Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01901 నుండి 02000 వరకు

1901. నవ్వులన్నీ పోగేసుకుంటావెందుకో_భవిష్యత్తుకు బలమేదీ చేకూరకపోయినా..
1902. ఆకాశమంత పరిమళాలు_నీ చేయినందుకున్న నా పరవశాలు..
1903.  ఆత్మాభిమానాన్ని గెలిపించుకున్నా_ఓటమినంగీకరిం

చలేని నిస్సహాయతలో..
1904. అవే క్షణాలు కావాలనుకున్నా_పరవశాలు పున్నమికి తోడవుతాయని..
1905. వెనుకడుగేసింది ఓటమి_గెలిపందించే నిన్ను నాతో చూసినందుకే
1906. నిజమని నమ్మక తప్పలేదు_వాస్తవం తెలిపింది నీవని..
1907. జయించక తప్పలేదు చెలిమికి_వంచనను ఓడించాలని నిర్ణయం జరిగాక
1908. నీ చూపుతోనే వెన్నెల కాసినట్లుంది_మరో రాతిరితో నాకవసరమే లేదంటూ
1909. కాలానికి ఊపిరందింది_మనకోసం కాసేపు నిలిచి విశ్రమించగానే
1910. నీరెండ సోకినట్లుంది_నీ స్నేహమాధుర్యం నాపై వీచినందుకే
1911. ఆత్మీయతలో కనుగొన్నా_అనురాగానికి అవధులు అవసరమే లేదని...
1912. అనుభూతుల మకరందం నాదేగా_నీ చెలిమి మందారమైన వేళలో..
1913. మాటలగాలంలో చిక్కిన మనసేమో_మనసుతోనే రాయబారాలందుకుంటూ..
1914. ఊగిసలాడుతోంది నా మది_ఊసులన్నీ నీవైనందుకేగా
1915. చూపుతో రాసిన ప్రేమలేఖలేనవి_నువ్వు మనసుపెట్టి చదువుతావని
1916. నీ మనసు నా వశమయ్యింది_మచ్చిక చేసింది నా మనసేనని..
1917. మనో చింతన విడిచేసా_నీ మాటల మంత్రాలు పనిచేసే..
1918. మల్లెలకెప్పుడూ వంతులే_వైషాఖమొచ్చే దాకా ఆగమన్నా ఆగనంటూ..
1919. మౌనమేగా నీ ఆయుధం_నాపై అలుకను ప్రదర్శించేందుకు..
1920. బుగ్గలకు పాకిన సిగ్గులమందారాలు_చూపుల్లో చెంగల్వలుగా దాచుకున్నా..
1921. మాలోకమయ్యానప్పుడే_నీ జ్ఞాపకాలతో ప్రపంచాన్ని మరచిపోయాక
1922. ప్రేమగా తడిమిందేమో చినుకు_అవనికి అమ్మతనాన్ని గుర్తుచేస్తూ..
1923. ఉరిమిన ఆకాశానికి ఉలిక్కిపడ్డా_మెరుపుతీగలకు కళ్ళు మూతలువడి..
1924. నీ పిలుపు కొరకే వేచి ఉన్నా_కలగానైనా వద్దామని..
1925. నీ బాటనే పట్టేసా_నీడనిచ్చె తరువై నా తోడయ్యాక
1926. చినుకు హొయలు పోతోంది_అవనిని తాకేందుకు ఆకాశాన్ని విడిచొస్తూనే
1927. రుధిరం రంగు మారినట్లుంది_మానని గాయంతో స్రవించిన వేదనది..
1928. ఊహలన్నీ నిజమైనట్లుంది_అనురాగం అదేపనిగా వినబడుతుంటే
1929.సరిగమలే మరచింది మది_నీ హృదయసవ్వళ్ళను ఆలకించే ఆనందంలో..
1930. భవిష్యత్తు కుంటుపడుతుంది_వర్తమానాన్ని వాయిదా వేస్తూ నువ్వుంటే
1931. నీ చెలిగానే మిగిలిపోతా కలకాలం_చెలిమినిలాగే పంచుతూంటే
1932. వెన్నెలై విచ్చేసా_వేకువ వరకూ వేచుండే వీల్లేదని వలపంటుంటే..
1933. గమ్యం నువ్వై నిలిచావనుకున్నా_గమనంలో నా తోడున్నావని గుర్తించక..
