Thursday, 5 April 2018

5501 to 5600




5501. కొన్ని అక్షరాలతో మురిసిపోతున్నా..నీ భావాలలా తడుపుతుంటే..
5502. భావావేశాన్ని హత్తుకుంటున్నా..అశ్రువులెంతకీ ఆగనంటుంటే..
5503. అనాదిగా అదే ఆకలి..దేహాన్ని విశ్రమించనివ్వని దిగులది..
5504. శిశిరమంటే భయం పోయిందిప్పుడు..రాలే ఆకుల రాగాన్ని నేర్చుతున్నానుగా..
5505. జీవితపు రుచి తెలుస్తోందిప్పుడు..సముపాళ్ళలో ప్రేమను రంగరించాక..
5506. గుడి తలుపులు తెరుచుకున్నాయి..గులాబీల దండై నువ్వొచ్చావుగా..
5507. నా అందం పెరిగిందిప్పుడు..నల్లపూసలతో దృష్టి తగ్గినట్టుందిగా..
5508. రాధను కాలేని రాత్రి..కనుమూసేందుకు కారణం వేరేముందని..
5509. శూన్యమిప్పుడు వెక్కిరిస్తోంది..మదిగది ఖాళీ అయిందని నేనంటుంటే..
5510. మనసు అమృతసరస్సులో ఈదులాడినట్లుంది..నా కలలోకి నువ్వొచ్చావ్ మరి..
5511. ఒంటరి పక్షిగా నే మిగిలిపోయా..నీ జతలేని విషాదంలో నేను..
5512. ప్రణయాంబుధిలో నేను..నీ సాంగత్యాన్ని నెమరేస్తున్న కొద్దీ..
5513. గతి తప్పితేనేమి మనసు..గమ్యమై నువ్వొచ్చి చేరదీసావుగా..
5514. ఆకలి పెట్టే మంటలెన్నో..ఆత్మారాముడికి శాంతి చేయలేకుంటే..
5515. ఉలిక్కిపటినట్లనిపిస్తుంది..నీ తలపులొచ్చి నిద్రలేపుతుంటే నన్ను..
5516. చీకటి కనుమరుగయ్యింది..సూరీడొచ్చేదాకా వెన్నెల తోడవుతానంటే..
5517. రాయలేని పాటలెన్నో..గొంతులోనే మూగబోతూ..
5518. అనుబంధమేదో బలపడేట్టుంది..ప్రేమసువాసన మొదలయ్యిందిగా..
5519. మనసు బీడైనప్పుడే గమనించా..అనురాగ ప్రవాహం ఆగిపోయుంటుందని..
5520. గ్రీష్మమొచ్చినా భయం లేదిప్పుడు..ఆవేదన చల్లార్చేందుకు నువ్వొస్తావని..
5521. ఆనందానికి కొదవలేదిప్పుడు..హేమంతమై నువ్వున్నప్పుడు..
5522. పునర్జన్మెంతో బాగుంది..కొన్ని నిశ్శబ్దాలను దాటి బయటపడ్డందుకు..
5523. నవ్వులరాజువని ఒప్పుకుంటున్నా..నాలో బాధని చిటికెలో తీసేసావుగా..
5524. మాసమేదైతేనేమి..నీ మోమెప్పటికీ శరత్పున్నమికి సమానమే..
5525. నెలవంకగా నా మనసు..శుక్లపక్షం కాస్తే మిగిలినట్టు..
5526. అలికిడంతా అక్షరాలదే..మానస సంగీతం పదాలుగా కూర్చుతుంటే..
5527. నన్నెప్పుడు చదివుంటావో..నేనో చిరిగిన పుస్తకమై మిగిలున్నా..
5528. అక్షరపు  సొగసు తెలిసింది..సొబగులద్ది రాయబట్టే..
5529. మనసు కుదుటపడుతుంది..థైర్యమొక్కటీ చేరువైందనేగా..
5530. ధ్యానమనే వెలుతురులోకి నడవాలి..గతమొకటి థూపమై కరిగిపోవాలంటే..
5531. నా కలలకు దూరమయ్యావెందుకో..నిద్దరోని రాత్రుల్లో విరహించమంటూ..
5532. కలిసొచ్చింది మదిలో ఆశ..నువ్వూ నా తీరుగా ఉన్నందుకే..
