Thursday, 5 April 2018

5201 to 5300

5201. మౌనాన్ని సాగనంపాలిప్పుడు..అక్షరాల సందడితో మనసు మొగ్గలేస్తుంటే..
5202. ఆలాపనగా మారానందుకే..నువ్వు పాడుతున్నది నా పాటేనని..
5203. స్నేహం పరుగు తీస్తుంది..మౌనం మాటల్లోకి అనువదించబడ్డాక..
5204. మాటలతో స్నేహం కలిసింది..మౌనాన్ని మంత్రమేసి మరిపిస్తూ..
5205. మౌనానికెన్ని వంకలో..మనసు బాలేదని సమాధానమవుతూ..
5206. గతాన్ని రాస్తూ కూర్చుంటున్నా..కాలం కదిలిపోయినా కలం మిగిలుందనే..
5207. మౌనంలో మునుగుతావెందుకు..వేణువై నీ వీనుల్లో వినబడుతున్నా..
5208. వశమైనప్పుడు గుర్తొచ్చింది..నన్ను నీకిచ్చి చాలా కాలమయ్యిందని..
5209. మది గదిలో మనమిద్దరమే..మూడో పరవశముగా కవిత్వముందంతే..
5210. ఇచ్చూరుకున్నా మనసు..పుచ్చుకోడానికి బిడియం అడ్డొస్తుంటే..
5211. తీపెక్కువైన పూతరేకులా నీవు..వద్దనలేని మోమాటంలో నన్నుంచుతూ..
5212. ఆంతర్యాన్ని గెలవాలనుకున్నా..అపార్ధాన్ని తుడిచిపెడుతూ..
5213. తాళమెటు తప్పానో..శృతిలోనే ఉన్నాననుకొని ఆలాపన సాగదీస్తూ..
5214. కాశ్మీరంలో కరిగిపోవాలనుంది..పాతకథలేవీ నువ్వు గుర్తుచేయకుంటే..
5215. నిశ్శబ్దానికో కదలికొచ్చిందిప్పుడు..నీ రాకతో స్వరాల సందడి మొదలై..
5216. యుగాలు క్షణాలుగా మారిపోవూ..నిన్ను కలిసిన ఆనందాన్ని దాచుకుంటూ
5217. ముద్దుల్లో నీ జ్ఞాపకాలు దాచుకున్నా..గుట్టుగా గిలిగింతలిస్తాయనే..
5218. కురులకెప్పుడూ వివశత్వమే..పువ్వుల్లో పరిమళం తమకంటుతుంటే..
5219. ఏమవుతున్నానో తెలీదు..నీ తలపుల్లో తప్పిపోతూ ప్రతిరోజూ నేను..
5220. మధుపవనాలే మనసంతా..నీ ఊపిరికి నేనూతమయ్యానని వినగానే..
5221. దాహం తీరిందట కురులకిప్పుడు..విరుల మకరందాన్ని గ్రోలినందుకే.
5222. విచిత్రాలేగా అన్నీ ఇక్కడ..గుండేడిస్తే కన్ను బయటపడినట్టు..
5223. పూడ్చలేకున్నా గతాన్ని..చచ్చిన నిన్నల్లోనే ఊపిర్లు నిలుపుకుంటూ..
5224. నువ్వన్నది నిజమే..నీ తలపులే నాకు జీవనాధారం..
5225. మనసు దారి మరచింది..ఎంత వెతికినా స్వప్నంలో నువ్వు కనబడలేదని..
5226. ఉస్సురు తీయకుంటే చాలనుకున్నా..ఊపిరాగే మాటలతో నువ్వుంటుంటే..
5227. నా ప్రాణమిప్పుడే తిరిగొచ్చింది..చేతులు కలిపేందుకు చెంతకు నువ్వు రాగానే..
5228. మనసుకెందుకు పొగ పెడతారో..మన చెలిమిని చీల్చాలని చూసేవారు..
5229. కన్నులకిప్పుడు పండుగలే..అడగని వరంగా నువ్వు అడుగేయగానే..
5230. నీ కలలన్నిటా నేనేగా..నిద్రంటూ నువ్వు పోవాలేగానీ..
5231. నీ నీడగా నే మారిపోయా..ఒంటరితనం భరించలేనన్నావనే..
5232. రాత్రవడం గుర్తించలేదు..కురుస్తున్న వర్షంలో జ్ఞాపకాలను ఏరుకుంటూ..
