Thursday, 5 April 2018

5801 to 5900

5801. ప్రతిరేయీ పున్నమేనంటావు..నా మోము చూడందే పొద్దుపోదంటావు..! 
5802. శిశిరాన్ని బ్రతిమాలుకుంటున్నా..తను కదిలితే ఎదురుచూపులు ఫలిస్తాయని..
5803. ఎన్ని కళ్ళు గుచ్చుతున్నాయో..ప్రేమను నమ్మలేనంత గుడ్డిగా..
5804. విరహమై నే మిగులుతున్నా..విరజాజులు నన్నింతగా వేధిస్తుంటే..
5805. మౌనరాగాలే మన చూపులవిక..తొలివలపు మాటల్ని దాచేస్తుంటే..
5806. వసంతమిప్పుడు సుదీర్ఘం.. నీ కదలికలు వీక్షిస్తున్న నేపథ్యం..
5807. తీరాన గవ్వలు..సముద్రం ప్రేమతో మనకిచ్చిన కానుకలు..
5808. గాలివాటం మారినట్టుంది..సముద్రాన్ని సైతం అల్లల్లాడిస్తూ..
5809. అమ్మతో సమానమైంది తెలుగు..మమకారం లక్ష్యమవుతూ నా అక్షరాలందుకే..
5810. మాతృభాష తెలుగే..ఆంగ్లంపై వ్యామోహం చులకన చేసిందంతే..
5811. తెలుగు సొగసు తెలియాల్సి ఉంది..మాతృభాషపై రుచి మరగాలంటే.. 
5812. బంధీగానైనా నేనుండిపోతా..నీ ప్రేమతో నన్ను కట్టివేస్తానంటే..
5813. నిన్నల్లో దాచుకున్నా వలపులు..నిదానంగా నీకు పంచుదామని..
5814. రేపటి కవితలన్నిటా నువ్వే..మనసు మెచ్చిన భావానివైతే..
5815. అద్దంలో చూసుకో ముందైతే..కొన్ని నిరాశలు దూరమవుతాయి..
5816. ఆ ఒక్కడిలా మాట్లాడకు..నీకు నేనున్నానని నువ్వనుకుంటే..
5817. ఈనాటి నీ కలవరింతలే..రేపటి నా పులకరింతలు..
5818. విరహం ఒంటరయ్యింది..నా ఏకాంతంలో నువ్వు అడుగేయగానే..
5819. స్మృతులతోనే సావాసమిప్పుడు..ఒంటరితనం అనుభవానికొచ్చినందుకు..
5820. సంతోషాన్ని శృతి చేస్తున్నానిలా..నిన్నో అద్భుతంగా పాడుకోవాలనే..
5821. రాళ్ళు జవరాళ్ళైన భావన..జలపాతాలు తాకుతున్న చిలిపిదనానికి..
5822. నీ గారాలనే ఆలకిస్తున్నా..అనుభూతివై నన్ను మరిపిస్తున్నందుకే..
5823. ప్రతిపూటా పరిమళిస్తా..నువ్వొచ్చి ఆఘ్రాణిస్తానంటే..
5824. నిన్నామొన్నా చచ్చినవేగా..ఈరోజూ..రేపు గురించే చింతిస్తున్నా..
5825. తుమ్మెదలా నేను..పువ్వుగా నిన్ననుకొని చుట్టూ పెనవేస్తూ..
5826. రేయైనా నిద్దుర పోనీయవు..కలనైనా నిన్ను కెలకవద్దంటూ..
5827. నునుపైన చెక్కిళ్ళే నావి..కనుబాణాలను దూసి గిచ్చకలా..
5828. ఎక్కిళ్ళతో అల్లాడిపోతున్నా..నువ్వు తలపుకొచ్చి ప్రాణంపోతుంటే..
5829. పండని తాంబూలంలా నువ్వు..నోటికున్న రుచిని పోగొడుతూ..
5830. అబద్దాలకే తీపెక్కుతుంది మనసు..నిజం నిష్ఠూరంగా అనిపిస్తూ..
5831. పరిణయమన్న ప్రశ్నేముందిక..ప్రేమంతా తుడిచిపెట్టుకుపోయాక..
