Wednesday, 6 July 2016

ఏక్ తారలు : 01201 నుండి 01300 వరకు

1201. నేనూ తుంటరినే_ఒంటరిగా నువ్వెప్పుడుంటావా అని ఎదురుచూస్తూ.
1202. వసంతానికే వసంతమొచ్చింది_నువ్వే కోయిలవై కలకూజితాలు వినిపిస్తుంటే.
1203. కనులకెంత కినుకో_కలలో వస్తానని మాటిచ్చి మాయమైపోతే..
1204. సిగ్గుపూల సువాసన తడిమినట్టుంది_నీ తలపుల సుగంధం వీచినప్పుడల్లా.
1205.  ప్రణయోత్సవమే మదికి_నీవు ఆలపించిన కలకూజితాలు వినపడితే..
1206. మేఘాన్ని అర్ధిస్తున్నా_చినుకుల్ని అప్పుగా ఇవ్వమని కన్నీళ్ళను దాచేందుకు..
1207. ఒక ఉత్తుంగతరంగం నింగిని చుంబించినట్లుంది_నన్ను నీవు తాకిన మత్తులో..
1208.చంచలమవుతోంది మనసు_భగవంతునికర్పిస్తే స్థిరం చేసి ఇస్తాడేమో.. 
1209.ప్రేమెపుడూ అనంతమే_అంతులేని సాగరం సాక్షిగా..
1210. మధువనమే అయ్యింది మది_మురళీరవము ప్రియమారా వినగానే..
1211. మురిపించింది మోహనరాగమై_సమ్మోహనంగా మారి మది నింపుతూ..
1212.  మార్గం సుగమమే_మార్గదర్శివై నువు వెంటుంటే..
1213. ఆగమ్యగోచరమే పయనం_జీవితపునావకి చుక్కాని చించేసావుగా..
1214.  జ్ఞాపకాల విత్తనాలు ఏనాడో చల్లాను_నేడవి చిగురించినట్లున్నాయి..
1215. మధువనమౌతోంది మనసు_ప్రియమైన పలుకులు వింటుంటే..
1216. మధువనిలో రాధికనే_ప్రియగీతికలు ఆలపించే సమయాన..
1217. గాయాలన్నీ గేయాలే_ఆత్మసౌందర్యాన్ని అందంగా ఆవిష్కరిస్తూ.
1218. అందానికీ అమరత్వమేగా_ఆత్మకి సాక్షిలా నాలో నువు కొలువై ఉంటే...
1219. అందం సైతం విస్తుపోయింది_నీ మనసద్దం ముందు తనను చూసుకొని..
1220. గాయాలన్నీ గేయాలే_ఆత్మసౌందర్యాన్ని అందంగా ఆవిష్కరిస్తూ..
1221. చిన్నగీతా పెద్దగీతే_మరింత చిన్నగీత ముందు ఎదురెళ్తే.
1222. అందానికి అందానివే_సౌందర్యానికి మకుటానివై ఎదురొస్తూ
1223. మనసుని చేరవుగా_చెవిని తాకే చెరుపు మాటలు..
1224. చెప్పలేని తాదాత్మ్యతే మదికి_హృదయంలో కుంచెముంచి చిత్రించావుగా నన్ను..
1225. వలపుకెంత హొయలో_నీ భావములో భాగ్యముగా ఒదిగినందుకు..
1226.నవ్వులన్నీ నావేగా_అంకితమైన నీ చిలిమికి సాక్షిగా.
1227. నిచ్చెమల్లిపువ్వుగా మారిపోనా నేను_అనునిత్యం నువ్వలా నవ్విస్తే..
1228. కోరికల కొమ్మలెప్పుడూ పచ్చనే_ఆశల కత్తిరింపు జరిగేవరకూ
1229. అమ్మని మించింది లోకాన లేదుగా_దేవుళ్ళు సైతం ఈర్ష్య పడేది అందుకేగా..
1230. ఊయలలూగా నీ ఊహల్లోనే_శ్వాసని నేనయ్యా నీ ఊపిరిలోనే..
1231. భాగస్వామినేగా నీకు_చెలిమి సాంగత్యంలోనే కాక కలిమి కన్నీళ్ళలో సైతం..
1232. నా వలపు పిలుపులు నీకొరకే_మూసిన తలపుల తలుపులు తెరిచే వరకు..
