Thursday, 5 April 2018

5701 to 5800

5701. రంగులరాట్నంలా జీవితం..ఊగినంతసేపన్నా ఆస్వాదించమని..
5702. శిశిరమని మరచిపోతున్నా..నీ తలపుల్లో ముద్దయిపోతూ ప్రతిసారీ..
5703. వలపు మరకలు తుడవాలని లేదిప్పుడు..నీ తొలికవిత నా పేరైనందుకు..
5704. పట్నపు గాలి సోకినందుకేమో..పల్లె వాసన పడట్లేదిప్పుడు..
5705. విరియాలనుంది మనసంతా..పరిమళించమని నువ్వడుగుతుంటే..
5706. జీవితాన్ని గెలవాలనుకున్నా..మరణాన్ని జయించి..
5707. కొన్ని స్మృతులెప్పుడూ తీయనివే..మనసు నుండీ పంపలేమందుకే..
5708. స్మృతులతోనే నే కలిసుంటున్నా..మాట కలపలేనని నువ్వనుకున్నాక..
5709. నిద్దుర నటిస్తూ నేనున్నా..నీ మనసప్పుడైనా బైటపడుతుందని..
5710. విన్నపాలతోనే నువ్వెప్పుడూ..విపరీతాన్ని నాకంటగడుతూ..
5711. నా మనసుకెప్పుడూ స్వార్ధమదే..నీ అనురాగాలన్నీ నాకంకితమవ్వాలని..
5712. భావాలతోనే బంధమెప్పుడూ..అక్షరాలు ఆశువుగా కలిసొస్తుంటే..
5713. ద్వేషమెప్పుడో కదిలిపోయింది..ప్రేమను మదిలోకి ఆహ్వానించగానే
5714. అతని కౌగిలి దుప్పటి కప్పుకున్నందుకేమో..చలి చెంతకే రానంది..
5715. ఆ మనసులెప్పుడూ దూరమే..కలిపుంచేందుకో కారణం కావాలి..
5716. మాటలెన్ని ముద్రించాలో..నీ మౌనాన్ని కావ్యంగా రచించాలంటే..
5717. ఈ ఆరాధనిప్పటిది కాదులే..నీ ఊహలకు దాసోహమైనప్పటిదే..
5718. ఆనందానికి హద్దేముంది..ఆకాశమే కొలమానం కాలేనంటుంటే..
5719. పరువాలన్నీ పదాలయ్యాయి..నీ కవితల్లో చేరి తరించాలనుకొని..
5720. జ్ఞాపకాన్ని కృతిగా పాడుకున్నా..ఆనందాన్ని ఆస్వాదించాలనే అనుభూతిలో..
5721. వలసపోయిన ఆమని తిరిగొచ్చినట్లుంది..నీ నవ్వులన్నీ నాకోసమనుకుంటే.
5722. నేనో జ్వాలాతోరణం..నా చూపులు కార్తీకదీపాలని గుర్తిస్తే..
5723. రహస్యమై మిగిలిపోలేదందుకే..నీ ఊహగా నన్ను రాసుకుంటావని..
5724. హరివిల్లుకి అన్నవేమో నువ్వు..రంగులన్నిటా నన్నే నింపేస్తూ..
5725. జాబిలి జతగా నేనుండిపోతా..రేపోనాడు నన్ననునయిస్తావనే ఆశతో..
5726. నీ తలపులోనే తీర్చేసుకున్నా..మునుపు తీరని తపనంతా..
5727. మిగిలున్నా..వేకువకు విషాదమై విరహాన్ని మోయలేని సాలభంజికనై
5728. శూన్యాన్ని తిట్టుకోకుండా ఉండలేకున్నా..నీ వెలితి తీరేదెలాగని..
5729. ఆణిముత్యమే నువ్వు..అందమైన కళలన్నీ నీలోనే దాచుకొని..
5730. గుప్పెడునవ్వులు గుర్తొచ్చినందుకేమో..గల్లంతైన గుండె తిరిగి ఆడుతున్నట్లుంది..
5731. తన భావమే నాకపురూపం..నా ఆనందమతని అనుభూతి..
5732. వలపుకిన్ని రంగులేంటో..నిన్న లేని అందాలెన్నో నాలో నేడు..
5733. మనసు పులకింతలేంటో కొత్తగా..సొగసు చేసిన మాయకేమో..
