Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 02201 నుండి 02300 వరకు

2201. నా ఒడిలో చేరినప్పుడే అనుకున్నా_నా ప్రపంచం నీతో కొత్తగుందని..
2202. ఎన్ని రోజులు లెక్కించాలో_నీతో ఏకాంతపు ముహూర్తం కుదరాలంటే
2203. నా మనసైతే విశాలమయ్యింది_నీ చిన్నికోరికలు తీర్చే చొరవున్నందుకు..
2204. యుగాలన్నీ లిప్తలు మారిపోవా_నీ కౌగిలిలో ఒక్కసారి కరిగిపోతే
2205. ఏకాంతంలోనే జీవితం_మౌనంగా నిన్నాస్వాదించే నా కోరికలో..
2206. కరిగిపోతున్న మౌనం_హృదయం చేజారుతుందని అనుమానమొచ్చాక..
2207. హృదయమెందుకో జారిపోయింది_బోయీలు లేని పల్లకిగా భావించుకున్నాక..
2208. అధరాలెందుకో పల్లవి మార్చాయి_నీ పాటకు భావం పెంచాలంటూ..
2209. ఆపాత మధురంగానే మిగిలిపోతా_నీ పాటలో నేను ఇమడలేదంటే
2210. స్వాతిచినుకుల మాలలెన్నో కడుతున్నా_నీ పాటలో పదాలను జతచేసి..
2211. స్వాతిశయమవుతోంది హృదయానికి_తను గెలిచింది నీ ప్రణయాన్నని..
2212. లిపిలేని భాషే నా పెదవులది_ఆనందానికి మూగసాక్షిగానైనా మిగలాలనే..
2213. పరవశమే నీ పరిమళం_గతజన్మలోని జ్ఞాపకాలను గుర్తుచేసూ..
2214. చిటపట పువ్వులే పెదవుల్లో_ఆస్వాదన నిజమైన ప్రణయంలో..
2215. నవ్వులెందుకు ఎండబెట్టవో_పూలారబోసేందుకని నేనొస్తే..
2216. జాజులు నన్నల్లుకున్నా భావన_నీ కన్నులంతగా కవ్విస్తుంటే..
2217. క్షరవెన్నెల కురిసినట్లుంది_నీ నవ్వుల్లో నేను తడిచిపోతుంటే..
2218. మనసు నిండిన భావమొకటి_నీ కవితల్లో నేనే నాయికవుతుంటే
2219. పెదవికి అందని పాటేముంది_నీ మువ్వల్లో నే లయమవుతుంటే
2220. నా నవ్వులకెన్ని కితాబులో_పెదవులనాపి కన్నులు నవ్వినందుకేమో
2221. చూపుల వలలు మాటెందుకు మరచావో_వేసింది వెన్నెల్లోనైనా..
2222. కొత్తపూల గాలి ఊసులు వింటున్నా_అచ్చం నీలా మాటాడుతుందనే..
2223. చిరునవ్వులన్నీ విరులయ్యాయి_నీ మదిని పులకరింపజేయాలనే
2224. వేవేల భావాలన్నీ నాలోనే_కదిలే మేఘాలై నిన్ను తాకుంతూ..
2225. వేరే ఆనందాన్ని కోరలేకున్నా_నీ భావాలకే మది మత్తిల్లుతుంటే
2226. అక్షయమవుతున్న భావాలు_నీ మౌనాన్ని అక్షరీకరించేకొద్దీ
2227. మరచిపోయేదైతే ప్రేమెందుకయ్యింది_నాలో అసహనాన్ని పరీక్షిస్తూ
2228. శిశిరమవుతున్న ఆనందాలు_హేమంతాన్ని మాత్రమే మది ఆదరిస్తుంటే
2229. గోరంత ఆనందమేననుకున్నా_కొండంతగా మారి నాలో నిండేవరకూ
2230. నిశ్శబ్దం మింగేసిన ఆనందమొకటి_నీ భావాలకు తోడవ్వలేక..
2231. సంతోషానికి ఒణుకెందుకో_కోరకుండానే నీ భావాలలో చోటిస్తుంటే..
2232. భరించలేని ఒంటరితనమొకటి మిగిలింది_భావాలను దాచాలని మనసంటే..
2233. తలపు తొందర పెడుతోంది_భాషకందని కన్నీరు రాయమంటూ..
2234. నిన్నటి కలలోనూ నువ్వేగా_తలచానంటే నమ్మలేనంటావెందుకో..
2235. ఎన్ని శిశిరాలు దాటాలో_మన  ప్రేమ వసంతాన్ని పండుగ చేయాలంటే..
2236. నేను కాదనుకున్న కలలు కొన్ని_నీలా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తూ..
2237. గతమో అవమానమై నిలిచింది_కన్నులకు కన్నీటిని నిత్యకృత్యం చేస్తూ
2238. ఋతువులన్నీ గ్రీష్మాలే అనిపిస్తోంది_మనసాకాశం మండిపోతుంటే..
