Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 00901 నుండి 01000 వరకు

901. కొదవలేని కోరికలెన్నో_జాబిల్లివని నన్ను పొగడగానే
902. పొగడపువ్వులెందుకులే మనకు_పొన్నపువ్వున్నవిగా అల్లుకుపోయేందుకు..
903. సురపొన్నలను మోసుకొచ్చానందుకే_నీకు మక్కువని మనసెరిగి..
904. హృదయపు మెల్లకన్ను గమనించనట్లున్నావ్_అటుచూస్తుంటే ఏదేదో ఊహించుకొని..
905. హృదయతీరం మెరుస్తోంది_నీ గవ్వల జ్ఞాపకాలను ఏరుకుంటుంటే.
906. రెప్పలకొలువులో నేను రాణినేగా_వేరే ప్రత్యక్షానికి ప్రార్ధనలెందుకు..
907. అక్షరనౌకలో చేరిపోయాను_నన్ను ఆవిష్కరించుకొనే అవకాశమిచ్చిందనే
908. అక్షరాలెన్ని దాచుకున్నానో_ఆనందాన్ని రాయాలంటే మరిన్ని కావాలని..
909. కోటికన్నుల్లో నా రూపమేగా_కలువలనెందుకలా కసురుకుంటావు..
910. కలువల కోలాటాలు_నీ కన్నుల్లో వెచ్చని చోటు తమదయ్యిందని..
911. వేరే ఆనందాలెందుకు_అవ్యక్తమైన సంతోషం కన్నులు కురిపిస్తుండగా
912. ఊసుల పరవశాలు_నీ ఊహల సందళ్ళలో తామూ నాట్యమాడాలని..
913. అవే ఊహలు_ఎదనో నందనవనం చేసి పూబాలలను కవ్విస్తూ..
914. పువ్వుల మకరందపు లాస్యాలు_మధుపాలొచ్చినా తిరగగొడుతూ..
915. పువ్వులకెందుకో మైకం_నాట్యం ఆడుతున్నది నా ఊహలైతే
916. సిగ్గులేని కోకల మాటలెందుకులే_పల్లవిస్తున్న వలపును పట్టించుకోక
917. ఉరకలేస్తున్న వరదగోదారిలా నాలో ఊహలు_ఎదురుగా కిన్నెరాంగనలా నిలబడ్డావని
918. కిన్నెరసానిని కాలేనందుకు బాధపడుతున్నా_గోదారిలో నేనో పాయనని తెలిసినా
919. ఆనందాన్ని జార్చేయడమెందుకు_వసంతమొచ్చే వేళదాక వేచుండక
920. వసంతానికెందుకంత కులాసానో_హేమంతపు చలికోరాల్లో నేను చిక్కుతుంటే
921. శిశిరమొకటి అడ్డుపడుతుందని మరచావెందుకో_వసంతానికి వేగిరపడుతూ
922. శిశిరమంటే భయమేస్తుంది_ఆశలనెక్కడ రాల్చేస్తుందోనని..
923. ఆశలజోలికి పోని శిశిరం_ఆకులను మాత్రమే ఆరగిస్తూ
924. గోదారంటే నేనేగా_నీ మది నిత్యపుష్కరిణిలో ఉరకలేస్తూ..
925. తారల కొదవేముంది ఏక్తారలో_పగటిపూటలోనూ మిణుక్కుమంటూ
926. నీ ఆశలను గౌరవించినందుకేగా_నా ఊసులను జతచేసింది..
927. ఎన్ని ఊసులను రంగరించాలో_నీ ఊహలతో కలిపి రాయాలంటే నా కలం..
929.  కలానికెన్ని అవకాశాలో_ఊహలనూ ఊసులనూ లెక్కగట్టకుండానే రాసేస్తూ
930. భావుకత్వం తీపయ్యింది_తాగేకొద్దీ మధువులూరుతుంటే
931. భావాలు సరిపడకపోతేనేమి_ఏక్తారలో అనేకభావాలు మెరుస్తుండగా
932. సరికొత్తభావాల మొలకలు_ఏక్తారాకాశంలో హృదయం సంతసించిందని..
933. నిన్నటి ఊహలేనవన్నీ_ఉదయానికి కొత్త రంగులు పులుముకొని
934. హరివిల్లుకెందుకో మనసు గుచ్చుకుంది_నీ ఊహలకి రంగులెక్కువవుతుంటే
935. ఎన్ని రంగులుంటేనేమి_సంక్రాంతి ముగ్గులకు ఒక్కరంగు అరువివ్వలేదుగా హరివిల్లు
936. ఊహలన్నీ మూకుమ్మడి దాడి_హరివిల్లుతో తమకి పోలికెందుకంటూ..