5734. సౌందర్యమంటే అదేగా..నీ చిరునవ్వులు నా కన్నులో..
5735. ఉషస్సు తిరిగొస్తుందిగా..నిశీధిని ఒంటరిగా రాతిరికే ఒదిలేస్తూ..
5736. మౌనం అంగీకారమే..ఎవరవునన్నా..కాదన్నా..
5737. కాలవలవుతూ కన్నీరు..కంటిపాపల కాటుకను సైతం చెరిపేస్తూ..
5738. ఆకుచాటు పువ్వును నేను..దొంగచాటుగా పరిమళాలు పంచుతూ..
5739. రాతిరైతే చుక్కల చీర..చీకటికన్య ప్రత్యేకతను చాటుకుంటూ..
5740. నువ్వంటే అద్దమే..నా రూపాన్నలా చూసుకోనీ మరి..
5741. పెనువిషాదం సహజమే..నీవు లేని నేనున్న విరహానికి..
5742. నిత్యమల్లెలే నీ పూజకు..నా ఆరాధన నీకందాలనుకున్నందుకు..
5743. కన్నుల్లో ముత్యాలకు ఖర్చులేదట..కాలువలై ప్రవహిస్తోందందుకే కన్నీరు..
5744. పరిమళిస్తున్న గాలినడగాలి..నిన్నెప్పుడు తాకి తానొచ్చిందోనని..
5745. కలలో తీర్చుకుంటున్నా చిన్ని ఆశలు..మనసు దాటి నువ్వొచ్చేసావని..
5746. అలిగి అలిగి అలసిపోతున్నా..బుగ్గల్లో గులాబీలు బాగున్నాయన్నావని..
5747. ఎన్ని కవితలని రాయాలో..ఏ ఒక్కటీ నువ్వు అన్వయించుకోకుంటే..
5748. కలగానైనా మిగలాలనుకున్నా..నీ కథలో చోటివ్వనన్నావని..
5749. కడలి ప్రయాణం తప్పదు..గమ్యం ఆవలితీరానున్నప్పుడు..
5750. రహస్యాలన్నీ బట్టబయలే..కన్నీటికి మనసు దాచుకోవడం తెలీనందుకు..
5751. పదాలన్నీ పాడేసుకున్నా..అతని ప్రేమకు పాటతో నీరాజనమివ్వాలని...
5752. వేదనందుకే కరిగింది..కాస్త కన్నీరు మనసుని కడిగేయగానే..
5753. చరణమై కదలాలనుకున్నా_నీ పాటలో పల్లవి పెనవేసినందుకే..
5754. నెమలి ఫించమై నా దేహం..నీ హృదయం ముసిరేసిందని వినగానే..
5755. కన్నీరెంత ఖర్చయ్యిందో..నీలో చిరునవ్వులు పూయించాలనే ఆరాటంలో..
5756. తన అలుకైతే తీరనేలేదు..ఇక్కడి మాటలెంత అనునయించినా..
5757. మనసంటిన పరిమళాలు కొన్నే..నీ తలపులు మల్లెపూల సమానమవుతూ
5758. పగటికలలు ఒదలనంటూ నేడు..రాత్రైతే నిదురను తరిమేస్తూ..
5759. అపురూపమంటే నువ్వే..వెలుగులు నింపుతున్నవి నీ ఊహలైతే..
5760. మనసెప్పుడు సమన్వయం చేసిందో..చూపులు సంధిస్తున్నాయి సొగసునిప్పుడు..
5761. జ్ఞాపకాల ఆకలవుతోందిప్పుడు..నేనొంటరినని గుర్తొచ్చినప్పుడు..
5762. ఓ కలను రాయాలనుకున్నా..నీలా కలిసొస్తుందని తెలీక..
5763. ఎన్ని తపనలు దాచుకున్నానో..నీ దాకా చేర్చడమెందుకని..
5764. శిశిరాన్ని గుర్తుచేస్తావెందుకో..అసలే విరహంలో నేనుంటే..
5765. ఆమడదూరముంటేనేం..అరక్షణమైన తలపును మీటకుండా వదలవుగా..
5766.  మంచులో తడిచినట్టు మనసు..నీ పలకరింపు కలలోనిదైనా..
5767. కన్నీరు ఎర్రనవుతుంది..మనసు పరుగుతీస్తున్న ప్రవాహ వేగానికి..