1934. బంగారు బాల్యం గుర్తొస్తోంది_వర్షంలో కాగితపు పువ్వులలా తేలియాడుతుంటే
1935. నవ్వులవాన కురిసినట్లుంది_నీ అభిమానం పెదవుల జారుతుంటే
1936. రాణీవాసం నిజమయ్యింది_నీ హృదయంలో పీఠేసి కూర్చోబెట్టాక
1937. నీరవం నెమ్మదించింది_వేకువ వెలుగులతో జగమంతా పండుగయ్యాక..
1938. నవ్వొకటే నేస్తమయ్యింది_అలవికాని ఆవేదనను జయించాలనుకున్నందుకు..
1939. ముద్దపువ్వులా ముడుచుకుపోతున్నా_మమకారంలో కారమెక్కువయ్యి..
1940. ఈ జన్మకింతేనేమో_నీ ఊహలతోనే కాలమిలా గమనమవుతూ..
1941. విడువాలేమో వ్యక్తిత్వం_నా అభిరుచులన్నీ నీకు చేదయ్యాక
1942. నీ తలపు పారిజాతాలే_ప్రతిరోజూ కొత్తగా నన్ను పుట్టిస్తూ..
1943. ముత్యాలవ్వుతూ నా నవ్వులు_సంద్రమై సాగి గగనమంటాలని..
1944. తుళ్ళింతలవేగా నా ఎదలో_కలవరింతలకు కాలం తీరిందని..
1945. కన్నీరై కురిసిందేమో ప్రేమ_ఒక్క చినుకే వరదైనట్టుగా..
1946. ఎంత విశాలమయ్యిందో మది_కన్నీరలా నదిలా సాగుతోంటే.
1947.  జీవితపు చిక్కుముళ్ళు విడదీసిన చెలిమి_సాహిత్యాన్ని వారధిగా చేసుకొని..
1948. సాహిత్యాన్నే చెలిమి చేసుకున్నా_భావుకత్వాన్ని భద్రం చేసుకుందామని.. 
1949. సాహిత్యం వంటబట్టింది_నీ చెలిమి సౌరభాన్ని అద్దుకున్నప్పుడే..
1950. ప్రకృతిని దోచుకోక తప్పలేదు_సాహిత్యానికి సాయంగా వస్తుందేమోనని..
1951. అరిగిపోయిందేమో ఆత్మీయత_ఒంటరితనానికి నన్నిడిచేస్తూ..
1952. కొన్ని మౌనాలను చెదరగొడదాం_మన ఊసులను వినిపిస్తూ..
1953. నేనే నువ్వని ఒప్పుకోవేం_మనమిద్దరం ఒకటని నేనంటున్నా..
1954.నా మనసుకి మాటలొచ్చాయి_నీ పిలుపుకి స్పందించాలనుకోగానే..
1955. ఒళ్ళంతా కళ్ళయ్యాయి_ఏకాంతంలో రమ్మని నీ పిలుపందగానే..
1956. పగలే వెన్నెలైనట్లుంది_నీ మాటలకే పున్నమి వెలుగవుతుంటే
1957. కవితై అలరిన ఆలోచన_ప్రతి తలపూ నీదైనందుకే
1958.  నా లోకమెప్పుడూ తనే_తనెన్ని లోకాలు చుట్టొచ్చినా..
1959. మమకారం మంటెక్కింది_అధికారం తీపైనందుకే
1960. సొమ్ములున్నవి సొంతానికే_ధరణిపై మమకారమెంత నటించినా..
1961. నీ ఊపిరి గుసగుసలే_నాలో ప్రేమమాధురిని పాడుకున్నది..
1962. నీ వలపు ప్రణయమై పిలిచింది_పిలుపు పెదవి దాటి పల్లవించగానే..
1963. మరికొందరిలో జీవిద్దాం_అవయవదానానికి చేతులు కలిపి..
1964. సంధ్యకెందుకు సిగ్గయ్యిందో_రవి కాంచని చోటు ఈ కవి కాంచినందుకేమో
1965. నందనవనమే నీతో ఉంటే_నవోదయాలు నన్ను మేల్కొల్పినట్లు..
1966. మది విపంచికయ్యింది_నీ వేణు నాదానికి శృతి కలుపుతూ
1967. కొన్ని జీవితాలంతే_విడదీయలేని సమస్యల వలయంలో చిక్కుకుపోతూ..