5832. మనసుకెంత వరమో..నచ్చినోరితో మనువైతే..
5833. కాలమాగిందనుకున్నా..నా మనసు రాయిగా మారిందని గమనించక..
5834. కధిప్పుడే మొదలయ్యేట్టుంది..నా కలలో వద్దన్నా నువ్వొస్తుంటే..
5835. మాట గానమయ్యంది..మౌనానికి స్వరమందించగానే..
5836. సంతోషం సగమయ్యింది..జీవితాస్వాదన కరువైనందుకే..
5837. నా అధరాలెప్పుడూ మధురాలే..నీ పేరుతో జతకట్టాయందుకే..
5838. నువ్వుంటే వేరే హారాలెందుకు..విశేషమై నీ చనువుండగా..
5839. సమస్యగా మిగిలున్నాను..నమ్మకం నిలబెట్టలేకనే..
5840.నా నవ్వులు పూమాలలే..నీ గుండెపై దండగా ఒదిగిపోయాక..
5841. ఎటుచూసినా మౌనం..కొన్ని రాగాలను నేర్పాలని వచ్చానిప్పుడు..
5842. ఎన్ని రంగులని పులిమేస్తావో..నన్ను నన్నుగా గుర్తుపట్టనివ్వనంటూ..
5843. నా వలపు నేసిన నక్షత్రాలు..రాతిరి నీ కన్నుల్లోని కలలు..
5844. ప్రేమపాఠం నేర్పమన్నప్పుడే అనుకున్నా..నాకో కలల యాతనిస్తావని..
5845. నిద్దుర కరువవుతోందిప్పుడు..మేల్కొల్పుకు ఆలశ్యమవుతానేమోనని..
5846. అద్దానిదే అతిశయం..నా అందాన్ని ప్రతికోణంలోనూ చూపిస్తోందని..
5847. అనుబంధమవుతూ అద్దం..నాలో నిన్ను చూపి దగ్గరవుతూ..
5848. హోలికాపునమ్మని స్మరించినందుకేమో..నీ కలలకంతులేని రంగులు..
5849. కలస్వనమూ కూజితమై వినబడింది..ప్రేమైక బృందావనములో..
5850. నీలిమేఘం గుర్తుకొచ్చినందుకేమో..మెరుపులు దాచుకుంటూ నా కన్నులు..
5851. ప్రేమక్కడ పరవశించింది..ఆనందాలు రాధామాధవులవగానే..
5852. అంబరమూ అందేట్టే ఉంది..నీ ఆనందం అతిశయించినందుకు..
5853. నా కనులిప్పుడు వెన్నెల సోనలు..రాతిరి రాగాలు గుర్తుకొచ్చి..
5854. ప్రతిరోజూ రంగేళీనే..పూటకో ఊహను మనసు హత్తుకుంటుంటే..
5855. ముప్పులన్నీ చెదిరిపోయాయి..దరిదాపుల్లో నువ్వున్నావన్న ధైర్యంతోనే..
5856. అనుబంధాలు పగటికలలే..ముడి బిగియని మూడుముళ్ళ బంధంలో..
5857. అద్దమూ సిగ్గుపడింది..నీ అందంలోని ఆంతర్యాన్ని చూసి..
5858. అలుగక తప్పదుగా ప్రతిసారీ..ఆనందపు విలువేమో తెలియాలంటే..
5859. కొన్ని వ్యధలు అనంతసాగరాలే..లోతు తెలీనంతగా ముంచేస్తూ..
5860. కన్నులకెంతిష్టమో..ఏ రూపంగా నువ్వు కలలోకొచ్చినా..
5861. అవునని ఒప్పుకుంటున్నా..కాదని కొట్టేయలేకనే..
5862. చింత తీరిందనుకుంటా..నా కవితలన్నిటా నువ్వు కొలువుంటానంటే..
5863. కాలమాగి మరీ చూస్తుంది..నీ ముచ్చట్లకేం మత్తు పూస్తావోనని..
5864. మానవత్వమొక్కటి చాలు..స్పందించే హృదయమున్నట్టే..
5865. చిరుదివ్వెనైనా చాలనుకున్నా..నీలో వెలుతురు నాలా మెరుస్తుందంటే..