2239. ఆశలు పెంచుకున్నా జీవితంపైనిప్పుడే_చుక్కానిగా నీవు జతయ్యావని..
2240. జీవితం ప్రవహిస్తున్న సవ్వడి_నాలో చైతన్యమై నువ్వున్నందుకే..
2241. నీ అడుగులకే మడుగులొత్తుతున్నా_నీ వెనుకెనుక నడవాలని..
2242. కన్నీరూ తీపవుతోంది_విషాదం తరలిపోయి ఆనందమొస్తుంటే
2243. ఆనందానికి లెక్కలేస్తున్నా_నిన్ను చేరువైన క్షణాలను తలచుకుంటూ..
2244. క్షణాలకెప్పుడూ సందేహాలే_తృప్తినిచ్చే ఆనందం నీలో ఉందోలేదోనని..
2245. విషాదమంటే ఏమోననుకున్నా_చెక్కిళ్ళపై చారలుగా మిగిలేవరకూ
2246. ఎర్రని చారలెందుకో కన్నుల్లో_ప్రవహించే రక్తం ప్రతిఫలిస్తుందేమో
2247. జన్మల సాంగత్యం మనదనుకున్నా_నీ గుండెచప్పుడు దూరమయ్యేవరకూ..
2248. భావాల నక్షతాలెన్నో గుండెలో_నా ప్రేమను వెలిగించేవేళ
2249. ప్రేమ కోసమెందుకో పరితాపం_ఆనందం చేరువయ్యాక కూడా..
2250. ఆనందాలపై అశ్రుగీతలు_కలం శూన్యాన్నే హత్తుకున్నాక..
2251. శూన్యమే గెలుస్తోందెప్పుడూ_మనసుకి రంగులెన్ని పులమాలని చూసినా
2252. సీతాకోకకెందుకో కలవరమయ్యింది_వాడి మనసులో మారే రంగులు చూసి..
2253. నీ కన్నుల్లో సంధ్యారాగం_నా పెదవులను ఆలపించమని పురిగొల్పుతూ..
2254. తారలను లెక్కించడం మొదలెట్టా_పట్టపగలు సైతం మెరుస్తుంటేనూ
2255. ఎన్ని మెరుపులో ఆ తేజంలో_ప్రశాంతాన్ని ప్రసరించిన కిరణాల్లో..
2256. అరుణోదయమయ్యింది ఏక్తారలో_వెలుగు కిరణాలతో కొత్త మెరుపొస్తుంటే
2257. వెలుతురు పాటొకటి వినబడుతోంది_మనసు ఊయలూగటం మొదలెట్టగానే
2258. నిన్నల్లో లేని సందడి నాలో_నీ పాటలో రహస్యం నేనయ్యాక
2259. ఎన్ని పాటలు పల్లవించాయో ఎదలో_నీ తలపులో ప్రాణం పోసుకుంటూ..
2260. నిశ్శబ్దమూ రవళిస్తోంది_నీ పాటలోని గమ్మత్తుకేనేమో..
2261. మరుగునపడ్డ నవ్వులు_నీ గతంగా మారిన నాలో..
2262. నిజమైనదే నా దరహాసం_సుషుప్తిలోని నీ స్వప్నములా..
2263. శిశిరమై వెనుదిరుగుతున్నా_చిగురాకులనే నువ్వు కోరావని..
2264. గ్రీష్మమని మరచిపోతున్నా_వసంతం సజీవమై నీలా అనుగ్రహిస్తుంటే..
2265. తలపులే రాయబారాలు_ఊహలలో ఊసులన్నీ నీకు చేరవేస్తూ..
2266. నిద్దుర కరువైన కన్నులవి_నీ వియోగంలో ఎర్రకోయిల కళ్ళను తలపిస్తూ..
2267. నీవో ప్రేమశరణార్ధి_నా మనో మందిరం ముంగిట ప్రార్ధనల్లో..
2268. వలపులన్నీ వాయులీనం_నీ తలపునే పాటకట్టి పాడుతోంటే
2269. నీవో గాలితెమ్మెరవి_సంధ్యవేళకు గగనంలో తేలించే హృదయానికి..
2270. నువ్వు మౌనవించిన మాటలే_నా పాటలో పల్లవిగా ఒదిగిపోతూ..
2271. కాలు నిలవనంటోంది_అడుగు కలిపేందుకు నువ్వు రమ్మంటుంటే..
2272. నా చనువంతా నీతోనేగా_అనుభూతులన్నీ చెరి సగమైనందుకు..
2273. ముగ్ధనై మిగిలిపోయా_నీ గానంలోని రహస్యం నేనయ్యాక..
2274. మనసు ముసురేస్తుంటే భయమేస్తోంది_కన్నులు వర్షిస్తాయనే సూచనేమోనని..
2275. నవ్వులను నాటుకున్నా పెదవులపై_సంతసమనే పువ్వులు పరిమళిస్తాయనే..
2276. ఆనందమై మెరిసింది_కన్నుల్లో కురిసిన నవ్వుల చుక్క..