1968. అవనిదెంతదృష్టమో_ఒక్కో చినుకు మువ్వను ముచ్చటగా తనలో దాచుకుంటే..
1969. పుడమికెప్పుడూ పండుగే_మేఘ నర్తనం చినుకుమువ్వలతో మొదలైతే..
1970. మురిపాలన్నీ మువ్వలవేగా_వర్ణాలన్నీ వెన్నెలయ్యేవేళ
1971. నీ హృదయం సాంతం నా సొంతం_మువ్వలు ప్రధాన ఆకర్షణగా..
1972. నన్ను నేనే మైమరచా_నీ మువ్వలసడిలో తప్పిపోయినందుకు..
1973. మంజీరాలదే మురిపెమంతా_ఆనందానికి అంతిమవిజయం తనదైతే..
1974. వశం తప్పుతున్న మనసు_మువ్వల రాగంలో పరవశమవుతుంటే
1975. ఏకాంతంపై మనసవుతోంది_మౌనాలన్నీ మువ్వలుగా సవ్వడిస్తుంటే..
1976. మువ్వల భాష నేర్చానందుకే_నా రాకను నీకు విన్నవించేందుకే
1977. జంటగా నేనొచ్చా_మువ్వలూ నువ్వూ నాకెంతో ఇష్టమనే..
1978. వలపు మౌనాక్షరాలేగా అవన్నీ_మువ్వలుగా మదిలో సవ్వడిస్తూ
1979. మువ్వలను దాటి మోగిన హృదిగంటలు_నీ ఎదలో చోటిచ్చావని..
1980. పాదాన్ని దాటి ప్రవహించిన మువ్వల సడి_నీ హృదయాన్ని తాకాలని
1981. అడుగులకీ రవమొచ్చింది_నీవు పంపిన మువ్వల గలగలతోనే..
1982. నవ్వుల్లో రాలిపడుతున్న మువ్వలు_మదిలో మెదిలింది నువ్వనే..
1983. అందెలకెంత అల్లరో_అడుగులు నీవైపు పదమంటుంటే
1984. ఎన్ని అందెలు ఘొల్లుమన్నాయో_మదిలో ముత్యాలవసంతం మొదలవగానే
1985. మరోసారి మువ్వై మోగింది మది_నీ మాటలకు సంతసము తూగ..
1986. చీకటిని చేధిస్తూ నా మువ్వలు_నీ రాతిరి ఆనందానికి ఆజ్యమవుతూ..
1987. గంటలు క్షణాలై కరుగుతున్నవి_జ్ఞాపకాలు మువ్వలై వెల్లువవుతుంటే
1988. అస్పష్టమైన ఆనందమొకటి_నా మువ్వలు నవ్వినప్పుడల్లా..
1989. సంధ్య వెన్నెల నక్షత్రాల్లా మువ్వలు_అతని రాతిరికి వెలుగునిస్తూ
1990. వెన్నెల జల్లొకటి కురిసినట్లుంది_రాతిరికి అందెలు రవళిస్తుంటే..
1991. భాష్ప ముత్యాలే నా కన్నుల్లో_నవ్వుల మువ్వల కానుక నీవయ్యాక..
1992. మువ్వలపై మోజే నాకెప్పుడూ_సవ్వడితోనే మనసు దోచేస్తాయని..
1993. తారాలోకానికి తరలొచ్చినట్లుంది_మువ్వల రవళికి మనసూగుతుంటే
1994. ఎన్ని మువ్వలు రాలిపడ్డాయో_నీ ఆనందంలో తాము చేరినందుకు..
1995. ఆనందాన్ని గజ్జెకట్టుకున్నా_నీ అడుగుల్లో నే నడవాలనే..
1996. సంగీతమై సాగిన ఆనందం ఎదలో_మోగిన మువ్వలే సాక్షిగా
1997. వేరే మువ్వలెందుకులే_నీ నవ్వుల్లో రవాలే ప్రియమవుతుంటే
1998. మువ్వలు నవ్విన సాయంత్రమొకటి_నీలా నన్ను మార్చేసింది..
1999. మోవి పలికిందొక ముద్దుల మాట_మువ్వల సడిలోనే కలిపేస్తూ..
2000. జాబిలమ్మెందుకు అలిగిందో_మువ్వలకు నీవు మక్కువయ్యావని నేనంటే..

No comments:

Post a Comment