5768. పువ్వులా నేనెప్పుడో మారిపోయా..పరిమళాస్వాదన నీకు పంచాలని..
5769. ఉప్పనైతేనేమి కన్నీరు..మదిలోని విషాదాన్ని నిశ్శబ్దంగా తరిమేస్తుందిగా..
5770. అనుగ్రహమంటే నీకేగా..సంతసాలన్నీ సందిట్లోకొచ్చిపడుతున్నాక..
5771. మొదలెట్టినప్పుడనుకోలేదు..ముగింపింత త్వరగా వచ్చేస్తుందని..
5772. తలపుల మహత్తిప్పుడే తెలిసింది..నీ తన్మయత్వంలో మునిగినందుకేమో..
5773. రాక తప్పలేదు వసంతానికి..కబురివ్వక శిశిరం కదలిపోయినా..
5774. నువ్వు నవ్విన ముత్యాలు నాలుగైతేనేమి..నా మనసైతే మెరిసిందిగా..
5775. సంసారపు కచేరీ సంపూర్ణమయ్యింది..సంగమ స్వరాలు సంగీతమయ్యాక..
5776. కలలెందుకు విచ్ఛిన్నమయ్యాయో..రేయైతే భయమేస్తోందిప్పుడు..
5777. మనసో మధుఫలాల తోట..పరిమళాల తీపి ప్రవహిస్తోందందుకే..
5778. ఏకాంతాన్ని ప్రేమిస్తుంటానందుకే..స్మృతుల సరిగలమనాలకించాలనే..
5779. దండలో దారంలా నువ్వు..పరిమళించేందుకు దారి వెతకడమెందుకో..
5780. నా పాటల పంచామృతమది..నెమరేసిన ప్రతిసారీ తీపినద్దుతుంటుంది..
5781. ప్రతీదినం దివ్యమే..గతాన్ని నెమరేసుకోకుంటే..
5782. అభిమానమెన్నడు గెలవాలో..అపార్ధాలు నిలయమైన ఇరుకు మనసుల్లో..
5783. కమలం నవ్వుకుందట..తన అందాన్ని పోల్చుకుంటూ ప్రేమించేవారిని చూసి..
5784. నీ కవనమంతా నేనేగా..నా హృదయాన్ని రాసిచ్చినందుకు..
5785. నా మనసొక బిలమే..తరచి చూచినప్పుడల్లా శూన్యముగా..
5786. వెన్నెల పూర్ణమైందట..కలువనూ జాబిల్లినీ కలిపినందుకు..
5787. జయించక తప్పలేదు జీవితాన్ని..అలలతో పోల్చుకొని ఎదురీదినందుకు..
5788. ప్రతిరేయీ పున్నమి కావాలనిపిస్తుంది..నీ కన్నులపండుగ నాకింపవుతుంటే..
5789. విధిని వెక్కిరించడం మానేయాలందుకే..జీవిత నాటకంలో రాణించాలంటే..
5790. కన్నీటిని రప్పించుకున్నా..ఆ కాస్త దురదని కడిగేసుకునేందుకే..
5791. ఎన్ని తపనలు నావైతేనేమి..నిన్నొక్కటీ కదిలించకపోయాక..
5792. కలవరమే మదికి..నువ్వు పిలిచినట్లనిపిస్తే సరి..
5793. దగ్గరకొస్తూ నువ్వు..గుండెచప్పుడు రెట్టింపవుతుందన్నా వినవు..
5794. వీడక తప్పదు తనువు..ఊపిరాగిన క్షణాల సంధి..
5795. మరువలేనివా స్మృతులు..నన్ను బాల్యానికి చేర్చే నెమలీకలు..
5796. నా భావమైతే ఒక్కటే..నిన్ననంతంలో  ముంచిన భాష్యాలుగా..
5797. కెరటమై నేనొస్తున్నా..చిలిపి అల్లరితో నిన్ను ముంచెత్తాలని..
5798. బంగారమని బుగ్గలూరిస్తావు..నీ లాలసతో నన్ను వెలిగిస్తావు..
5799. పరవశమే నేనెప్పుడూ నీ పదాలకి..శృతి చేసిన వీణనైనట్టుగా..
5800. ఊసులాడుతూనే ఉంటా మదిలో..నాలో ఊపిరయ్యావనే ఉల్లాసంలో..
Virus-free. www.avast.com

No comments:

Post a Comment