Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01401 నుండి 01500 వరకు

1401. ఏడేడు జన్మలూ తీరిపోయాయనుకున్నా_మరో ఏడింటికి సిద్ధమవుతూ ప్రేమ..
1402. కొన్ని భావాలంతే_మౌనంగానే మనసు రంజిల్లుతాయి..
1403. అభేరిని వినలేనన్నా_శ్రీరాగమై నువ్వొస్తావనే
1404. కొన్ని నెలవంకలంతే_పెదవులను చేరి హరివిల్లులవుతాయి..
1405. విరినైతే చాలనుకున్నా_ప్రతి ఉదయం గాలిలో పరిమళించొచ్చనే..
1406. నే వశమైతే చాలనుకున్నా_నాలోనూ ప్రేమ కొలువుందనే
1407. అలవాటైపోతోంది సమాజానికి_రాజకీయ మనస్తాపాలను కొమ్ముకాయడం..
1408. ఏకాంతపు వీవన వీయవూ_పులకరింతవైన నిన్ను తడుముకోవాలనుంది
1409. శ్రావణం ముసురేసుకుంది_జ్ఞాపకాలేవో ఉప్పెనలై తన్నుకొస్తుంటే..
1410. నీలా మారిపోయా నేనే_నా తలపులన్నీ నీవవుతుంటే
1411. నా చెక్కిళ్ళే మల్లెలనుకోమన్నా_కెంపులుగా మార్చాలని నువ్వనుకుంటే..
1412. కొన్ని రాయబారాలంతే_అందుకుంటే మౌనం మువ్వై మోగినట్లే..
1413. నా తనువుకెన్ని మైమరపులో_సద్దు చేయకనే నీ చూపులు శరాలు సంధిస్తుంటే
1414.ప్రతి ఊహలోనూ పున్నమే_నా తోడై నీవుంటే..

1415. నా నవ్వు_ఆయన తన్మయ హృదయానికే లోలకం..
1416. వసంతమై నేనొచ్చేసా_నీ మదిలో రంగులు నింపాలనే..
1417. వెన్నెలై మురిసిపోతున్నా_నీ లాలనతో నన్ను కరిగించావని..
1418. నిద్దుర చేరనంటున్న రాతిరి_నువ్వున్నావని సంశయిస్తూ..
1419. మరలి రానంటున్న క్షణాలు_యుగాలై ఒంటరిగా మిగిలిపోతుంటే
1420. కిరణమై వచ్చింది నీవేననుకున్నా_నాలో వెలుతురులు నిండగానే
1421. నన్నే పున్నమిగా చేసేసుకోమన్నా_అమాసనే మాటే నీకొద్దంటూ..
1422. మరోసారి తిరిగి జన్మించాలనుంది__నాకై  నీవెదురుచూపులతో నిలుస్తావంటే
1423. ఏకాంతమూ రవళిస్తోంది_నీ ఊహలు కోయిలలై పిలవగానే
1424. అక్షరాలెందుకు తడబడుతున్నవో_నీ చూపును అనువదించాలనుకున్న ప్రతిసారీ..
1425. అదే జీవితం_ఒక నవ్వు..నమ్మకం..నిరాశని వెలిగించే నక్షత్రం..
1426. కొట్టుకుపోతున్న అనుభవాలు_మిగిలిపోయిన జ్ఞాపకాలతో..
1427. మనసు కొమ్మను ఊపేస్తావెందుకలా_వియోగంలోనూ ప్రణయముతో భారమయ్యేలా..
1428. రాయాలనుకోలేదు నిన్ను_కవిత్వమై ఒదిగిపోతావేమోనని..
1429. అక్షరమై ఒదిగిపోలేనా_భావంగా కూర్చి చదువుతానంటే..
1430. కవిత్వమై కురిసింది ఆవేదన_అమాసను వెన్నెలగా మార్చేస్తూ..
1431. నిశ్శబ్దమూ రవళిస్తోంది_నిన్ను కవిత్వం చేసి పాడినందుకే
1432. మనసు పరిమళించింది_మల్లెలతో తనను పోల్చావనే
1433. కవిత్వానికి మరణం లేదు_సంజీవనిగా మనసు పుచ్చుకొనేవరకూ
1434. కవిత్వపు కమ్మదనమేగా_మనసును మాయచేసేస్తూ ఇన్నాళ్ళూ..