5233. వెన్నెల పూసినట్టు నీ నవ్వు..శరత్తంటే నాకు మక్కువన్నాననేగా..
5234. ఊపిరి పీల్చుకున్నానిప్పుడే..మట్టివాసనతో వసంతమొచ్చి పిలవగానే..
5235. నీలాల నింగిలో ఏముంది తమాషా..తారలన్నీ తళుక్కుమంటుంది ఏక్తారలోనైతే..
5236. ఎంత వర్షాన్ని కుమ్మరిస్తుందో ఆకాశం..కాస్త పులకరింతను కోరగానే..
5237. నక్షత్రాలన్నీ నా చుట్టూనే..జాబిలి నేననుకున్నాయేమో..
5238. జన్మజన్మలకీ జత నువ్వే కావాలనుకున్నా..నేనంటూ పుట్టాలే కానీ..
5239. జీవితం గతి తప్పదిక..గమ్యం ఎదురై ఊరిస్తున్నాక..
5240. ఈ జన్మకిది చాలనుకున్నా..నీతో అనుబంధం చిక్కపడగానే..
5241. సర్వం సుశాంతం..నా మనసు తప్పిపోయింది నీదగ్గరేగా..
5242. మనసు ముక్కలయ్యింది నాదే..నీకిచ్చినా తిరిగి రానందుకు..
5243. సంగీతమంటే గుర్తొచ్చింది..సరిగమనగా నన్ననుసరిస్తుంది నీ మనసేగా..
5244. మన కథనే రాస్తున్నా..నిన్నటి కల నిజమయ్యిందనే..
5245. ఈ ప్రబంధమేదో వింతగా ఉంది..నన్ను నాకు కొత్తగా పరిచయిస్తూ..
5246. కన్నీరంతే..ఆవేదన కడగాలనుకుంటూ మనసంతా వెతుక్కుంటుంది..
5247. నవ్వుతూ నేను..నిన్నటి ఆవేదనను గతానికి నెట్టేసినందుకు..
5248. అనుభవాలను అక్షరీకరిస్తున్నా..అనుభూతులు మరపురానివనే..
5249. మనసుపెట్టి వినాల్సిందే..నీ అనురాగంతో నే శృతి కలపాలంటే..
5250. మనసు రాయి చేసుకున్నా..శిల్పమైతే తప్ప పూజించనన్నావని..
5251. చినుకుగానే మొదలయ్యింది వలపు..తేనెజల్లుల్లో నన్నిప్పుడు ముంచేస్తూ..
5252. వేకువలో కలగంటున్నా..రాత్రి నిద్దుర కరువవుతుందని..
5253. తడిచింది తనువేననుకున్నా..మనసు ఆరక ఆరళ్ళు పెట్టేంతవరకూ..
5254. మౌనం నవ్వింది..మనసులో మాటలన్నీ తనకిచ్చి దాచమంటుంటే..
5255. చీకటెంత వెలిగిందో..జాబిలిని కదలనీక తెల్లార్లూ..
5256. మనసు పొరలు మొగలిరేకులయ్యాయి..ఆనందాలిచ్చి
నా ఒరుసుకుంటూ..
5257. మేఘసందేశం అందింది ఇన్నాళ్ళకి..ఆ మురళి రాగాలు నాకని తెలిసాక..
5258. తడవాలనుకోలేదు సూరీడు..మబ్బుల నిచ్చెనెక్కి దాగాడందుకే..
5259. మౌనన్ని చెరిపింది నీ చెలిమి..కొన్ని మాటలతో మదికి సాంత్వనిచ్చి..
5260. ఊపిరందించిన వసంతానివి నువ్వు..శిశిరాల ఊసుతో పన్లేదిప్పుడు..
5261. భావాల కొరతలేదా మనసుకి..కల్వమే కలమై రాస్తున్నదందుకే ..
5262. నిశ్శబ్దమే ఆ స్వరం..మాట మౌనవించిన మనసు గీతం
5263. పన్నీటికీ పరిమళమబ్బింది..నీ మేనిలో సోయగాన్ని పూసుకొని..
5264. పలుకులన్నిటా తేనెల విందే..తీపంటే నాకిష్టమన్నానని కాబోలు..
5265. చల్లబడ్డా నేను..వెన్నెల్లో మల్లెల్ని నీతో ఊహించగానే..