2277. మది మయూరమైనప్పుడే అనుకున్నా_కన్నులు ఆనందాలు కురిపించనున్నాయని..
2278. మౌనమని భ్రమపడింది మది_నిశ్శబ్దంలో తనకు చోటివ్వలేదని..
2279. రుధిరమై రాలిన కన్నీరు_వికృతమైన చారలను చెక్కిలికిస్తూ..
2280. రెప్పలమాటునే దాగుంటాగా_హృదయంలో నా చిత్రం మసకేసినా..
2281. ఊహలు మౌనవించెనెందుకో_వలపురాగాన్ని మోసుకొస్తుంది పున్నములైతే..
2282. గంధమవుతూ నీ ఆనందం_నా అందాన్ని పరిమళింపజేస్తూ..
2283. చూపులు కధలుగా మారినందుకేగా_కలలు కవనమై మెరిసింది..
2284. కలలోనూ ఎదురుచూపులే_నీకై వెతికి అలసిన అభిసారికనైనందుకు..
2285. నా పొద్దు ముగియదు_నిన్ను తలవని ఊహల్లో..
2286. గుండె గుమ్మంలో ఆపుతావనుకోలేదు_శ్వాసలో లీనమై తరించాలనొస్తే..
2287. ముగించేసా మౌనం_నీ పలుకు వినాలనే పరవశంలో..
2288. నా కన్నుల కలభాషణలు_నీ కరాల అల్లికలో..
2289. మనసెందుకో మెలికెలు తిరిగింది_కురిసిన చినుకు ఒయ్యారానికేమో.
2290. మౌనం ముసుగేస్తావనుకోలేదు_కోరిక తీర్చలేని నా అసహాయతలో..
2291. నాలో మౌనకొకటి గెలిచింది_తన మాటకు విలువ పెంచాలనే..
2292. మదిలో మోహనగీతం_మనలో మౌనరాగం శృతి చేయగానే
2293. మౌనమే ముచ్చటయ్యింది_ప్రకృతిలో పరవశించిన నా ఆనందాలకి..
2294. వేరే మౌనాలెందుకు_మనసు పూర్తిగా రాగాలనే మరచినవేళ
2295. అలంకరించక తప్పలేదు మౌనాన్ని_నా మనసును నువ్వాలకిస్తున్నావని..
2296. రెండక్షరాలే మౌనంలో_ఇరువురినీ తలకో దిక్కుగా విసిరేస్తూ..
2297. మౌనరహస్యాలెన్నో_ఆమె రెప్పలమాటు అల్లరిలో దోబూచులాడుతూ..
2298. పెదవులు పాడే మొదటి పాట నీదే_నా మౌనానికే సరిగమలొస్తే..
2299. పువ్వై నవ్విన మౌనం_మదిలో భావాలు కన్నుల్లో పల్లవించేలా..
2300. మౌనంతో ముచ్చటించడం బాగుంది_ఏకాంతాన్ని ఆస్వాదించగలిగినందుకే

ఏక్ తారలు : 02101 నుండి 02200 వరకు

2101. ప్రాయానికెందుకో దిగులవుతోంది_నా వలపింకా నిన్ను చేరలేదని..
2102. సంధ్యారాగమై మెరిసింది నా అందం_సింధూరమద్దిన నీ ప్రేమతోనే..
2103. అందాన్నెర వేయక తప్పలేదామెకు_జానెడు పొట్ట నింపుకోవాలనుకున్నందుకు..
2104. కమనీయమేగా బాల్యం_తలచినప్పుడల్లా మనసు ప్రాయాన్ని మరచిపోతుంటే
2105. సౌందర్యమే ఆమె చిరునామా_తడియారని హృదయం తోడవ్వగా..
2106. ఊహాప్రపంచంలోనే ఆమెప్పుడూ_అందాన్ని నిరంతరం కలగంటూ..
2107. మనసుపొరల్లో అనుభూతుల వెల్లువలు_కమనీయ బంధాన్ని తడుముకోగానే
2108. విరహంలో వేగుతోంది మది_పున్నమికి అందం మరింత పరిమళిస్తుంటే
2109. హరివిల్లెందుకు సిగ్గుపడ్డదో_ఆమెలో అందమైన ప్రకృతిని కనిపెట్టి..
2110. అందాన్ని శృతి చేయక తప్పలేదు_కమనీయ భావమై నే మిగలాలనుకున్నాక..
2111. ప్రాణ సంకటమైంది అందం ఆమెకి_మానరక్షణ సైతం కరువయ్యాక..
2112. అదేపనిగా వెంటాడుతున్న తన చూపులు_అందానికతను వారసుడేమో..
2113. సౌందర్యసీమల్లోనే గాలిస్తున్నా_పారేసుకున్న నా జ్ఞాపకాలను..
20114. విషాదాశ్రువులనే తాగుతున్నా_అందం చేసిన మోసానికి బలయ్యాక..
2115. శృతి మించిన ఆంక్షలే ఆమెకెప్పుడూ_అందం సొంతమైనందుకు..
