపలేక..
4374. మనమంటే ఓ లోకమిప్పుడు_మానసికంగా చేరువైనందుకు..
4375. కల నిజమైంది_నా చుట్టూ నిన్ను గమనించుకున్నాక..
4376. నీ ఊసులతోనే గారాలు మొదలు_ఊహలు నిజమైనవని..
4377. నే కదులుతున్నా_కాలంగా నన్ను కట్టుకున్నాక..
4378. ఎదురుచూసినప్పుడే అనుకున్నా_చినుకుగానైనా నాపై కురుస్తావని..
4379. వెదురుపొదల్లో అలికిడి_గాలి వేసిన ఈలల సవ్వడది..
4380. రంగుల్లో మునకలేస్తున్నా_నీ భావాలు కొత్తగా ఉన్నాయని..
4381. నీ మాటలకో అర్ధమిప్పుడు_నాలో విషాదాన్ని గుర్తించావనే..
4382. మనసు పరిమళించినప్పుడే అనుకున్నా_మల్లెపందిరి నువ్వేసుంటావని..
4383. అమావాస్య సైతం నిండు పున్నమే_నువ్ నాతో ఉన్నది నిజమైతే..
4384. ముసురేసినప్పుడే అనుకున్నా_మదిలో హరివిల్లై నువ్వొస్తావని..
4385. ఇప్పటి నా దరహాసాలు_నిన్నటి నీ పరిష్వంగంలోని వెచ్చదనాలు..
4386. పల్లవిగా నే మారిపోతా_నువ్వు చరణాలతో నన్నర్చిస్తానంటే..
4387. చూపెన్నడో మసకేసింది_కన్నీరు రెప్పల నడుమ చిక్కుబడి..
4388. అనుకోలా శివరంజనిలా నవ్వగలదని_సుస్వరాలుగా నీ పెదవుల్నిచేరి..
4389. మధురమైంది నీ వల్లనే_నా ఏకాకితనం ఏకాంతమవుతూ..
4390. ఏడోరుచి ఉందని తెలిసిందిప్పుడే_నీ ప్రేమను ఊహించినందుకే..
4391. కిలకిలమంటూ నా పెదవులు_నీ చూపులేం మాయలు చేసాయో..
4392. మేఘాలుగా కదులుతున్న భావాలు_మనసులు సిద్ధమైనప్పుడు కురవాలని..
4393. నా ఆనందాలు పలువర్ణాలు_నీ తలపును పాడుతున్నవేళ..
4394. నర్తించే భావుక నేనేగా_రచించే కలం నీదైనా..
4395. ఒక జ్ఞాపకమెప్పటికీ హేమంతమే_మంచుబొమ్మగా నన్ను ఘనీభవిస్తూ..
4396. ఆషాఢం అప్పడిగినట్టుంది...అతివల ఆనందాన్ని సొమ్ము చేసుకుందామని..
4397. హత్తుకుంది గోరింట...ఆషాడపు ఆదివారం అరచేత పండాలని..
4398. చినుకుపూలు పూశాయి..అవని సిగలోని పరిమళాన్ని పంచేందుకు..
4399. కన్నీటిలోనే ఉదయాస్తమానాలు_నీ జ్ఞాపకాలకు వేళాపాళన్నది తెలీదు..
4400. చీకటిలోకి చూడాలంటూ కన్నులు_కలలు సాక్షాత్కరిస్తాయని కాబోలు..
No comments:
Post a Comment