1435. నల్లనైతేనేమి కవిత్వం_మనసైతే నిగనిగలాడిందిగా..
1436. ఎన్ని సొబగుల కవిత్వమో_భావాల అలజడిని అల్లుకొనేవేళ
1437. అక్షరాన్ని హత్తుకోక తప్పలేదు_జీవితాన్ని రాద్దామని కూర్చున్నాక..
1438. నలుపు మాత్రమే గుర్తుంది_రంగులెన్నున్నా నా జీవితంలో..
1439. భావాల వన్నెలద్దుకున్నావేమో_నీ చూపులు ఎర్రనై నన్నంటుతూ..
1440. మేఘమొకటి జారిపోయింది_నా కన్నులు కురిసిపొమ్మని పిలవగానే
1441. పువ్వులతో నింపేసా నావనొకటి_జీవితం తేలికై సాగిపోవాలని..
1442. మమేకమేగా మనమిద్దరం_అద్వైత సత్యానికి తొలి సాక్ష్యంలా..
1443. కాలావధుల్ని చెరిపేసా_నీ రాకతో కన్నులు నవ్వుకుంటుంటే..
1444. మౌనపు పరిభాషది_లిపి తెలిసిన నయనాలకే సొంతమది..
1445. అస్తిత్వానికి ఆరాటమెందుకో_స్థిరత్వానికి పోరాడకుండా..
1446. శ్వాసించిన కొద్దీ కొత్త పరిమళాలు_నీ స్మృతులు చేసే గారాడీలు..
1447. అల్లుకొనే కొద్దీ పున్నాగులే_నీ పదబంధాలు..
1448. అమరాంగనైపోతున్నా_నీ ప్రేయసిగా నన్ను చాటినప్పుడల్లా..
1449. నీ చూపులు నక్షత్రాలే_ఎన్ని కావ్యాలైనా రాసుకోమంటూ..
1450. చిగురించిన బృందావనం_పలకరించిన మధుమాసంతోనే..
1451. ఎన్ని కాలాలు కలసిరావాలో_మనకాలం కలసి ఒకటవ్వాలంటే..
1452. ప్రవహిస్తున్న క్షణాలు కొన్ని_నీ నిరీక్షణ తమవల్ల కాదంటూ..
1453. ఒదిగిపోతున్నా ప్రతిభావంలో_నీవెంత ఆర్తిగా నన్ను రాసావోనని...
1454. అక్షరం చేసా అనుభూతిని_నీలో వెన్నెల ప్రవహించాలని..
1455. ఊహలపల్లకి నే మోయలేకున్నా_నీ భావనలు బరువెక్కిస్తుంటే
1456. వేయివేణువులూ నన్నే పాడినట్లుంది_ప్రేమ పొదరిల్లు గానం చేస్తుంటే
1457. కలగా తప్పుకుంది_నిజం కాలేని ఎదలోని భావమొకటి..
1458. ఆరని మంటే పెట్టావు_అబద్దమంటూనే నిజాన్ని చెప్పి..
1459. నీ మల్లె మనసు తెలిసింది_చల్లని సెగలకు నేను సేదతీరుతుంటే
1460. మనసిప్పుడు కుదుటపడ్డది_నీ ప్రపంచం నేనని ఒప్పుకోగానే..
1461. ఆశను హరివిల్లు చేసేస్తా_నీ కలలన్నీ నావేనంటే..
1462. తెగేదాకా లాగలేదు అనుబంధాన్ని_ఒక స్వర్గాన్ని చేజార్చుకోరాదని..
1463. జీవితం రెట్టింపైనట్లుంది_నీ ప్రేమ దొరికిన ఆనందంలోనే..
1464. సడి చేయనంటూ మువ్వలు_నీ నవ్వుల్లో ఒదిగిపోవాలని..
1465. మాటల్ని సమాధి చేయక తప్పలేదు_మౌనంపై మక్కువవుతుంటే..
1466. స్వరాలాపన పూర్ణమయ్యింది_మౌనం మువ్వై వినబడినంతనే..