2116. మనోహరునితోనే మధురోహలన్నీ_బృందావనాలు రమ్మని పిలుస్తుంటే..
2117. యాంత్రికంగానే కొన్ని జీవితాలు_మదిలో సౌందర్యాన్ని గుర్తించలేకపోయాక..
2118. చెమటబిందువులూ ముత్యాలై మెరుస్తాయిగా_అందాన్ని వర్ణించడం చేతనైతే..
2119. లయమై వింటావనుకున్నా_వీనుల విందైన నా ఆలపనను..
2120. ఎన్ని ఆనందాలో ఆమె కన్నుల్లో_భాష్పమై మెరిసి నీకు ఎదురయ్యాయంటే..
2121. కన్నీరైతేనేమి_నువ్వు తడిమిన ప్రతిసారీ భాష్పమై మెరుస్తోందిగా..
2122. మౌనవ్రతమొక్కటే దిక్కవుతోంది_నమ్మకాన్ని నిలబెట్టుకోలేనోళ్ళందరికీ..
2123. అందాన్ని కబళించిన మృగమొకటి_తనలోని వికృతాన్ని బయటపెడుతూ..
2124. మేమెప్పుడూ ఒకరికొకరమే_వెన్నెలా చీకటిగా విడిపోయి కనిపిస్తున్నా
2125. శ్వాసను బంధిస్తావెందుకలా_నీలో ఉచ్ఛ్వాసగా చేరాలని నేనొస్తే..
2126. వలపు కల_మదిలో మెరుపు మనోహరం నీవైనట్లు..
2127. నీవు నా ప్రాణమే_అకాశమై ఒంగి నన్నే పలకరిస్తూ..
2128. అంతరంగమూ వికసించింది_అందానికి తగిన మనసు తానయ్యానని..
2129. 
 అమాస వెన్నెలవడమూ నిజమే_నీ నవ్వులలో నేనుంటే..
2130. తేనెవాకలోనే ఉండిపోవాలనుంది_నీ పలుకుల మధురాలను గ్రోలుతూ..
2131. పెదవులదే అదృష్టమేమో_నీ పేరులోని తీయదనాన్ని పలుకుతూ పదేపదే..
2132. 
 చెంగల్వలవుతూ నా చెక్కిళ్ళు_నీ మందారాలతో పోటీపడాలని..
2133. నిత్యమల్లెకెందుకో కోపమయ్యిందంట_మందారాలనే నిత్యమూ పూజకి పిలుస్తూంటే..
2134. మనసుకెందుకో మానని గాయం_మాల్లెలు తడిపిన ప్రతివేసవిలోనూ..
2135. అధరాలకెందుకో అంత ఎరుపు_కెంపులు పూసింది బుగ్గల్లోనైతే..
2136. చెలి చేమంతిలా నవ్వింది_నీ చూపుల ఎరుపులను పసిగట్టినందుకే..
2137. అలక మానలేనంటూ కన్నులు_మనసు జోలపాట పాడేందుకు సిద్ధమవుతున్నా..
2138. పున్నమిపువ్వును నేనేగా_నాకై వెన్నెల్లో వేచింది నువ్వైతే..
2139. పక్షానికోమారే వెన్నెలనుకున్నా_నీ చూపులను కనిపెట్టక మునుపు..
2140. నాకే తెలియని నాలో విరహం_నాలో జాబిలిని నువ్వు గుర్తించగానే
2141. తావినై చెంత చేరక తప్పలేదు_గులాబీవంటి నిన్నిడిచి మనలేననుకుంటే..
2142. కలలకే లోకువవుతున్న కనులు_పగలు రేయీ రమ్మని పిలిచినందుకే..
2143. నేనే ముద్దుగులాబీగా మారిపోతా_నీ మదిలో పదిలంగా దాచుకుంటానంటే
2144. ఏ కరిమబ్బు కానుకిచ్చిందో_నీ కన్నులకంత నల్లని కాటుకలు..
2145. ముత్యమంత ముద్దులెన్నో దాచుకున్నా_లెక్క తేలితే తిరిగిచ్చేద్దామని..
2146. ముసురేసినప్పుడే అనుకున్నా_నా కాటుకలకు మెరుపద్దే తరుణమిదేనని..
2147. పగలు సైతం పడుకోవాలనిపిస్తుంది_కలలో నీవే కవనమై నడిచొస్తుంటే..
2148. పూలవాన కురిసినప్పుడే అనుకున్నా_తేనెజల్లు కురిసింది నాకోసమేనని..
2149. హద్దులు చెరిపేసిన దూరాలు_మనసులో దగ్గరైన నీ తలపులతో..
2150. కొన్ని కలలంతే_హద్దులు చెరిపినట్లే చెరిపి గిరి గీసుకునుంటాయి..
2151. కాటుక కన్నులు పిలిచింది నిన్నేగా_రేయైతే నీవే రాజువని గుర్తించి..