5533. చేరాలనుంది నీ నవ్వుల్లో..కొన్ని ఆనందాల్లోనైనా భాగమవ్వాలని..
5534. పెదవొంపని భావాలే అన్నీ..మదిలో చెలమలై పొంగుతున్నాయి..
5535. అతని చికాకులో ఆమె..తన చిరునవ్వుని నటించాలి..
5536. పరామర్శకు రావాలనుకున్నా..ప్రశ్నార్ధకమే మనసంతా..
5537. బహు ఇష్టమది..బ్రతుకంతా తనవ్వడం..
5538. అనుభూతిని దాచుకుంటే చాలు..అక్షరం కాకున్నా అనుభవాలు..
5539. నేనైతే నిత్యసంతోషినే..తన ప్రేమారాధనలో పక్వమైనందుకు..
5540. ఆనందాన్ని అనుకరిస్తే చాలు..నెలవంక నీ పెదవులదవుతుంది..
5541. వేదికను అలంకరిస్తున్నా..నా హృదయాన నిన్ను మోయాలనే..
5542. అస్తిత్వం వెక్కిరిస్తుంది..జీవితాన్ని లాలించే నేర్పు నాకలవడలేదని..
5543. అమృతం తాగిందెప్పుడో గుర్తులేదు..కవిత్వాన్ని పాడుతుంటే మాత్రం బాగుంది..
5544. అంతమవని ఋణానుబంధం..ఎన్ని జన్మలని వేధిస్తుందో మున్ముందు...
5545. ఆనందాన్ని త్యజించిన అనుభవాలెన్నో..అనుభూతి కాలేని అశక్తతలో..
5546. ఎంతకని ఆకాశాన్ని వెలిగించాలో..చీకటే బాగుందని శూన్యమంటుంటే..
5547. అలసిపోయిందెప్పుడో మానసం..అపశృతులను పాడి మౌనాన్ని పెనవేయగానే..
5548. నీ మురిపెంలోనే నేనుంటా..నా సిగ్గులు స్వరాలయ్యేంతవరకూ..
5549. ముగిసిపోయింది వసంతం..తను కలైపోయాక..
5550. ఏకత్వమే..ఒకరికొకరం దూరమైనా.. స్మృతుల హారంలో..
5551. నీ పిలుపులో వినబడుతున్నా..అనురాగంలో నన్ను పాడినందుకే..
5552. ఆగనంటూ కన్నీరు..మనసుని చల్లారనిస్తానంటూ..
5553. హేమంతంలో నన్ను విడిచావెందుకో..శిశిరాన్ని నువ్వు పాడుకోవాలనుకుంటే..
5554. చంచలత్వమలా ముగిసింది...మౌనాన్ని చేరదీసాక..
5555. ఏకాంతంలో నీ జ్ఞాపకాలేంటో..క్షణమైనా నన్ను వీడనంటూ..
5556. ఎన్ని భావాలని కురిపిస్తావో..వెన్నలంటే మక్కువని నేననగానే..
5557. మనసులు విరుగుతున్నది నిజమే..మాటలు పలుకురాళ్ళై గుచ్చుకుంటుంటే..
5558. ఓటమన్నదెక్కడ మిగిలింది..ఇద్దరమూ సమంగా గెలిచే ఆటాడుతున్నాక..
5559. సంబంధాన్ని సశేషం చేస్తావనుకోలా..నీతో విశేషాన్ని నేనాశిస్తుంటే..
5560. కలలు కల్లలై మిగిలాయి..నీ కథలో నేనలా ముగిసిపోయాక..
5561. కలలన్నీ తరలిపోయాయి..ఎప్పటికీ నిజమయ్యే అవకాశం లేదంటూ..
5562. జీవితం కమనీయమే..కల్పనలన్నీ వాస్తవాలై వేడుకలైతే..
5563. విశేషమైన అనుబంధం మనది..బంధాలకే మేలిమైన గంధమిది..
5564. పగలందుకే కలలు..రాతిరి నిద్దుర కరువై మనసు బరువైనందుకు..
5565. చెలిమి శబ్దం నచ్చిందిప్పుడు..నిశ్శబ్దాలన్నీ కరిగిపోయాక..
5566. సముద్రంతో సమానమయ్యారు బంధువులు..ఊహించని కెరటాలుగా ముందుకొస్తూ..
5567. తూరుపునై మురిసిపోతున్నా..మంచుతెరల మాటుల్లో నిన్నూహిస్తూ..