1233. తలపుల పరవళ్ళే_అలుపెరుగని నీ వలపుల పిలుపులకి.
1234. పరిచితమైన సుగంధమే_గతజన్మల సాంగత్యామేదో గుర్తుచేస్తున్నట్లు
1235. వయ్యారానికి కొత్త నయాగరాలు_వినాలనిపించే కొద్దీ ప్రియ గమకాలు.
1236. అమావాస్యలు సైతం పున్నములే_అమలినమైన ప్రేమ సొంతం అయినప్పుడు..
1237. రాగాలన్నీ చిన్నబోయాయి_నీ అనురాగాన్ని మాత్రమే మది ఆలపిస్తుంటే..
1238. సరసం విరసమయ్యింది_సమయం సందర్బం లేక నలుగురిలో..
1239. సరసాల సామ్రాట్టువే_నవరాసాల్ని ఏకాగ్రముగా ఔపాసన పట్టినట్టు..
1240. వేధించావుగా నా లేతప్రాణాన్ని_సంధించి సుమశరాన్ని
1241. వ్యర్ధమే_తన పొరపాట్లను గుర్తించలేని అపూర్వ మనస్సు
1242. గమ్యం గోచరమైందిగా_గంటస్తంభంలా నువ్వు వెలుగు దారి చూపిస్తుంటే..
1243. అంతరంగపు ఆందోళన_ఏ పాపం శాపమై పరిణమిస్తుందోనని.
1244. చిన్న చిరునవ్వుతోనే నేస్తాలైనా..చిరంజీవులైనా..
1245. చివురులు వేసిన కలలన్నీ చిదిమేసా_ఊహల రెక్కలను నువు కత్తిరించావని.
1246.  ఏం చేయను_ పీడకలలే వస్తున్నాయి కమ్మనికల కోసం నిదురించిన ప్రతీసారీ....
1247. ముంగిట్లో నిలబెట్టావు మధువనాన్ని_ఇన్నాళ్ళు నేను వాయిదా వేసిన వసంతాన్ని..
1248. ఉన్నావుగా తోడుగా నాకు_హేమంతపు స్పర్శతో పలకరించడానికి ప్రేమగా..
1249.  కొంగొత్త ఆశలే విరిసాయి జీవితంలో_సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ..
1250. నిన్ను తాకిన నెలవంకే_ నిండు చందమామగా మారింది.
1251.  అంది అలరిస్తుందిలే_అందని జాబిల్లి సైతం మనసుపడి నువ్వు పిలిస్తే..
1252. అమ్మెప్పుడూ అపురూపమే_చింతలు యెదలో దాచి చిరునవ్వుతో లాలిస్తుంది కదా..
1253.  మానవ'కులం' బ్రతికే ఉందనిపిస్తుంది_కొందరి సేవాదృక్పధం త్యాగనిరతి తిలకిస్తే...
1254. పులకించిన తనువే ప్రేమతో_జుగుప్సతో జలదరిస్తుంది నీ అంతరంగం అవగతమయ్యాక...
1255. జాత్యాహంకారం ద్యోతకమవుతోంది_ప్రతీ పదములో పురుషాహంకారం ధ్వనిస్తుంటే..
1256. పొలమారుతుంది పదేపదే_గుర్తొస్తున్నావుగా మరి..
1257. పచ్చని వసంతమే మదికి_సస్యశ్యామలం కళ్ళారా తిలకిస్తే..
1258. నీ రూపం ఎప్పుడూ పదిలమే_గుండె గుడిలో ప్రతిష్టించానుగా భద్రంగా
1259. ప్రతీ అడుగూ నీవైపే_తడబడినా పట్టుకునేందుకు నీవున్నావనే..
1260. పక్కలోనే ఉంటాయిగా బల్లాలు_పొడిచినట్లు తెలీకుండా పొడుస్తూ..
1261. మెరుపులూ మెటిక విరిచాయి_నీ మేను విరుపులు చూసి..
1262. ఆనందపారవశ్యమే_తొలిచినుకు నీవై తొలిసారిగా నను తాకినందుకే..
1263. నేనెప్పుడూ నిన్నల్లోని జ్ఞాపకాన్నే_వాస్తవంలో వరం కాలేని శాపాన్నే..
1264. వయ్యారాల కలువనే_నీ మనో కొలనులో యధేచ్చగా విహరిస్తూ..
1265. పరిమళించాయిగా పరిచయాలన్నీ_అతిథులై అనుక్షణం అలరిస్తూ..