2152. ఆనందాలకి కాటుకలు పూసే కంటకులు_నవ్వితే నేరమనుకొనే బ్రతుకులో.. 
2153. కన్నీరు సెలయేరై పొంగింది_నేత్రాంచాల్లో నిలువలేని అసహాయతలో..
2154. విరజాజుల మధువంతా నీలో కనుగొన్నా_రేయంతా పరిమళిస్తుంటే..
2155. ఆరాధన నేనై ఎదురొచ్చేసా_ప్రణయానికి పీఠేసి రమ్మని పిలిచావనే..
2156. మన ప్రణయమే ప్రబంధమవుతుందేమో_రాయడమంటూ నే మొదలెడితే..
2157. మందారమంటే ఎందుకంత మక్కువో_నీ జ్ఞాపకాలను దోచిన పువ్వనేమో..
2158. చీకటికన్యెందుకో ఫక్కుమంటుంది_రాత్రికి రాయంచని రాయబారం చేయమంటుంటే
2159. నా చెక్కిళ్ళనెప్పుడు తడిమి చూసావో_నునుపుదనమంతా నీపరమైనట్లు..
2160. ముగ్ధగా మారింది నీ చూపుతోనే_నీ ప్రేమానురాగానికి ప్రతీకగానే
2161. చిగురాకులకెందుకు మంట పెడతావో_చెలి అందాన్ని పచ్చదనంతో పోలుస్తూ
2162. అక్షరసందేశమందింది_వాయులీనమై మేఘాలనెక్కి నన్ను రమ్మంటూ..
2163. వివశమైన మదిలోనే వెచ్చదనమంతా_రేయంతా నిదురకు దూరం చేస్తూ..
2164. కోర్కెలకు కళ్ళెం వేసేసా_జీవితం కోసం పోరాడలేనంటుంటే..
2165. విరహానికీ రుచి తెలుస్తోంది_మదిలో నీ తలపులు తీయనవుతుంటే
2166. మరచిపోయే మంత్రమేదీ లేదుగా నన్ను_ఏకాంతంలో నిన్నావహిస్తుంటే..
2167. వెన్నెలలోనే కోరుకున్నా ఏకాంతం_నీ ఊసులను నెమరేసుకుందామనే..
2168. చూపులతో చిత్రిస్తున్నావుగా రూపాన్ని_మాటలతో మంత్రాలను వల్లిస్తూనే
2169. నిద్దురపొద్దులే మరచిపోతున్నా_తరలిపోతున్న జ్ఞాపకాలలో కొట్టుకుపోతూ..
2170. కవిత రాసినప్పుడు కనుగొనలేదు_అక్షరాలన్నీ నీలా మారాయని
2171. కోకిలకిచ్చా కొన్నక్షరాలు_నాలా పాడుతుందేమో చూడాలని..
2172. బృందావనిలో మధువనినే_మల్లెల మత్తు మదిలో ముద్రిస్తూ..
2173. మాయ చేయడమెప్పుడూ నీకే చెల్లింది_నా ప్రాణాలు గుప్పెట్లో బంధిస్తూ
2174. నేనే ఆమనైపోలేనా_ప్రత్యుష సౌందర్యమంటే నీ కిష్టమంటే
2175. కోయిల కన్నులు నాకరువిచ్చినందుకేమో_గాత్రం సైతం పట్టుపట్టేసా
2176. ఆమని అరుణరాగంలో చేరిపోయా_సుప్రభాతంలో నేనుండాలనే
2177. నీ చేతలన్నీ నాకొరకే అనుకున్నా_వియోగంలో నిన్ను విస్మరించానని..
2178. రేరాజుకెందుకో అన్ని వగలు_పక్షానికే రూపు సమసిపోతున్నా..
2179. రాతిహృదయంతో చెలిమి చేసినందుకేమో_ఎండమావిగనే మిగిలిపోతున్నా
2180. నీ జ్ఞాపకాలన్నీ పదిలమేలే_దాచుకున్న నా గుండె గుడయ్యాక..
2181. పెదవులెందుకెండిపోయాయో_నీ పిలుపును తడుముకోలేని నవ్వులా..
2182. ఊహలకే ఉక్కిరిబిక్కిరవుతావు_ఎదురైతే ఏమైపోతావనే దూరమైపోయా.
2183. పెదవులకెప్పుడో అదో గోలే_రాత్రైతే నిన్నే ప్రవచిస్తూ..
2184. ఏకాంతం లోలకమవుతోంది_ఆలోచనల పరంపరలో ఊగిసలాడుతూ..
2185. సమాధి కానంటున్న భావాలు కొన్ని_నీ అనుభూతులనింకా కావాలనుకుంటూ
2186. ఊహలెప్పుడూ గమ్మత్తేగా_నిజమయ్యే అదృష్టమేదీ లేకున్నా..
2187. పెదవుల్లో తేనెవాకలూరాయి_నీ కవిత చదివిన ఆనందంలోనే
2188. ఇంటిగుట్టు విప్పేస్తావెందుకో_నీ కొంగు వెనుకే నేనుంటానని చెప్పేస్తూ..