937. హరివిల్లుహొయలు కాజేసినవిగా ఊహలు_మాటుకీ రహస్యంగా తొంగిచూస్తూ
938. గిలిగింతలు పెట్టినప్పుడే అనుకున్నా_నా చిత్రాలు గీసింది నీ కుంచేనని..
939. చిత్రాలకే చిత్రానివి నీవు_అచ్చెరువై నిలబడిపోయే అందాలతో..
940. చిత్రమైన హింసెందుకో మనసుకి_నీ జ్ఞాపకాలు తడిమినప్పుడల్లా..
941. వసంతానికి ఉరకలేస్తున్న భావాలు_శిశిరాన్ని దాటితే చాలనుకుంటూ..
942. సౌభాగ్యాన్ని వాడితో ఎందుకు ముడిపెట్టారో_అభాగినిలా నేను పడుంటే
943. ఆలి అల్లం అవుతుందటే ఏమోననుకున్నాను_అత్తగారు పక్కనున్నప్పుడని తెలిసింది..
944. చీమలింత చిలిపివనుకోలేదు_చలితో పోరాడుతుంటే తామున్నామని గుర్తుచేస్తూ..
945. కట్టేసుకుంటున్నాని గమనించినట్లున్నాడు_పంచెకట్టు మానేసాడు మగడు..
946. ఆ చూపుల్లో ముళ్ళున్నవని గుర్తించలేదు_మొదట మెత్తగా తాకినవనుకొని..
947. చేతులు కలిపితే చప్పట్లనుకున్నాను_గమ్మత్తుగా మైకమిస్తున్నడని తెలీక
948. మగని శాంతి మనసులో ఉండాలి_ఇంట్లో బయటపెడితే మరో యుద్ధమవుతుంది..
949. అపశృతులు సవరిస్తూనే ఉన్నానప్పటికీ_గుట్టు బయటపెట్టుకోరాదని..
950. సన్నాయి నొక్కులెక్కడ నేర్చిందో అత్త_నా సంగీతానికి తాను పోటీ అవుతూ..
951. సంతంటే గుర్తుకొచ్చింది_ఈరోజు ఆదివారం సాయింత్రానికల్లా అత్తాకోడళ్ళం కలిసిపోవాలి..
952. మగనికేమున్నవిలే బాధలు_వారంతమొస్తే విశ్రాంతికి ఎత్తులేగా
953. మగడు మనసు దాచినప్పుడే అనుకున్నా_మదిలో ఏదో మేళవింపు జరుగుతోందని..
954. ద్రాక్షతీగలా అల్లుకుపోదామనుకున్నా_ఈ చిటారుకొమ్మలను నేనందుకోలేకనే
955. పులకింతల పర్వమైతే ఫర్వాలేదనుకున్నాను_ఈలోపునే ఈ సాధింపులేమిటో..
956. మాట వినే విపంచి నాదగ్గరుందిలే_సరికొత్త తీగలతో ముస్తాబు చేస్తానంటే సరి..
957. అలుపెరగని కెరటాలైన ముచ్చట్లు_హేమంతంలో ముచ్చెమటలు పట్టిస్తూ..
958. అతిగా ఆవేశమెందుకులే_మగువని మక్కువగా చేరదీయక..
959. నా స్వరమిచ్చానందుకే విపంచికి_రాగాన్ని మధురిమ చేయమని..
960. వసంతం దాకా ఆగలేననుకున్నా_కిందటేడాది దాచిపెట్టిన మావిచివ్వుళ్ళను మెక్కేస్తూ
961. శిశిరమెందుకో నత్తనడక నడుస్తోంది_ఆకులను రాల్చేయడం ఇష్టం లేకేమో
962. వగరైన వేపపూతలో మామిళ్ళను కలుపుతున్నాను_ఎలానూ ఉగాది వస్తుందని..
963. చూపులతో చలి కాచుదామనుకున్నా_ఆవిరవుతుందని దూరమవుతావని తెలియక
964. చెప్పుకోలేని కాట్లు మిగిలే ఉన్నవిగా_కోయిలమాత్రం ఎన్నని వినిపించగలదని..
965. మరందాల మోవి చిన్నబోయిందెందుకో_తీపికోసం తానొస్తే వగరు తాగిస్తున్నందుకు..
966. ముందే కూసిన కోయిలమ్మలా నేను_ఏక్తార వసంతాన్ని పిలుపొచ్చిందనే
967. వలపు చిగురించిందందుకేగా_పరిమళాకే పూతొచ్చే ప్రేమనీకుందని..