1467. నీ మౌనం మధుపానమే_మాటలలోకి నేననువదించుకొనే వేళ..
1468. నీవెప్పుడూ కుసుమానివే_పరిమళం నాకందలేదంతే..
1469. స్పందన కరువైన మది_మనసు ప్రతిస్పందించలేనని మొండికేసి..
1470. విరహం దారి వెతుకుంది_నీ మౌనం సవ్వడిస్తుంటే
1471. శిశిరంలో తప్పిపోనందుకేమో_కోయిలనైనా కూయలేకున్నాను..
1472. విషాదగీతంగా మార్చావెందుకో_ఫలించలేని మన ప్రేమ బంధాన్ని..
1473. శ్రావణానికి కురిసిపోతాలే_మనసునోసారి తడిమిపోతానంటే
1474. వెన్నెల కరిగి నీవైనందుకేమో_నా మనసుకు సాంత్వనయ్యింది..
1475. మౌనంలో గుసగుసలెందుకో_మాటలు ముత్యాలై మోగుతున్నా..
1476. కొన్ని తప్పులంతే_ప్రశ్నించినా బదులు దొరకని విషాదాల్లో..
1477. కన్నీరు కంటిని వీడినందుకేమో_నవ్వులు పెదవులను వీడనంటున్నాయి..
1478. విషాదం చిలక్కొయ్యకీ_ఆనందం నీ నిజాయితీకి చేరువయ్యాక..
1479. ప్రేమఖైదీగా పడుందామనుకున్నాను_నువ్వు శుభలేఖనందిస్తావని తెలీక
1480. హృదయ కాసారం పరిమళిస్తోంది_నీవు పద్మమై తనలో తేలినందుకే
1481. అలుకను అస్త్రం చేసింది_నీ అమయకత్వాన్ని ఆసరా చేసుకొని.. 
1482. పగడాల కోసమేగా నీ పాట్లు_అందుకే అధరాలపై దొర్లించాను
1483. కల నిజమైతే పండుగే_నువ్వు నేనూ ఒకటైపోతే
1484. గుండె ఉప్పొంగినందుకేమో_వరదొచ్చి చూపును మసక చేసేస్తూ..
1485. నీ తలపే బృందావనం_కాలమాగిపోవాలని మదికనిపిస్తుంటే..
1486. వసంతం వినబడినట్లయ్యింది_తొలి కోయిల ఆరోహణావరోహణా స్వరాలతో..
1487. ఏ కొసమెరుపు కావాలనో_ఆగనంటూ నాలో అన్వేషణ..
1488. వసంతానికొస్తావని చూస్తున్నాను_నా అన్వేషణ వ్యర్ధం కాబోదని..
1489. ఇష్టమదులు ఉల్లాసాలేగా_అనురాగానికి ఆయువులు..
1490. జీవితమెన్నటికీ అర్ధంకాదు_హృదయమెప్పుడూ ఆవేదనలో మునిగితేలుతుంటే
1491. ఆరాటం ఆమడదూరమెళ్ళింది_నువ్వు సొంతమయ్యాక దిగులేముందని..
1492. నవ్వులన్నీ నీకిచ్చేస్తా_నీ మనసుకు సాంత్వన కావాలంటే..
1493. కంటెదుట దైవాలకు కన్నీళ్ళు_కనిపించని దైవానికి అభిషేకాలు..
1494. నేనెప్పుడూ చిరునవ్వునే_నీ పెదవులను ఆర్తిగా తాకలేదంతే
1495. ఎన్ని లయలు పోతుందో నడుము_గోదారి ఒంపులతో తనను పోల్చుతుంటే..
1496. తీగపాకమై సాగుతున్న వలపు_మన ప్రేమ ముదరబోతున్నందుకేమో..
1497. నాలో ఉన్న అనురాగం_నీకోసమే వినిపించానిలా..
1498. మనసు మత్తిల్లడమే గుర్తుంది_నీవేదైనా మంత్రమేసినందుకేమో..
1499. తనివి తీరనన్న తపన_నీ మనసు మూర్ఛపోతున్నా..
1500. చీకట్లెప్పుడో చెదిరిపోయాయి_నీ నవ్వుల వెన్నెలకి దారిచ్చి..

No comments:

Post a Comment