2189. గాలికబుర్లు నమ్మలేకున్నా_అక్షరాల్లో అతిశయం హెచ్చవుతుంటే..
2190. ఊపిరి మరచిన శిల్పాన్నే నేను_నీ నిర్లక్ష్యంతో శిలనయ్యాక..
2191.ఏమాదేశించావో అందాన్ని_సౌందర్యాన్ని వీడనంటూ రేయీపగలూ..
2192. నెమలీకల సొగసు తరిగినట్లుంది_తన సోయగమంతా నాకిచ్చేసాక
2193. అదుపులేని గాలికెప్పుడూ గంధాలే_నీవున్నచోటే తచ్చాడుతుంటే..
2194. వేరే పరిమళాలొద్దనుకున్నా_నీ వలపుగంధంతో మేను గుభాళిస్తుంటే
2195. నా చెక్కిటెందుకో చిరుగులాబీలు_నువ్వు తడిమింది మనసునైతే
2196. గులాబీలకూ అతిశయమయ్యిందట_నా చెక్కిళ్ళతో తమను పోల్చావని..
2197. ప్రణయాన్ని యుగళంలోకి అనువదించా_నువ్వొస్తే జంటజావళి మొదలెడదామని
2198. పెదవంచుకు గాయమవడం గమనించలేదు_నువ్వు మధుపమై కాటేసినా..
2199. అందానికెప్పుడూ అనుభూతులే_నీ రాగాలాపనలో జగాన్ని మర్చిపోతూ..
2200. రుధిరపు రుచి మారినట్లుంది_నా పెదవిదాటి నీపెదవిలోకి ప్రవహించాక..

ఏక్ తారలు : 02001 నుండి 02100 వరకు

2001. సవ్వ ళ్ళు చేయనంటూ మువ్వలు_నీ నవ్వును మించలేనని బాధపడుతూ..
2002. బంగారు క్షణాలేనవి_మురిపించే మువ్వల్లో కరిగిన మన సమయాలు..
2003. సవ్వడెక్కువే నా మువ్వలకి_అనేక తారలను ఒక్కటిగా ఓలలాడిస్తూ..
2004. మువ్వలై మోగిన అక్షరాలు_కవనవనంలో స్వేచ్ఛగా విహరిస్తూ.
2005. శబ్దం మరచిన రాతిరొకటి_నీ మువ్వలు నిదురించినందుకేమో..
2006. చిగురుటాకుల గలగలలు_చిన్నారుల నవ్వుల మువ్వల్లా సడిచేస్తూ..
2007. సిరిసిరి మువ్వలా నా మది_చిట్టి గువ్వలా నాలో నువ్వొదిగిపోతుంటే
2008. అలుకను చాటే మువ్వలు_మగువ మనసును వల్లిస్తూ..
2009. ఎదలో లయలన్నీ ప్రియమే_నీ సమక్షంలో మంజీరాలు మోగుతుంటే..c
2010. వేణువుని వలచిన మువ్వనేగా నేను_నువ్వు కోరి వలపించినందుకు..
2011. నీ చిరునవ్వుల పుప్పొడి_నా మదిలో మంజీరాలేవో పేర్చినట్లు..
2012. ఎందుకన్ని అలజడులో ఎదలో_మౌనాలకు మువ్వలు మాటవుతానంటే..
2013. భావాలకెన్ని కులుకులో_మువ్వలన్నీ తారలై వెలిగిపోతుంటే..
2014. పదనర్తనలో అందియలు_నా పల్లవికి చరణాలై కదులుతూ..
2015. పువ్వులై వికసించిన హృదయాలు_నిశ్శబ్దంలో మోగిన అందెల ఆనందంలో..
2016. మధురభావమై మిగిలాలనుంది_మంజీరముగా నన్ను మదిలో గుర్తిస్తానంటే..
2017. ఎన్ని మువ్వలు రోదించాయో_ఆమె పీడకలలన్నీ నిజమవుతుంటే
2018. సడి చేస్తున్న సంతసాలు_నా మువ్వల్లో రహస్యంగా చేరినందుకే..
2019. మువ్వలను అనుసరిస్తూ నా మది_స్వప్నంలో నీ చిరునామా దొరకలేదనే..
2020. రవళించని మౌనమే_చిధ్రం చేస్తోంది చిత్తాన్నలా..
2021. ప్రతిమనైనా వెలిగిపోతున్నా_నీ మాటలతో ప్రాణం పోసావనే..
2022. బయటకు రాని భావాలెన్నో_ఊహలకందని వాస్తవంలో..
2023. చెలియకట్ట దాటిన కన్నీరు_మనసాపలేని వేదన అధికమవుతుంటే
2024. కధలకు స్వాగతమిస్తున్నా_రాతిరి కలలను కలంలో నింపేందుకే..
2025. దూరమే జరగనంటావు_విరహన్ని రాయాలని మనసైన ప్రతిసారీ..
2026. నిదురను వలస పంపాను_మనసంతా నువ్వై నిండిపోయాక..