5866. నిరంతర వేదనలో బంధాలు..అనురాగం ముక్కలై ఎడారవుతుంటే..
5867. ఆనందమదో రకం..నువ్వున్నప్పుడు రెట్టింపై..లేనప్పుడు మృగ్యమై..
5868. మరువమై పరిమళిస్తూ మది..నిన్నే ఊహిస్తోంది మరి...
5869. గుండె కరిగి నీరయ్యింది..కంటికి ప్రవహించక తప్పలేదందుకే..
5870. వెన్నెలంటే నువ్వే..చీకటంటే నేను భయపడతానని తెలిసేగా..
5871. మురిపాలు మనవైన చిలిపికథ..ముద్దరేసి మదినూపింది కదా..
5872. కలలకంతం లేదక్కడ..ఊహకి ప్రాణమొచ్చి రేయంతా అలరిస్తుంటే..
5873. చూపుల వలేసినందుకేమో..మనసుకి చిక్కింది అరుదైన మురిపెం..
5874. అనుభూతులు ఆరువేలు..నువ్వొక్కసారిటు చూపు విసిరితే..
5875. అక్షరాలలా కలిసొచ్చాయి..నిన్ను రాయాలని కలంపట్టగానే నేను..
5876. అందినట్టే ఉంది ఆకాశం..చందమామవై పక్కనే నడయాడుతుంటే..
5877. జీవితం సమమయ్యిందిప్పుడు..బాధకు వీడ్కోలిచ్చి ఆనందం మొదలవ్వగానే..
5878. ఊహల గుసగుసలు..నీ ధ్యాసలోనే ఉండిపొమ్మని కలవరింతలు..
5879. నీ కలలతో నేను..కలతలకు దూరంగా నేడు..
5880. ప్రేమెన్నడో దూరమయ్యింది..జ్ఞాపకమొక్కటీ మిగిలిపోయిందందుకే..
5881. గుండెను పెకిలిస్తారెందుకో కొందరు..జాలి చూపాలనే ముందుకెళ్ళినా..
5882. చెలిమికి చుట్టాన్నే..చేమంతినని చేయందిస్తే..
5883. ఊహయిందో కల..ఒక ఉదయం రెప్పలు విడగానే..
5884. ఆనందం విశాలమైంది..అందిన ఆకాశం నీలా నా పక్కనుంటే..
5885. అద్దానికి అతిశయమయింది..నీ అందాన్ని తనలో దాచుకుందని..
5886. ఎంతానందమో నాకు..అద్దం నన్ను నీలా చూపినప్పుడల్లా..
5887. ఆకాశం అబ్బురమనుకున్నా..నీలా నాకు అందనన్నాళ్ళూ..
5888. అపురూపమే భావం..అనుభూతయ్యావందుకే మరి..
5889. పరిమళించు క్షణాలలో మనం..ప్రతి జన్మకిలాగే కలిసుందాం..
5890. మధువనమే మనసు..తలపునైనా నువ్వుంటే..
5891. మైమరపునే నేను..మోహనంలో వర్ణించాక..
5892. ఊసుల ఊయలలో ప్రతినిత్యం..బంధం నిలవాలిలా కలకాలం..
5893. ప్రేయసి కరిగిపోతుంది..ప్రేమతో కౌగిలించినందుకే..
5894. మనసు నవ్వుకుంది..కల నిజమయ్యే సూచనలు వేకువందిస్తుంటే..
5895. పదిలంగా దాచుకున్నా గుండెని..నీ వలపంతటా నిండుందని..
5896. మధుర సంగీతంగా మారిపోలేనా..నువ్విష్టంగా ఆలపిస్తా నన్నంటే..
5897. ఆనందపు రసగుళికలే..నన్నలరించే నీ ముద్దు మాటలు..
5898. మనసు కోరిన మమత..నీలా నాకందిన అదృష్టమే..
5899. మనసు కబురు తీయన..నీ ఊసులనేగా ఆలకిస్తున్నది..
5900. విషాదాన్ని మోసేదేముందిప్పుడు..విరహానికి అలవాటుపడ్డాక..

No comments:

Post a Comment