5266. ప్రణయమిప్పుడు ప్రబంధమయ్యింది..కవనంలో చోటిచ్చినందుకే..
5267. కలలోనూ కదంబమాలవే..కళ్యాణిరాగంలా కట్టేస్తూ..
5268. కలలోనూ వీడని జాబిలివే..పున్నమివి కానంటే నేనొప్పుకోనుగా..
5269. ప్రళయమంటే ఎప్పుడో వస్తుందనుకున్నా..నీ వియోగమేనని తెలీక..
5270. రోజుకో పల్లవితో నేను..నీ అనురాగంలోనైనా ఇముడ్చుకుంటావనే..
5271. కవనపు పువ్వులు పూయాలిక..అక్షరాల సేద్యం మొదలెట్టావంటే..
5272. చూపుల చర్చలు ముగిసాయి..పెదవుల పదనిసలు మొదలవ్వాలిక..
5273. వసంతమూ వేధిస్తుందని తెలీదు..అనురాగాన్ని పాడనివ్వకుండా అడ్డుపడుతూ..
5274. చూపు మసకేసిందప్పుడే..సుదూరాలలో నువ్వు కనుమరుగైనప్పుడే..
5275. పెదవే మధువయ్యింది ప్రణయంలో..మనసో చిలుకయ్యింది మధురిమలో..
5276. ప్రతీకారం తథ్యమే..మనసుని హత్యంటూ చేస్తే..
5277. ఆ మనసులోకి తొంగిచూడాలి..మనిషిని గెలవాలని నిర్ణయించాక..
5278. తానో వసంతుడే..నా మనసంతా పచ్చదనంతో శాంతించిందంటే..
5279. ఉదయానికంతా మిగులుతున్నవి సిగ్గులే..రాతిరి విశేషాన్ని తలచేకొద్దీ..
5280. కవితలన్నీ నిజమే..కలలన్నీ కూర్చి కదంబముగా మలుస్తున్నాగా..
5281. వికసించిన పూల రొద..పరిమళించి ఆకట్టేందుకేగా సదా..
5282. ఈరోజు కథగా మిగిలిపోతున్నా..రేపటి వ్యథగా తలవొద్దనే..
5283. మౌనంతో మెలిపెడతావే..మోహమంటూ ముందుకొస్తే.
5284. చదివేసా నీ మనోకామన..నా పదనిసనే ఉసిగొలపాలిక..
5285. పాయసం తాగినట్టుంది నిజమే..నీ మాటలు తీయగున్నందుకే..
5286. ఈ జన్మనిలా ముగించాలనుంది..తన ప్రేమను ఆస్వాదిస్తూనే..
5287. చూపులతోనే వారిస్తాడు..దగ్గరకొస్తే కల నిజమవుతుందని భయపడతాడేమో..
5288. చెమరింపును తుడిచేసుకున్నా..చెలిమి వానెప్పుడో కురవక తప్పదని..
5289. తలపులతో తరించావనుకోలా..జతలేవని రోజంతా కొట్టుకున్నా..
5290. వలపు వరదయ్యింది..వయసు వగలయ్యింది..వసంతమొచ్చిన విశేషమేమో..
5291. బుగ్గలపై ప్రేమ తుంపరలు..నీ పెదవుల మధువులంటినవేమో మరి..
5292. నేటి కలగా నేనొస్తాలే..రేపు కావ్యంగా నువ్ రాస్తానంటే..
5293. మనసు తీపెక్కినప్పుడనుకున్నా..విరహాన్ని ముగించే వేళయ్యిందని..
5294. హేమంతాన్నెందుకు వెతుకుతున్నానో..శరద్పున్నమై నువ్వెదురవుతున్నా..
5295. మాటతో సమర్ధించాలనుకున్నా..మౌనంతో గుండె రగులుతుందని తెలీక..
5296. దీపావళికెందుకంత తొందర..నువ్వడిగితే నేనే కాంతినై రానా..
5297. చావుని వరిస్తున్న చిన్నారులు..ప్రపంచాన్ని జయించలేని పిరికితనముతో..
5298. రెప్పలసడి నేనాలకించలేకున్నా..చంచలమై నీ చూపలా నర్తిస్తుంటే 
5299. నీరవమో సందేశం..నీ ధ్యాసలో నా పారవస్యానికి..
5300. క్షణానికో తలపు..నీ ఊహల వేకువ నేనవ్వాలని..

No comments:

Post a Comment