2027. స్మృతుల తీరాల్లోనే సంచరిస్తావెందుకో_సంతసం దూరమైందని రోదిస్తూ..
2028. నీ మౌనమే మంత్రమేసినట్లుంది_నా మాటలెందుకో మూగైపోయినట్లు..
2029. హృదయం గతి తప్పినట్లుంది_కొన్ని మౌనాలను అనుభూతించలేక..
2030. మరణించి చానాళయ్యిందా మనసు_కాలంచెల్లని జ్ఞాపకాలతో జీవిస్తూ..
2031. ఊపిరి తీసిందో క్షణం_నీలో నేనున్నది కలేనంటూ..
2032. కధలోనూ నువ్వేగా_కధానాయికగా నన్ను మెప్పిస్తూ..
2033. కొన్ని స్మృతులంతే_జ్ఞాపకాలై జ్వలించినా వెలుగునిస్తాయి..
2034. మనసాకాశమయ్యింది_తారలు పండుగ చేసుకుంటామంటే కాదనలేక..
2035. కలానికి చేరని భావాలెన్నో_హృదిలోనే సమాధైపోతూ..
2036. నా రూపాన్ని వెతుక్కుంటున్నా_ముక్కలయ్యింది నీ మనసంటుంటే..
2037. పడమటవైపు చూడ్డం మానేసాను_సంధ్యారాగానికి శృతి కాలేకపోతున్నానని..
2038. స్వరాల సందడులే అవన్నీ_మదిలోని మోహనరాగాలు..
2039. వలపు దిద్దిన మౌనాక్షరాలు_నీకై నేను జపించే మంత్రాక్షరాలు..
2040. అతివే ప్రకృతయ్యింది_కొన్ని విలయాలను తట్టుకొనే వేళ సహనం తానై..
2041. అక్షరాలదెంత అదృష్టమో_నిన్ను ఆవహించే అద్భుతం తమదైనందుకు..
2042. వసంతరాగాన్ని రాస్తున్నా_వెన్నెల హాయిని మోయాలేని ఏకాంత రాతిరిలో..
2043. నేనే శకుంతలైపోయా_నీకు ప్రేమలేఖలు రాసే ఆనందంలో మైమరచి..
2044. నీ కోసమే వెతుకుతున్నా_మాటిచ్చి మరల రాలేదేమోనని..
2045. మోహపు తీపొకటి పెరుగుతోంది_మదిలో చేదుని మరిపించాలని..
2046. ప్రేమలేఖనే విప్పలేనన్న దుష్యంతుడు_బలమైన ప్రేమ నాలో కనిపించలేదని..
2047. మాటలన్నీ మాలగా అల్లుతున్నా_ఆనందపారవశ్యాన్ని మెడలో వేద్దామని
2048. గాలితెమ్మరొకటి వీచింది_పడమటి కోయిల పల్లవిగా నువ్వు పాడగానే..
2049. నీ ప్రణయలేఖల సారాంశమే_నా దరహాసపు చిలిపి రహస్యం..
2050. చూపుల బాణాలు సోకితే చాలు_చుంబనపు తడి తెలిసేనుగా మదికి..
2051. అమృతాన్ని రంగరించా_సరిహద్దు లేని సంతసం నీకు కానుకివ్వాలని..
2052. వేణునాదం వినిపించినప్పుడే అనుకున్నా_పొంచి నన్ను ప్రేమిస్తున్నావని..
2053. సంకీర్తన నేనై బదులిస్తున్నా_సరిగమలు నీకిష్టమన్నావనే..
2054. కన్నె సోయగమే కనువిందు చేసా_నీ రెప్పల్లో దాచుకుంటావని..
2055. సౌందర్యాన్ని కానుక చేసా_నీవొస్తే అప్పచెప్పాలని..
2056. నా మనసెందుకు పులకరిస్తుందో_పరిమళిస్తుంది నీ శ్వాసలైతే..
2057. కలల రాతిరొకటి మిగిలిపోయింది_నువ్వొస్తావని ఆశగా ఎదురుచూస్తూ..
2058. సౌందర్యమంతా నా కన్నుల్లోనే_అందాలన్నీ నువ్వు దాచుకుంటుంటే..
2059. నా మనసే సాక్ష్యం_అణువణువునా నీ ప్రవాహానికి..
2060. పువ్వులెప్పటికీ పరిమళించేవేగా_నేను గుర్తించలేకున్నా..
2061. నా కనుకొలుకుల ఆనందం_నా అందాన్ని ప్రశంసించిన నీకభివందనం..
2062. ఎన్ని లావణ్యాలు విస్తుపోతేనేం_నేనే ప్రకృతిని ఆవహించిన వేళ..
2063. నీ రూపమెప్పుడూ అపురూపమేగా_ప్రతినిత్యమూ వెన్నెలనే కురిపిస్తుంటే
2064. నీ సౌందర్యంలోని రహస్యం తెలిసిపోయింది_నన్ను మక్కువతో ఆదరించినప్పుడే..