968. శ్రీమంతుడనే హేమంతుని వలచాను_నన్ను పువ్వుల్లో దాచుకుంటానన్నాడని..
969. అక్షరాలను ఆరగించినందుకేమో_కోయిల చిలిపిమాటలనే పాడుతోంది
970. చేమంతైనప్పుడే అనుకున్నా_చెక్కిలి మీటిన చొరవ నీదేనని..
971. మందస్మితగానే గుర్తుపడుతున్నావుగా_నేను తలొంచుకుంటే చూడలేనంటూ
972. వాసంత గీతిగా ఉండటమే నాకిష్టం_హేమంతమెన్ని ఎత్తులేసి పిలిచినా
973. ఋతురాగమెక్కడ గుర్తుందిలే_మోహనాన్నీ సరిగా అర్ధం చేసుకోలేని నాకు..
974. ఆకాశమూ మాట వినకుంది_పూలవానలు నేనడిగితే తేనెవాలను కురిపిస్తూ..
975. కాంబోజి అందుకే దూరమయ్యింది_కదనకుతూహలంతోనే ఎగిరిపడుతున్నావని..
976. మోయలేకున్నా తీపినింక_కాస్త మమకారమొచ్చి కలిస్తే బాగుండనుకుంటూ..
977. సప్తపదులకోసం వచినప్పుడే అనుకున్నా_నీ రాగం తానంలో నన్ను కలుపుకున్నావని...
978. మాయని మమతైతే చాలులే_వేరే ప్రేమెందుకు మనమధ్యనంటూ..
979. చరణాలను పూరించలేక వదిలేసా_పల్లవిగా నువ్వు నచ్చావనే
980. కాలానికెప్పుడూ కనికరమే లేదు_మనసుని కరకజ్జం చేసి నమిలేస్తూ
981. మరుడింటికి పిలవలేదనుకున్నా_వలపు దాచుకొని నువ్వు కూర్చుంటుంటే
982. అమ్ములపొది విస్తుపోయింది_బాణాలలా ఊరికే వినాశనమవుతుంటే
983.  కన్నీరందుకే తీపయ్యాయి_నీ హృదయపు నవ్వును ఆలకించినందుకే
984. ఎన్ని విద్యలు నేర్పాలో కాలానికి_కనికట్టుతోనే తాను ఆగిపోతానంటుంటే
985. నందనవనమయ్యింది మది అందుకేగా_నీ పూలబాణాల విత్తుల నాట్లకేగా
986. కృష్ణుడిగా రూపం మారిందని మరచిపోయా_రాధ నన్నావహిస్తుంటే
987. చెలిమికి కొత్త చిగులేస్తున్నవి_ఏక్తారలందరినీ ఒక్కటిగా చూడాలనే
988. అర్ధాంగి అంగీకారం మారుతోంది_ఆరున్నొక్కరాగంతో వలపును కలిపేస్తుంటే
989. ఎన్ని కలల జాబిళ్ళో ఎద పాలపుంతలో_అమాస దగ్గరవుతుందని తెలిసీ..
990. పంచమవేదాన్నే ప్రామాణికం చేసుకున్నాను_నీ అనురాగం వినబడుతోందని..
991. నీడలా వెంటాడుతున్న నిశీధి_ఆకాశవెన్నెలలు తనకు పడవంటూ..
992. అనురాగంతో శృతి కలిపితే చాలనుకున్నా_నేనే లయమైపోవొచ్చని..
993. అవనికెందుకివ్వడం ఆక్రోశం_నిశీధిని మనమే ఎదురించి పోరాడక
994. భావానికి తాళం సరిపోయింది_శృతిలయలను అందుకే రావొద్దన్నా..
995. విక్రమార్కుడు భేతాళుడి వెంటపడ్డంతుకేమో_అక్రమార్కులంతా అవనిలోనే..
996. నడక తడబడ్డప్పుడే అనుకున్నా_తాళమెక్కడో శృతి తప్పిందని..
997. బాల్యాన్నెందుకు గుర్తుచేస్తావో_వినువీధుల విహారాలన్నీ కళ్ళకు అద్దుతూ..
998. ధైర్యమీక్కువే నీకు_తూరుపు చెక్కిళ్ళను ఎర్రబరిచేంత..
999. నీరెండనవ్వునై నేనున్నాగా_మనసు గగనవీధిలోకి పల్లకిని మోస్తూ..
1000. పశ్చిమాన్ని కాదనలేని సూర్యుడు_ఎంతసేపూ నీకే వెచ్చదనం కావాలంటుంటే

No comments:

Post a Comment