5568. మువ్వలపై మోజయ్యిందిన్నాళ్ళకు..నీ మనసునవి గెలుచుకున్నాయని..
5569. ముద్దులసవ్వడి మరచానిప్పుడు..మువ్వల ముచ్చట్లకే పొంగిపోతూ..
5570. అనునయించి అలుసయిపోయా..నీ అలుకలకు సమయంతో పనిలేనట్టు..
5571. నడకలకెంత హొయలొచ్చిందో..నీ గానాలకు పరవశించినందుకు..
5572. చెలిమి చిరునవ్వు పనిచేసింది..నిశ్శబ్దం నీడల్లోకి నడిచిపోయింది.
5573. అలకేనది..అనునయానికని...
5574. తీర్చేది నేనే..ఆశ తనదైనా..
5575. సంతోషాన్ని వెతుక్కుందాం రా..అక్కడ ప్రకృతి పలకరిస్తున్నట్లుంది..
5576. మురిపించేందుకొచ్చేసా..ముద్దులకోసం కనిపెట్టుకునుంటావనే..
5577. చుక్కల్లో వెతుకుతున్నావెందుకో నన్ను..జాబిలంటూ జావళీలకు రమ్మంటూ..
5578. కొన్ని జ్ఞాపకాలెందుకో..కురవని మేఘాలై కదిలిపోతుంటాయి..
5579. నీ అలుకలు ఆణిముత్యాలు..మనసు దోసిలి పడతానందుకే..
5580. నా అక్షరమో అమలినం..అందుకే మనసుని ప్రతిబింబిస్తుంది..
5581. మనసు మౌనంగా తడుస్తోంది..మనమొకటై ప్రేమ గెలిచిందని..
5582. నా ఆరాధనిప్పటికీ నిజమే..ఎప్పటికీ రాధను నేననుకుంటే..
5583. కంచెగా కుదిరింది కాటుక..ఆర్తికి ఆనకట్ట అయ్యేందుకే..
5584. చిత్తాన్ని జయించాలని నేనోడిపోయా..కన్నులలా ఆగకుండా ప్రవహిస్తుంటే..
5585. పొదరిల్లు చేసేసా నా చిన్నిగుండెని..నీ సౌకర్యానికి లోటుండొద్దని..
5586. హేమంతమందుకే ఉక్కబోతలు..నీ ఊహలతో నాలో ప్రకంపనలు..
5587. తీయందనాల చెలికానివే..తీగలా సాగి మనసంతా చుట్టుకుంటూ..
5588. అలుక నేర్చింది మాటిప్పుడు..నీ అనునయానికని మౌనవిస్తూ..
5589. ప్రతిజన్మకూ నిన్నే కావాలనుకున్నా..నా శ్వాసగా మలచుకున్నానందుకే..
5590. రెప్పల మాటు జాబిలి నేనయ్యా..పున్నమి కోసమైన నీ ఎదురుచూపుల్లో..
5591. ఆరాధనుంటుంది..నిన్ను దైవంగా నిర్ణయించుకున్నాను మరి..
5592. ఆపలేనందుకే నవ్వుల్ని..నీలో జీవాన్ని నింపుతున్నాయంటుంటే..
5593. అనురాగానికో బాణీ దొరికింది..మనలోని సంగీతాన్ని స్వరపరచమంటూ..
5594. హేమంతాన్ని మరపిస్తూ నీ తలపులు..ఈ జన్మకీ వెచ్చదనం చాలనిపిస్తూ..
5595. నీ కలలో నేనింద్రధనస్సునే..ధనుర్మాసపు రంగవల్లికలకు పోటీనవుతూ..
5596. తిరోగమిస్తూ నా ఆలోచనలు..గమ్యమై నువ్వుంటావో లేదోనని..
5597. అనుక్షణం ఆనందమే..మదిలో పదిలమైన ఈ శుభసంధర్భం..
5598. నీ కళ్ళలో నేను..ప్రేమరాహిత్యాన్ని దాటాలని చూసినప్పుడల్లా..!
5599. రాలుగాయిగా మిగిలింది రాధిప్పుడు..అనురాగానికి అర్ధాలు మారినప్పుడు..
5600. అలుకలుగా ప్రవహిస్తున్న ముభావం..మనసునైతే చేర్చిందిగా స్వభావం..



No comments:

Post a Comment