2065. మనసు చక్కదనమదేగా_కారాన్నీ తీయగా తినిపించగలదు..
2066. నీ తనువే లావణ్యమనుకున్నా_నీ మనసు అవగతమవనంతవరకూ..
2067. అక్షరాలకెందుకో అతిశయం_ఆమె అందాన్ని రాసేందుకు రమ్మంటే..
2068. సౌందర్యం సమతూకమయ్యింది_ఆమెలో మంచితనానికి పోటీ పడుతూ..
2069. నీ మమతకెన్ని గుభాళింపులో_అసూయపడక నా అందాన్ని రాస్తుంటే..
2070. అందమలా ద్విగిణీకృతమైంది_నీ ఆరాధనకు మరింతగా పులకించి..
2071. నిత్య సౌందర్యవతే ఆమె_మోముపై సదా చెరుగని చిరునవ్వుతో..
2072. మనసు ప్రాయమెప్పుడూ మూల్యమే_వయసుని దాటి పయనించినప్పుడు..
2073. నీ ఆలాపనకే నిలబడిపోయా_అందాన్నంతగా గాత్రంలో వినిపిస్తుంటే..
2074. వేరే పూజలెందుకులే_సౌందర్యాన్ని ఆరాధిస్తున్నదొక్కటి చాలదా..
2075. అక్షరాలు అందానికి దాసోహమన్నాయి_అభిమానాన్ని రాయలని నేనంటే..
2076. మువ్వలకెప్పుడూ అదృష్టమే_కోమలి పాదాల అందాన్ని పెంచే అవకాశమున్నందుకు..
2077. అందానికి వేరే గుర్తింపెందుకు_ఆమె అంతఃసౌందర్యంతో మెరుస్తుండగా..
2078. సౌందర్యానెప్పుడు కనిపెట్టావో_నేనో అప్సరాంగననని చెప్పకుండానే..
2079. ఎంతందమో ఆ నవ్వులో_ఆమని సొబగులన్నీ తనవేనన్నట్లు..
2080. ఎక్కడని వెతికేది సౌందర్యాన్ని_మెండైన నీ ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంటే..
2081. తొలి పాటప్పుడే పలికింది నాలో_ప్రకృతి అందానికి పరవశించినప్పుడే
2082. తొలివలపు పులకరింతలెన్నో_మన మనసులు పెనవేసుకున్న కమనీయతలో..
2083. కవితగా మారిన సౌందర్యమే నాది_నీ చేతిలోని కలానికి చిక్కాక..
2084. నిరోధించలేని భావాలెన్నో_నీ సౌందర్యాన్ని వర్ణించే వేళ..
2085. మనసెప్పుడూ కమనీయమే_మరో మనసును ఆదరించే చొరవ చూపిందంటే..
2086. ప్రశంసలన్నీ ప్రతిభకేననుకున్నా_అంతర్లీనమైన అందానికని గుర్తించక..
2087. కేరింత కొడుతోంది మది_నీ సౌందర్యాల చక్కదనాన్ని గుర్తించి..
2088. ఆమె అందమే ప్రబంధమయ్యింది_అక్షరాలుగా అతని చేతికందిన వేళ..
2089. ఆకర్షణలో పడ్డానని ఒప్పుకుంటున్నా_నీ అందమలా మతి పోగొడుతుంటే
2090. ఆకర్షణలో పడ్డానని ఒప్పుకుంటున్నా_నీ అందమలా మతి పోగొడుతుంటే
2091. మోహనరాగమొకటి వినబడుతోంది_నా అందాన్ని జాబిలితో పోల్చుతుంటే..
2092. సెలయేరూ సంగీతం పాడినట్లుంది_ప్రకృతి అందంలో నే మైమరచిపోతుంటే..
2093.ఆ రాగమనంతమే_నా సౌందర్యాన్ని నువ్వు పాడేవేళ నేనాలకిస్తుంటే..
2094. మేఘఘర్జనెందుకు వినబడిందో_మది పాడిన మోహన సౌందర్యాన్ని విన్నట్లుగా..
2095. మేఘఘర్జనెందుకు వినబడిందో_మది పాడిన మోహన సౌందర్యాన్ని విన్నట్లుగా..
2096. మనోహరమే అలతిపదాలైనా_లయప్రాసలను కూర్చి నువ్వు రాయకున్నా..
2097. మకరందమైన భావన_నా మనోహరుని అందాన్ని మది కలగంటుంటే..
2098. నిర్మలానందమే మనసంతా_అందం రసాత్మకమై నాలో చెలరేగుతుంటే..
2098. ఊహలన్నీ నీ పరం చేసా_నీ సౌందర్యంతో మనసు నవ్విందని..
2099. దీపాలు వెలిగించడం మర్చిపోయా_సౌందర్యంతో ఇల్లు వెలిగిందని నువ్వంటుంటే..
2100. పువ్వులబంతయ్యింది నా మోమందం_నీ వేణునాదమొకటి వినిపించగానే..