1266. అల్లుకున్నా లతనై_జీవితం నందనవనం అవుతుందని..
1267. ఆత్మాభిమానమే అలంకారం_అహంకరించే గోముఖాలకి ధీటుగా
1268. వెన్నెల సోయగాలే_నన్ను మైమరపించే నీ వన్నెల మురిపాలు..
1269. మనసూ మురుస్తోంది_ఆకాంక్షా తారల్లో తేలిపోతున్నానని..
1270. నీ సప్తవర్ణాలు చూసేనేమో_తెల్లని నా మనసు రంగుల సీతాకోకయ్యింది..
1271. ఆ మనిషికి మనసేలేదు_ఇచ్చే ఊసేముంటుందిక.
1272.చూపుకోణాల కొంటె బాణాలే_లేలేతప్రాయపు ప్రాణాలు తోడేస్తూ
1273. ఆనంద జలపాతాలు నీ చెంతనే ఉండగా_ఐశ్వర్యజలపాతాలేల దండగ
1274. మనసు మరుగున పడిందేమో_మరమనిషి ఉద్యోగధర్మంలో..
1275. దాహం అప్పుడే తీరుతుందేమో_ధనానికి దాసోహం కాదుగా కన్నీరు
1276. మందగమనం మాయమయ్యింది_నీ మధురవచనాల మైమరపులో
1277. ఊసుల ఇటుకలు పంపిస్తా_ఊహల మెట్లు అందంగా అమరుస్తావని..
1278. మమతల మరువమే_మంచితనమై నిలువెల్లా ముంచుతూ
1279. తారలన్నీ తయారే_వచ్చి సితారపై వాలాలని
1280. అలుకలకి కలవరమే_తనను వీడి చెలి నీ చెత కట్టిందని
1281. నా పెదవి తీయగా మారింది_నీ పేరుని పలుకుతున్నందుకే
1282. కలానికీ కలకలమేనట_కవితల ఝరిలో కొట్టుకుపోతూ
1283. నీ సరసాల మేలుకొలుపే_ప్రతీ ఉదయం ఉత్సాహానికి ఊతమిస్తూ
1284. జనాలకెప్పుడూ ఆత్రమే_సరికొత్త రంగులు పూసే తొందరలే..
1285. నాదెప్పుడూ నిజాయితీనే_అబద్దలతో మెప్పించే పద్ధతి నచ్చదుగా..
1286. నేనెప్పుడూ నేనే_నీ మనోవైఖరికి నచ్చినట్లు అద్దంపడుతూ..
1287. నిజమూ నిప్పులాంటిదే_ముట్టనిదే మనసుకి విముక్తి లేదంటూ..
1288. పరమాన్నం నాకిష్టమే_మరింత చెలిమి తీపి కోరుతూ..
1289. ఆప్యాయతల అన్నప్రాసనే_నలుగురిని నీవారిగా కలుపుకుంటూ..
1290. ఆప్యాయతకీ ఆంక్షలట_అనురాగబంధంలో ఇమడలేనంటూ..
1291. ఊసుల ఊరడింపే_రేపగలూ నన్ను ఊయలలూగిస్తూ
1292. మల్లిక పరిమళాలు మదికి_నే వివశమవుతూ నీ పిలుపుకి
1293. ఊపిరులన్నీ వాయులీనాలే_చెలి చెవిలో చిలిపి గీతాలై..
1294. నవరసాల కలువనేగా_సరస రేరాజువై నీవు వెలుగొందగా..!
1295. నిన్నటికంటే నేడే ఉత్తమం_రేపేమవుతుందో నాకు తెలియదుగా..
1296. శిశిరానికెంత కలవరమో_వసంతాలన్నీ నా కళ్ళలోనే కనిపిస్తున్నాయని.
1297. మయూరాలకీ గారాలే_అందెల మువ్వల అందాల చిన్నది తోడైతే..
1298. పెదవులూ తెల్లబోతున్నాయి_కళ్ళతో నవ్వే నీ కనికట్టు చూసి..
1299. మల్లెలెప్పుడూ తెల్లనివే_నవ్వులే అప్పుతెచ్చా సొబగులద్దాలని..
1300. ముసుగు దెయ్యానిగా మారిపోయా_అందాన్ని కబళించే కాలనాగులున్నాయని..

No comments:

Post a Comment